R Ashwin : టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధిస్తాననుకోలేదు : అశ్విన్‌

టెస్టు ఫార్మాట్లో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును అధిగమిస్తానని ఎప్పుడూ అనుకోలేదని టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఇదంతా కలలా ఉందని పేర్కొన్నాడు...

Published : 10 Mar 2022 02:00 IST

ఇంటర్నెట్ డెస్క్ : టెస్టు ఫార్మాట్‌లో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును అధిగమిస్తానని ఎప్పుడూ అనుకోలేదని టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఇదంతా కలలా ఉందని పేర్కొన్నాడు. బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్‌ పలు విషయాలు వెల్లడించాడు. ఆ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. కపిల్‌ దేవ్‌ (434 వికెట్లు) రికార్డును అధిగమించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (436) పడగొట్టిన రెండో భారత స్పిన్నర్‌గా నిలిచాడు.  

‘టెస్టు క్రికెట్లో ఇన్ని వికెట్లు తీయడం నిజంగా కలలా ఉంది. ముఖ్యంగా, కపిల్ దేవ్‌ రికార్డును అధిగమిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంత గొప్ప ఘనత సాధించినందుకు కపిల్ పాజీ.. నాకు అభినందనలు తెలుపుతూ చేతితో రాసిన ఓ లేఖ, పుష్పగుచ్ఛం పంపిచారు’ అని అశ్విన్‌ చెప్పాడు.

‘కెప్టెన్‌ రోహిత్ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నాపై ప్రశంసలు కురిపించాడు. అతడు చూపించిన అభిమానానికి ఎలా స్పందించాలో తెలియలేదు. చాలా సంతోషంగా అనిపించింది’ అని అశ్విన్ అన్నాడు. ‘షేన్‌ వార్న్‌ స్పిన్ బౌలింగ్‌కే వన్నె తెచ్చాడు. ఒకనొక సమయంలో స్పిన్ బౌలింగ్ అంటే వార్నే గుర్తొచ్చేంతలా ప్రభావితం చేశాడు. ఇప్పటికీ ప్రతి రోజు మరింత మెరుగయ్యేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. సహచర ఆటగాళ్ల ప్రోత్సాహం, వాళ్లు అందిస్తున్న సహకారంతో ప్రస్తుతం ఈ ఘనతను ఆస్వాదిస్తున్నాను’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని