T20 League : మెగా టీ20 లీగ్‌కు పదిహేనేళ్లు‌.. ఇప్పటివరకు ఏం జరిగిందంటే?

కొవిడ్‌ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో మ్యాచ్‌లను వీక్షించేందుకు...

Updated : 18 Apr 2022 20:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అప్రతిహతంగా కొనసాగుతున్న మెగా టీ20 లీగ్ పదిహేనో ఏడాదిలోకి అడుగుపెట్టింది. సరిగ్గా 2008లో ఇదే రోజున (ఏప్రిల్ 18) టీ20 లీగ్‌ తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. అప్పుడు మొదటి మ్యాచ్‌ కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఇప్పుడు యాదృచ్ఛికంగా ఇదే రోజు కోల్‌కతా మ్యాచే జరగనుండటం విశేషం. అయితే ఈసారి ప్రత్యర్థి రాజస్థాన్‌. ఈ క్రమంలో గత పద్నాలుగు సీజన్లలో ఎవరు ఎన్నిసార్లు ఛాంపియన్‌గా నిలిచారు.. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందనే విషయాలను గమనం చేసుకుందాం..

ఆ లీగ్‌కు పోటీగా..

2007 టీ20 ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా గెలుచుకోవడంతో పొట్టిఫార్మాట్‌ పట్ల అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. దీంతో జీఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజేస్ సంస్థ ఇండియన్‌ క్రికెట్ లీగ్ (ఐసీఎల్‌)ను ప్రారంభించింది. అయితే దీనికి బీసీసీఐ, ఐసీసీ గుర్తింపు లేదు. రెబల్‌ లీగ్‌గా పరిగణిస్తూ కాంట్రాక్ట్‌లోని క్రికెటర్లు ఎవరూ అందులో చేరకూడదని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే టీ20 క్రికెట్‌కు వస్తున్న ఆదరణను చూసిన బీసీసీఐ.. ఐసీఎల్‌కు పోటీగా కొత్త లీగ్‌ను మొదలుపెట్టనున్నట్లు 2007 ప్రపంచకప్‌ అనంతరం ప్రకటించింది. 2008 ఏప్రిల్‌ 18 నుంచి తొలి సీజన్‌ ప్రారంభమైంది. లలిత్‌ మోదీ ఛైర్మన్‌గా టీ20 లీగ్‌ ప్రారంభమైంది. క్రికెటర్లకు భారీ విలువ చేకూర్చడంలో లలిత్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే మూడేళ్ల తర్వాత ఫ్రాంచైజీ యజమానులకు ఇన్‌సైడర్‌ సమాచారం అందించాడనే ఆరోపణలతోపాటు పుణెను తనకు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడనే ఫిర్యాదుతో ఛైర్మన్‌గా ఉన్న లలిత్‌ మోదీని బీసీసీఐ తప్పించింది. అప్పటి నుంచి లండన్‌లోనే నివాసం ఉంటున్నాడు.

ఎవర్‌గ్రీన్‌ బ్యాటింగ్‌.. మెక్‌ ‘కల్లోలం’

అప్పటి వరకు ఆటగాళ్లకు టీ20 ఫార్మాట్‌ చాలా కొత్త అనే చెప్పాలి. దీంతో టోర్నీ ఆరంభం ఏ విధంగా ఉంటుందోనని నిర్వాహకులు కాస్త సందేహించారు. అయితే తొలి మ్యాచ్‌లోనే మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బంతి పోటీపడటంతో  అభిమానుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఇక నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పొట్టి ఫార్మాట్‌లో ఇలా కూడా బ్యాటింగ్‌ చేస్తారనేలా ఓపెనర్‌ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ (158) చెలరేగిపోయాడు. టీ20 లీగ్‌ చరిత్రలో తొలి సెంచరీ చేసిన వీరుడిగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. కోల్‌కతా 222/3 స్కోరు చేయగా.. బెంగళూరు కేవలం 82 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయంపాలైంది. ఆ తర్వాత సీజన్లలో క్రిస్‌ గేల్‌ (175) టాప్‌ స్కోరర్‌గా అవతరించినా.. మెక్‌కల్లమ్‌ విధ్వంసం మాత్రం మరిచిపోలేనిది.

మధ్యలో ఫిక్సింగ్‌ ఆరోపణలు..

ఎంతటి లీగ్‌కైనా వివాదాలు సహజమే. అయితే వాటితో లీగ్‌ ఆగిపోకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటూ నడిపించడం విశేషం. ఇలానే టీ20 లీగ్‌లోనూ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజస్థాన్‌, చెన్నై జట్లపై నిషేధం విధించింది. దీంతో ఆ సీజన్‌లో మరో రెండు కొత్త టీమ్‌లు వచ్చి చేరాయి. ఆ తర్వాత నిషేధం ఎత్తివేయడంతో మళ్లీ రాజస్థాన్‌, చెన్నై బరిలోకి నిలిచాయి. అదేవిధంగా 2020, 2021 సీజన్ల పోటీలను కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా నిర్వహించాల్సి వచ్చింది. 

గత 14 టైటిళ్లలో.. 

ఇప్పటి వరకు జరిగిన 14 టైటిళ్లలో అత్యధికంగా ముంబయి ఐదు సార్లు, చెన్నై నాలుగుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. తొలి టైటిల్‌ (2008)ను మాత్రం ఇటీవల మృతి చెందిన స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ కైవసం చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్‌ (పాత జట్టు) సొంతం చేసుకుంది. ముంబయి, చెన్నై కాకుండా కోల్‌కతా మాత్రమే రెండుసార్లు కప్‌ను చేజిక్కించుకుంది. మరోసారి హైదరాబాద్‌ (కొత్త జట్టు)కు డేవిడ్‌వార్నర్‌ టైటిల్‌ను అందించాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో ఐదుసార్లు ముంబయి, ఎంఎస్ ధోని సారథ్యంలో నాలుగుసార్లు చెన్నై టైటిళ్లను గెలుచుకున్నాయి. వీరి రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే. అయితే 15వ సీజన్‌లో మాత్రం వరుస ఓటములతో ముంబయి, చెన్నై చివరిస్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి.

ఈ సారి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా.. 

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. ఈసారి కొవిడ్‌ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో మ్యాచ్‌లను వీక్షించేందుకు అభిమానులకు బీసీసీఐ అవకాశం కల్పించింది. గతేడాది కరోనా కలకలం రేగడంతో రెండు దశల్లో నిర్వహించాల్సి వచ్చింది. అందుకే ప్రస్తుత సీజన్‌ను కేవలం రెండు నగరాల్లోని నాలుగు మైదానాలకు మాత్రమే పరిమితం చేసి ఎలాంటి విమాన ప్రయాణాలు లేకుండా చర్యలు చేపట్టింది. ఈసారి కొత్తగా గుజరాత్‌, లఖ్‌నవూ జట్ల చేరికతో పది టీమ్‌లు కప్‌ కోసం పోరాడుతున్నాయి. అంతకుముందు జరిగిన మెగా వేలంలో యువ క్రికెటర్లకు మంచి ధర రావడం.. స్టార్లకు చుక్కెదురు కావడం జరిగింది. 2023 సంవత్సరంలో ఆరు జట్లతో మహిళల టీ20 లీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే టీ20 ఛాలెంజ్‌ పేరిట నిర్వహిస్తోన్న మ్యాచ్‌లకు ఆదరణ లభించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని