Sushil Kumar : తిహాడ్‌ ఖైదీలకు సుశీల్‌ కుమార్‌ రెజ్లింగ్‌ పాఠాలు!

తిహాడ్ జైలులోని ఖైదీలకు ఇక నుంచి క్రీడల్లో శిక్షణ అందనుంది. ఆరు ఆటల్లో...

Published : 06 Mar 2022 01:12 IST

ఆరు క్రీడల్లో ప్రొఫెషనల్‌ కోచ్‌లతో శిక్షణ ఇప్పించేందుకు దిల్లీ జైళ్ల శాఖ నిర్ణయం

ఇంటర్నెట్ డెస్క్‌: తిహాడ్ జైలులోని ఖైదీలకు ఇక నుంచి క్రీడల్లో శిక్షణ అందనుంది. ఆరు ఆటల్లో ప్రొఫెషనల్స్‌తో శిక్షణ ఇప్పించేందుకు దిల్లీ జైళ్ల శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌తోనూ శిక్షణ ఇప్పిస్తామని జైళ్ల శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సుశీల్‌ కుమార్‌ తిహాడ్‌ జైలులోనే శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సహచర రెజ్లర్‌ మృతికి కారణమైనట్లు నేరారోపణలు రుజువు కావడంతో సుశీల్‌ను తిహాడ్‌కు తరలించారు. ఈ క్రమంలో సుశీల్‌ కుమార్‌ ఆసక్తిగా ఉంటే తోటి ఖైదీలకు రెజ్లింగ్‌తోపాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లో శిక్షణను ఇచ్చేందుకు అనుమతి ఇస్తామని జైలు అధికారులు వెల్లడించారు. 

‘‘సుశీల్‌ కుమార్‌ రెజ్లింగ్‌లో సుశిక్షితుడు. అతడు ఆసక్తి చూపితే బాడ్మింటన్‌, వాలీబాల్‌ సహా ఇతర క్రీడల్లో ఆడేందుకు అనుమతిస్తాం. అదేవిధంగా ఇతర ఖైదీలకు రెజ్లింగ్‌తోపాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై సుశీల్‌తో ట్రైనింగ్‌ ఇప్పిస్తాం. తిహాడ్‌ జైలు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఖైదీలకు ప్రొఫెషనల్స్‌తో ట్రైనింగ్‌ ఇప్పిస్తున్నాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ (ఐవోసీ) సీఎస్‌ఆర్‌ ప్రాజెక్టులో భాగంగా ఖోఖో, వాలీబాల్, బాడ్మింటన్, బాస్కెట్‌బాల్, చెస్‌, క్యారమ్స్‌  గేమ్స్‌లో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని దిల్లీ జైళ్ల శాఖ వివరించింది. ఆసక్తి కలిగిన ఖైదీలకు శిక్షణ కోసం వారానికి రెండు రోజులు కోచ్‌లను ఐవోసీ పంపిస్తుంది. ప్రతి ఆటలో 20 మంది సభ్యుల  చొప్పున అవసరమైన క్రీడా సామగ్రి, జెర్సీలను అందిస్తుందని సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని