T20 League Final 2022 : అరంగేట్రంలోనే అదుర్స్‌.. టైటిల్‌ని ముద్దాడిన గుజరాత్‌

మెగా టీ20 లీగ్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్‌ దుమ్మురేపింది.  అహ్మదాబాద్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన తుది సమరంలో రాజస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది.

Published : 30 May 2022 00:37 IST

 అహ్మదాబాద్‌: మెగా టీ20 లీగ్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్‌ దుమ్మురేపింది. ఫైనల్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్‌ ఘన విజయం సాధించి తొలిసారి టైటిల్‌ని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్‌ బ్యాటర్లలో శుభమన్‌ గిల్‌ (45*; 43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్ పాండ్య (34), డేవిడ్ మిల్లర్‌ (32*)  రాణించగా.. సాహా (5), వేడ్ (8) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్‌ కృష్ణ, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. 

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. బట్లర్ (39) రాణించకపోతే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. రాజస్థాన్‌ మిగిలిన బ్యాటర్లలో యశస్వీ జైస్వా్ల్‌ (22) ఫర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్‌ (14), దేవదత్‌ పడిక్కల్ (2), హెట్‌మెయర్‌ (11), అశ్విన్ (6), ట్రెంట్ బౌల్ట్‌ (11),  రియాన్ పరాగ్ (15), మెకాయ్ (8) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్ పాండ్య మూడు వికెట్లతో మెరవగా.. సాయికిశోర్‌ రెండు, రషీద్‌ఖాన్‌, యశ్ దయాళ్‌, షమి తలో వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (863) పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. రాజస్థాన్‌ బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ (27) వికెట్లతో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని