Chennai vs Bangalore : టీ20 మెగా టోర్నీలో.. ఎట్టకేలకు బోణీ కొట్టిన చెన్నై..

టీ20 మెగా టోర్నీలో చెన్నై జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరు 193/9 స్కోరుకి పరిమితమైంది. దీంతో చెన్నై 23 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.

Updated : 12 Apr 2022 23:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో చెన్నై జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరు 193/9 స్కోరుకి పరిమితమైంది. దీంతో చెన్నై 23 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత చెన్నై గెలుపొందటం విశేషం. కాగా, బెంగళూరు జట్టుకిది రెండో ఓటమి. ఛేదనకు దిగిన బెంగళూరు బ్యాటర్లలో షాబాజ్‌ అహ్మద్‌ (41), సుయశ్ ప్రభు దేశాయ్‌ (34), దినేశ్ కార్తిక్‌ (34), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (26) రాణించారు. కెప్టన్ డు ప్లెసిస్ (8), అనుజ్‌ రావత్ (12), విరాట్ కోహ్లీ (1), వనిందు హసరంగ (7), ఆకాశ్ దీప్ (0) నిరాశ పర్చారు. మహమ్మద్ సిరాజ్‌ (14), జోష్ హేజిల్ వుడ్ (7) నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో మహేశ్ తీక్షణ నాలుగు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరీ, డ్వేన్‌ బ్రావో చెరో వికెట్ పడగొట్టారు.


కట్టుదిట్టంగా బౌలింగ్‌.. విజయం దిశగా చెన్నై.. 

చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ బెంగళూరుని కట్టడి చేస్తున్నారు. ధాటిగా ఆడుతున్న ప్రభు దేశాయ్‌ (34) 13వ ఓవర్లో రెండో బంతికి, 15వ ఓవర్లో మూడో బంతికి షాబాజ్‌ అహ్మద్ (41)ని మహేశ్‌ తీక్షణ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న దినేశ్‌ కార్తిక్ (13), వనిందు హసరంగ (1) ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపిస్తున్నారు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. బెంగళూరు విజయానికి ఇంకా 30 బంతుల్లో 77 పరుగులు కావాల్సి ఉంది.


పది ఓవర్లు పూర్తి.. స్కోరెంతంటే?

218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు తడబడుతోంది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 86/4 స్కోరుతో కష్టాల్లో పడింది. షాబాజ్‌  అహ్మద్‌(18*), ప్రభుదేశాయ్‌ (21*) క్రీజులో ఉన్నారు.  రవీంద్ర జడేజా వేసిన ఏడో ఓవర్‌లో హిట్టర్‌ మ్యాక్స్‌వెల్ (26) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 50 పరుగుల వద్ద చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. మొయిన్‌ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో 12 పరుగులు రాగా.. జడేజా వేసిన తర్వాతి ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి.  జోర్డాన్‌ వేసిన పదో ఓవర్‌లో ప్రభుదేశాయ్‌ రెండు ఫోర్లు బాదాడు. చెన్నై విజయం సాధించాలంటే 60 బంతుల్లో ఇంకా 131 పరుగులు చేయాలి.  


పవర్‌ ప్లే పూర్తి.. మూడు వికెట్లు

ఛేదనకు దిగిన బెంగళూరు జట్టుకు చెన్నై బౌలర్లు వరుస షాకులిస్తున్నారు. మహేశ్ తీక్షణ వేసిన మూడో ఓవర్లో కెప్టెన్ డు ప్లెసిస్‌ (8).. భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్‌ వద్ద క్రిస్ జోర్డాన్‌కి చిక్కాడు. ముఖేష్‌ చౌదరీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి విరాట్ కోహ్లీ (1) శివమ్ దూబెకి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. ఆరో ఓవర్లో గ్లెన్ మాక్స్‌ వెల్ (21) రెండు సిక్సులు బాదాడు. ఆఖరు బంతికి అనుజ్‌ రావత్ (12) ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి బెంగళూరు జట్టు మూడు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది.


భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరు బ్యాటర్లు..

చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బెంగళూరు బ్యాటర్లు బరిలోకి దిగారు. తొలి ఓవర్లో మొయిన్ అలీ ఒకే పరుగు ఇచ్చాడు. ముఖేష్ చౌదరీ వేసిన రెండో ఓవర్లో 10 పరుగులు ఇచ్చాడు.  డు ప్లెసిస్‌ (7), అనుజ్‌ రావత్‌ (4) క్రీజులో ఉన్నారు. దీంతో రెండు ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 11/0 స్కోరుతో నిలిచింది.


బౌలర్లను ఉతికేసిన ఉతప్ప, దంచికొట్టిన దూబె..బెంగళూరు ఎదుట భారీ లక్ష్యం

ఆరంభంలో తడబడినా చెన్నై బ్యాటర్లు నిలబడ్డారు. తొలి పది ఓవర్లకు 60/2తో నిలిచిన చెన్నై.. ఇన్నింగ్స్ ముగిసే సరికి 216/4 పరుగులు చేసింది. ఇంతటి విధ్వంసానికి ఓపెనర్‌ రాబిన్ ఉతప్ప (88 : 50 బంతుల్లో 4×4, 9×6), శివమ్ దూబె (95* : 46 బంతుల్లో 5×4, 8×6) అర్ధ శతకాలతో చెలరేగడమే కారణం. మరో ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ (17), మొయిన్ అలీ (3) త్వరగానే పెవిలియన్ చేరినా.. రాబిన్ ఉతప్ప, శివమ్‌ దూబె దూకుడుగా ఆడారు. కెప్టెన్‌ రవీంద్ర జడేజా (0) డకౌటయ్యాడు. ధోని (0) నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు ముందు చెన్నై 217 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బౌలర్లలో వనిందు హసరంగ రెండు, జోష్ హేజిల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.


ధాటిగా ఆడుతున్న చెన్నై బ్యాటర్లు..

చెన్నై బ్యాటర్లు వేగం పెంచారు. అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న ఓపెనర్‌ రాబిన్ ఉతప్ప (57), శివమ్‌ దూబె (50) బౌండరీలతో అలరిస్తున్నారు. హసరంగ వేసిన 11వ ఓవర్లో ఓ సిక్స్‌, ఓ ఫోర్ బాదిన శివమ్‌ దూబె.. ఆ తర్వాతి ఓవర్లో మరో సిక్స్‌ బాదాడు. మ్యాక్స్‌వెల్ వేసిన 13వ ఓవర్లో రెచ్చిపోయిన రాబిన్ ఉతప్ప.. ఏకంగా మూడు సిక్సులు బాదాడు. ఆకాశ్ దీప్ వేసిన 15వ ఓవర్లో రెండో బంతికి మరో ఫోర్‌ బాది ఉతప్ప అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో ఆఖరు బంతిని బౌండరీకి  తరలించిన శివమ్‌ దూబె కూడా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై 133/2 స్కోరుతో నిలిచింది. చెన్నై బ్యాటర్లు ఈ ఐదు ఓవర్లలోనే 73 పరుగులు రాబట్టడం విశేషం.


సగం ఓవర్లు పూర్తి.. చెన్నై బ్యాటర్లు ఎంత కొట్టారంటే.?

ఇప్పటికే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో చెన్నై బ్యాటర్లు వికెట్ కాపాడుకుంటూ ఆడుతున్నారు. మ్యాక్స్‌వెల్ వేసిన ఏడో ఓవర్లో మొయిన్ అలీ (3) రనౌటయ్యాడు. ఆకాశ్ దీప్ వేసిన ఎనిమిదో ఓవర్లో రాబిన్‌ ఉతప్ప (23), శివమ్‌ దూబె (16) చెరో ఫోర్‌ బాదారు. ఆ తర్వాతి ఓవర్లో దూబె మరో సిక్స్ బాదాడు. పదో ఓవర్లో షాబాజ్‌ అహ్మద్ ఐదే పరుగులు ఇచ్చాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. 


పవర్‌ ప్లే పూర్తి.. కట్టుదిట్టంగా బెంగళూరు బౌలింగ్.. చెన్నై స్కోరెంతంటే.?

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు నాలుగో ఓవర్లో జోష్‌ హేజిల్ వుడ్ షాకిచ్చాడు. నాలుగో బంతికి ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ (17) ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకు ముందు మూడో ఓవర్లో ఏడు పరుగులు ఇచ్చిన  సిరాజ్‌.. ఐదో ఓవర్లో ఆరు పరుగులు ఇచ్చాడు. ఆకాశ్ దీప్ వేసిన ఆరో ఓవర్లో రాబిన్ ఉతప్ప (14) ఓ సిక్స్ బాదాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి చెన్నై ఒక వికెట్ కోల్పోయి 34 పరుగులు చేసింది. మొయిన్ అలీ (3) క్రీజులో ఉన్నాడు. 


నిలకడగా ఆడుతున్న చెన్నై ఓపెనర్లు..

బెంగళూరు, చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ ఓడిన చెన్నై జట్టు బ్యాటింగ్‌కు దిగింది. రెండు ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. మహమ్మద్‌ సిరాజ్ వేసిన తొలి ఓవర్లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (6) ఓ ఫోర్‌ కొట్టాడు. రెండో ఓవర్లో జోష్‌ హేజిల్ వుడ్‌ రెండే పరుగులు ఇచ్చాడు. రాబిన్ ఉతప్ప (2) క్రీజులో ఉన్నాడు.


బెంగళూరుదే టాస్‌.. చెన్నై బోణీ కొట్టేనా.?

టీ20 మెగా టోర్నీలో మరో ఆసక్తికర మ్యాచుకు వేళయింది. చెన్నై, బెంగళూరు జట్లు మరి కాసేపట్లో తలపడనున్నాయి. టాస్‌ నెగ్గిన బెంగళూరు కెప్టెన్‌ డు ప్లెసిస్‌ బౌలింగ్‌కు మొగ్గు చూపాడు. చెన్నై జట్టుకు బ్యాటింగ్‌ అప్పగించాడు. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటి వరకు బోణీ కొట్టకపోవడం గమనార్హం. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో  అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, బెంగళూరు మంచి జోష్‌ మీదుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జరుగనున్న మ్యాచులో ఏ జట్టు ఆదిపత్యం చెలాయిస్తుందో చూడాలి.!

తుది జట్ల వివరాలు..

చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, రాబిన్‌ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, ఎంఎస్‌ ధోని, డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ జోర్డాన్‌, ముఖేష్‌ చౌదరీ, మహేశ్‌ తీక్షణ

బెంగళూరు : డు ప్లెసిస్‌, అనుజ్‌ రావత్, విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, దినేశ్ కార్తిక్, షాబాజ్‌ అహ్మద్‌, వనిందు హసరంగ, జోష్‌ హేజిల్ వుడ్, ఆకాశ్ దీప్‌, మహమ్మద్ సిరాజ్‌, సుయశ్ ప్రభుదేశాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని