Shubhman Gill: ఆ రెండు ఫార్మాట్లలో దృష్టి పెడితే కెప్టెన్ అవుతాడు.. గిల్‌పై ఆకాశ్‌ చోప్రా కామెంట్స్‌

శ్రీలంకతో అరంగేట్ర మ్యాచ్‌లో అంచనాలు అందుకోలేకపోయిన శుభ్‌మన్‌ గిల్‌(Shubhman Gill)పై ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. 

Updated : 05 Jan 2023 18:15 IST

దిల్లీ: టెస్టులు, వన్డే క్రికెట్‌లో టీమ్‌ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ సత్తా చాటిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య శ్రీలంకతో సిరీస్‌ (IND vs SL 2023)తో టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే, మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఐపీఎల్‌తో పాటుగా ఇతర రెండు ఫార్మాట్లలోనూ అదరగొట్టిన గిల్‌కు పొట్టి ఫార్మాట్‌ అంతగా సరిపోదని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. 

‘‘శుభ్‌మన్‌ గిల్‌(Subhman Gill)కి ఈ సిరీస్‌ ఎంతో ముఖ్యమైంది. అతడు ఈ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టింది ఇప్పుడే కదా.. ఆడతాడులే అని మీరు అనుకోవచ్చు. కానీ, నేను గిల్‌ను సుదీర్ఘ ఫార్మాట్‌ ఆటగాడిగానే చూస్తాను. అతడు ఆడే విధానం టీ20 క్రికెట్‌కి సరైందికాదు. అతడిని టెస్టు క్రికెట్‌లో ఆడటం ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఆ ఫార్మాట్‌లో కెప్టెన్‌ అయ్యే అవకాశాలు గిల్‌కి ఉన్నాయి. అతడు వన్డేల్లో సైతం ఎక్కువ కాలం కొనసాగుతాడు. అందులోనూ కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఎక్కువే. అయినా, టీ20ల్లో ఇది అతడికి తొలి మ్యాచ్‌ కాబట్టి ముందు ముందు తన ఆటతీరుతో రుజువు చేసుకోవాల్సి ఉంది. అప్పుడు నాలాంటి వారు విమర్శించలేరు’’ అంటూ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

ఇతర ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘‘ఇషాన్‌ కిషన్‌ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి అతడిని విమర్శించడానికి ఏమీలేదు. ఇక సూర్యకుమార్‌ ఒకసారి ఔట్‌ అయినంత మాత్రాన ప్రతిసారి ఇదే పునరావృతం చేయడని తెలుసు’’ అని తెలిపాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. కీలక ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌, దీపక్‌ హుడా రెండు పరుగుల తేడాతో జట్టును గెలిపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని