T20 League : అలెర్ట్‌.. టీ20 లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సమయం మారింది!

 టీ20 లీగ్‌ తుది దశకు చేరుకుంది. ఇక లీగ్‌ స్థాయిలో కేవలం మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లు...

Published : 19 May 2022 17:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌ తుది దశకు చేరుకుంది. ఇక లీగ్‌ స్థాయిలో కేవలం మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక మే 29న టీ20 లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు గుజరాత్‌, లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. మిగిలిన స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. రాజస్థాన్‌ కాస్త ముందు వరుసలో ఉండగా.. దిల్లీ, బెంగళూరు ఆ తర్వాత ఉన్నాయి. అయితే పంజాబ్‌, హైదరాబాద్‌ అవకాశాలు ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడి ఉన్నాయి. 

ఈ క్రమంలో ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం మ్యాచ్‌ల్లో కొన్ని మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతున్నాయి కదా.. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం రాత్రి 8 గంటలకు మొదలవుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అంటే టాస్‌ 7.30 గంటలకు వేసి అర్ధ గంట తర్వాత మ్యాచ్‌ను స్టార్ట్‌ చేస్తారు. ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ముగింపు సంబరాలను అద్భుతంగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

‘‘మెగా టీ20 టోర్నీ ముగింపు ఉత్సవాలను 40 నిమిషాలపాటు నిర్వహించేందుకుగాను ఫైనల్‌ మ్యాచ్‌ను కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తాం. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఎలాంటి ఉత్సవాలు లేకుండానే నిర్వహించాం. అందుకే ఈసారి సంబరాలను పెద్ద ఎత్తున చేయాలని సంకల్పించాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రణ్‌వీర్‌ సింగ్, ఏఆర్‌ రెహ్మాన్ సంగీత కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగానూ ప్రత్యేకంగా నిలిచేలా గత ఏడు దశాబ్దాలుగా భారత క్రికెట్‌ ప్రయాణాన్ని బీసీసీఐ ఆవిష్కరించనుంది. దీని కోసం కొన్ని వారాల కిందట బిడ్లను కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అలానే దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20 సిరీస్‌కు వందశాతం ప్రేక్షకులను బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. జూన్ 9 నుంచి జూన్ 19వ తేదీ వరకు సౌతాఫ్రికాతో భారత్ టీ20 ల్లో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని