Rajasthan vs Gujarat : దంచికొట్టిన హార్దిక్.. టాప్‌లోకి గుజరాత్

టీ20 మెగా టోర్నీలో గుజరాత్ జట్టు హవా కొనసాగుతోంది. 193 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది....

Published : 14 Apr 2022 23:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో గుజరాత్ జట్టు హవా కొనసాగుతోంది. 193 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. దీంతో 37 పరుగుల తేడాతో రాజస్థాన్‌ని ఓడించిన గుజరాత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్‌ జోస్ బట్లర్ (54 : 24 బంతుల్లో 8×4, 3×6) మినహా మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేకపోయారు. షిమ్రోన్ హెట్‌మయర్‌ (29), రియాన్ పరాగ్‌ (18), జేమ్స్‌ నీషమ్‌ (17), సంజూ శాంసన్‌ (11) పరుగులు చేశారు. మరో ఓపెనర్‌ దేవ్‌దత్ పడక్కల్ (0) డకౌట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (8), రస్సీ వాండర్‌ డస్సెన్ (6), యుజ్వేంద్ర చాహల్ (5) విఫలమయ్యారు. ప్రసిద్ధ్‌ కృష్ణ (4), కుల్దీప్ సేన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌, యశ్ దయాల్ మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమి, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్ పడగొట్టారు.


కట్టుదిట్టంగా బంతులేస్తున్న బౌలర్లు.. 

గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో రాజస్థాన్ స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. యశ్ దయాల్ వేసిన పదో ఓవర్లో వాండర్‌ డస్సెన్‌ (6).. కీపర్ వేడ్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత షమి వేసిన 13వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (29).. రాహుల్ తెవాతియాకు చిక్కాడు. అంతకు ముందు 12వ ఓవర్లో హార్దిక్‌ 8 పరుగులు ఇచ్చాడు. 14వ ఓవర్లో రషీద్ ఖాన్‌ ఐదు.. ఆ తర్వాతి ఓవర్లో షమి ఎనిమిది పరుగులు ఇచ్చారు. ప్రస్తుతం జేమ్స్ నీషమ్‌ (8), రియాన్ పరాగ్‌ (11) క్రీజులో ఉన్నారు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్‌ 130/6 స్కోరుతో నిలిచింది. రాజస్థాన్‌ విజయానికి ఇంకా 30 బంతుల్లో 63 పరుగులు కావాల్సి ఉంది. 


కీలకమైన వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌.. 

గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు పెవిలియన్‌ చేరడంతో రాజస్థాన్‌ స్కోరు వేగం నెమ్మదించింది. రాహుల్‌ తెవాతియా వేసిన ఏడో ఓవర్లో సిక్సర్‌ బాదిన సంజూ శాంసన్‌ (11).. ఫెర్గూసన్ వేసిన తర్వాతి ఓవర్లో ఔటయ్యాడు. హార్దిక్‌ పాండ్య అద్భుతమైన ఫీల్డింగ్‌తో శాంసన్‌.. రనౌటయ్యాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో ఆరు పరుగులు రాగా.. హార్దిక్‌ పాండ్య పదో ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోరుతో 89/4తో ఉంది. డస్సెన్‌ (6*), హెట్‌మయర్‌ (8*) క్రీజులో ఉన్నారు.  


పవర్‌ ప్లే పూర్తి.. 

ఆరంభం నుంచే ధాటిగా ఆడుతున్న ఓపెనర్‌ జోస్ బట్లర్ (54 : 24 బంతుల్లో 8×4, 3×6) అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే ఔటయ్యాడు. లాకీ ఫెర్గూసన్‌ వేసిన ఆరో ఓవర్‌ ఆఖరు బంతికి అతడు బౌల్డయ్యాడు. అంతకు ముందు మూడో ఓవర్లో షమి మూడు పరుగులు ఇవ్వగా.. యశ్ దయాల్ వేసిన తర్వాతి ఓవర్లో బట్లర్‌ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టాడు. రషీద్ ఖాన్‌ వేసిన ఐదో ఓవర్లో ఓ సిక్స్ కొట్టిన  రవిచంద్రన్‌ అశ్విన్‌ (8).. లాకీ ఫెర్గూసన్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి క్రీజు వీడాడు. సంజూ శాంసన్‌ (3) క్రీజులో ఉన్నాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి రాజస్థాన్‌ మూడు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. 


ఛేదనకు దిగిన రాజస్థాన్‌.. ధాటిగా ఆడుతున్న జోస్‌ బట్లర్‌..

గుజరాత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ బ్యాటర్లు బరిలోకి దిగారు. మహమ్మద్ షమి వేసిన తొలి ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన ఓపెనర్‌ జోస్ బట్లర్‌ (28).. అదే జోరును కొనసాగిస్తూ యశ్‌ దయాల్ వేసిన రెండో ఓవర్లో మరో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టాడు. ఆఖరు బంతికి ఓపెనర్‌ దేవ్‌దత్ పడిక్కల్ (0) శుభ్‌మన్‌ గిల్‌కి చిక్కాడు. దీంతో రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్‌ ఓ వికెట్‌ కోల్పోయి 28 పరుగులు చేసింది.


దంచికొట్టిన కెప్టెన్‌ హార్దిక్.. రాజస్థాన్ లక్ష్యం ఎంతంటే.?

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (87 : 52 బంతుల్లో 8×4, 4×6) అర్ధ శతకంతో సత్తా చాటాడు. అభినవ్ మనోహర్ (43 : 28 బంతుల్లో 4×4, 2×6), డేవిడ్ మిల్లర్‌ (31 : 14 బంతుల్లో 5×4, 1×6) ధాటిగా ఆడారు. మాథ్యూ వేడ్ (12), శుభ్‌మన్‌ గిల్‌ (13), విజయ్‌ శంకర్‌ (2) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్‌ తలో వికెట్ పడగొట్టారు.


ధాటిగా ఆడుతున్న గుజరాత్ బ్యాటర్లు..

గుజరాత్ బ్యాటర్లు ఇప్పుడిప్పుడే కాస్త వేగం పెంచుతున్నారు. అశ్విన్ వేసిన 11వ ఓవర్లో 6 పరుగులు.. ఆ తర్వాతి ఓవర్లో నీషమ్‌ 9 పరుగులు ఇచ్చారు. చాహల్‌ వేసిన 13వ ఓవర్లో అభినవ్ మనోహర్‌ వరుసగా ఓ ఫోర్‌, ఓ సిక్స్‌ బాదాడు. కుల్దీప్ సేన్‌ వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన కెప్టెన్‌ హార్దిక్ పాండ్య (66) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆఖరు బంతిని అభినవ్‌ (36) బౌండరీకి తరలించాడు. అశ్విన్ వేసిన 15వ ఓవర్లో హార్దిక్‌ వరుసగా రెండు సిక్సులు బాదాడు.  దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్‌ మూడు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.


సగం ఓవర్లు పూర్తి.. నిలకడగా గుజరాత్ బ్యాటింగ్‌..

ఇప్పటికే పలు కీలక వికెట్లు కోల్పోవడంతో గుజరాత్‌ బ్యాటర్లు వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడుతున్నారు. రియాన్ పరాగ్ వేసిన ఏడో ఓవర్లో తొలి బంతికి హార్దిక్‌ పాండ్య (34) సిక్స్ బాదగా.. మూడో బంతిని శుభ్‌మన్‌ (13) బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్‌.. హెట్‌మయర్‌కి చిక్కాడు. జిమ్మీ నీషమ్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో ఆఖరు బంతిని అభినవ్‌ మనోహర్‌ (10) బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి ఓవర్లో రవిచంద్రన్‌ అశ్విన్ ఐదే పరుగులు ఇచ్చాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్‌ 72/3 స్కోరుతో నిలిచింది.


పవర్‌ ప్లే పూర్తి.. కట్టుదిట్టంగా రాజస్థాన్ బౌలింగ్‌.. గుజరాత్‌ స్కోరెంతంటే.?

రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ గుజరాత్ జట్టుకు షాకులిస్తున్నారు. రెండో ఓవర్లో ఓపెనర్‌ మాథ్యూ వేడ్ (12) రనౌట్ కాగా.. కుల్దీప్ సేన్‌ వేసిన తర్వాతి ఓవర్లో వైడ్ బంతిని వేటాడిన విజయ్‌ శంకర్‌ (2).. కీపర్‌ సంజూ శాంసన్‌కి చిక్కి క్రీజు వీడాడు. నాలుగో ఓవర్లో యుజ్వేంద్ర చాహల్ నాలుగే పరుగులు ఇచ్చాడు. ఐదో ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్య (18) హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన ఆరో ఓవర్లో ఆఖరు బంతిని శుభ్‌మన్‌ గిల్ (9) బౌండరీకి తరలించాడు. దీంతో పవర్‌ ప్లే  పూర్తయ్యే సరికి గుజరాత్‌ రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది.


గుజరాత్‌కి షాక్‌.. మాథ్యూ వేడ్ ఔట్‌..

రాజస్థాన్, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్ ఓడిన గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి ఓ వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. జిమ్మీ నీషమ్‌ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు బాదిన ఓపెనర్‌ మాథ్యూ వేడ్ (12).. రెండో ఓవర్లో రెండో బంతికి పరుగు తీసేందుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం, శుభ్‌మన్ గిల్‌ (0), విజయ్‌ శంకర్‌ (1) క్రీజులో ఉన్నారు. 


రాజస్థాన్‌దే టాస్‌.. సమ ఉజ్జీల మధ్య పోరులో గెలుపెవరిదో.!

టీ20 మెగా టోర్నీలో మరో రసవత్తర మ్యాచుకు వేళయింది. మరి కాసేపట్లో రాజస్థాన్‌, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. టాస్‌ నెగ్గిన రాజస్థాన్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్‌ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తోన్న రాజస్థాన్‌ జట్టు.. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో వైపు, హార్దిక్‌ సారథ్యంలోని గుజరాత్‌ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఈ జట్టు కూడా నాలుగింట్లో మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. తాజాగా, సమఉజ్జీల మధ్య జరుగనున్న ఈ మ్యాచులో ఆదిపత్యం చెలాయించేదెవరో చూడాలి.! ముంబయిలోని డీవై పాటిల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.

తుది జట్ల వివరాలు..

రాజస్థాన్ : జోస్ బట్లర్‌, దేవ్‌దత్ పడిక్కల్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్ కీపర్‌), రస్సీ వాండర్‌ డస్సెన్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రియాన్ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జిమ్మీ నీషమ్‌, కుల్దీప్ సేన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌

గుజరాత్ : మాథ్యూ వేడ్‌ (వికెట్ కీపర్‌), శుభ్‌మన్‌ గిల్, విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్‌, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్‌, రషీద్ ఖాన్‌, లాకీ ఫెర్గూసన్‌, మహమ్మద్ షమి, యశ్ దయాల్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని