Hyderabad vs Rajasthan : తీరు మారని హైదరాబాద్‌.. రాజస్థాన్‌ చేతిలో ఓటమి

పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది...

Updated : 30 Mar 2022 04:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్‌ 61పరుగుల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ బ్యాటర్లలో మార్‌క్రమ్‌ (57 : 41 బంతుల్లో 5×4, 2×6) ఆఖరి వరకు పోరాడాడు. అయినా అతడికి సహకరించే వారు లేకపోవడంతో ఫలితం లేకపోయింది. వాషింగ్టన్ సుందర్ (40 : 14 బంతుల్లో 5×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. రొమెరియో షెఫర్డ్‌ (24) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (2), అభిషేక్‌ శర్మ (9), రాహుల్‌ త్రిపాఠి (0), నికోలస్ పూరన్‌ (0), అబ్దుల్ సమద్‌ (4) దారుణంగా విఫలయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ మూడు, ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు, ట్రెంట్‌ బౌల్ట్ రెండేసి వికెట్లు పడగొట్టారు.


నెమ్మదిగా హైదరాబాద్ బ్యాటింగ్..

కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌ ఆచితూచి ఆడుతోంది. అశ్విన్‌ వేసిన 12వ ఓవర్లో ఐదు పరుగులు ఇవ్వగా.. యుజ్వేంద్ర చాహల్ వేసిన తర్వాతి ఓవర్లో హైదరాబాద్‌ 11 పరుగులు రాబట్టింది. నాథన్‌ కౌల్టర్ నైల్ వేసిన రొమెరియో షెఫర్డ్ ఆఖరి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. 15వ ఓవర్లో ఐదే పరుగులు వచ్చాయి. దూకుడుగా ఆడే క్రమంలో రొమెరియో షెఫర్డ్‌ (24) ఔటయ్యాడు. చాహల్‌ వేసిన 16వ ఓవర్‌ నాలుగో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 15.4 ఓవర్లకు హైదరాబాద్‌ ఆరు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది.


సగం వికెట్లు డౌన్‌..

పుణె వేదికగా హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ బౌలర్ల జోరు కొనసాగుతోంది. యుజ్వేంద్ర చాహల్‌ వేసిన 9వ ఓవర్లో రెండో బంతికి అభిషేక్‌ శర్మ (9) హెట్‌మైర్‌కి చిక్కాడు. దీంతో హైదరాబాద్‌ నాలుగో వికెట్ కోల్పోయినట్లయింది. అంతకు ముందు, కౌల్టర్ నైల్, రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన ఏడు, ఎనిమిది ఓవర్లలో కలిపి 14 పరుగులు ఇచ్చారు. పదో ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. చాహల్ వేసిన 11వ ఓవర్లో రెండో బంతికి అబ్దుల్ సమద్ (4) భారీ షాట్‌కి ప్రయత్నించి రియాన్ పరాగ్‌కి చిక్కాడు. ప్రస్తుతం మార్‌క్రమ్‌ (17), రొమెరియో షెఫర్డ్ (1) క్రీజులో కొనసాగుతున్నారు. 11 ఓవర్లకు హైదరాబాద్‌ 39/5 స్కోరుతో నిలిచింది. 


హైదరాబాద్‌కు వరుస షాకులు

భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగులుతున్నాయి. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్లో నాలుగో బంతికి హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (2) ఔటయ్యాడు. తొలుత సంజూ శాంసన్‌ చేతుల్లోంచి జారిపోయిన బంతిని దేవ్‌దత్‌ పడిక్కల్ ఒడిసిపట్టాడు. దీంతో విలియమ్సన్‌ వెనుదిరుగగ తప్పలేదు. ఆ తర్వాత నాలుగో ఓవర్లో తొలి బంతికి  రాహుల్‌ త్రిపాఠి (0)ని ప్రసిద్ధ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. బౌల్ట్ వేసిన ఐదో ఓవర్లో నికోలస్‌ పూరన్‌ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం, అభిషేక్‌ శర్మ (3), మార్‌క్రమ్‌ (4) క్రీజులో ఉన్నారు. పవర్ ప్లే పూర్తయ్యే సరికి హైదరాబాద్‌ మూడు వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది.


హైదరాబాద్‌ ముందు భారీ లక్ష్యం..

రాజస్థాన్‌ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. హైదారాబాద్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌ (55 : 27 బంతుల్లో 3×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు.. దేవ్‌దత్‌ పడిక్కల్ (41 : 29 బంతుల్లో 4×4, 2×6) రాణించాడు. ఓపెనర్లు జోస్‌ బట్లర్ (35), యశస్వీ జైస్వాల్ (20) రాజస్థాన్‌కి శుభారంభం అందించారు. ఆఖర్లో వచ్చిన షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (32 : 18 బంతుల్లో 2×4, 3×6) బౌండరీలతో అలరించాడు. రియాన్‌ పరాగ్ (12) ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. నాథన్‌ కౌల్టర్‌నైల్ (1) నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్‌ రెండేసి, భువనేశ్వర్‌ కుమార్, రొమెరియో షెఫర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.


భారీ స్కోరు దిశగా రాజస్థాన్‌

హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా.. రాజస్థాన్‌ బ్యాటర్లు దూకుడు కొనసాగిస్తున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 11వ ఓవర్లో సంజూ శాంసన్‌ ఓ సిక్స్‌, ఓ  ఫోర్‌ బాదాడు. నటరాజన్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ మరో సిక్స్‌, ఫోర్‌ రాబట్టాడు. 13వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్‌ ఏడే పరుగులు ఇచ్చాడు. 14వ ఓవర్లో పడిక్కల్ (26) రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదాడు. 15వ ఓవర్లో శాంసన్‌ (42), పడిక్కల్ (41) చెరో ఫోర్‌ రాబట్టారు. ఇదే ఓవర్‌ ఆఖరు బంతికి పడిక్కల్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో 15 ఓవర్లకు రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి 148 స్కోరుతో నిలిచింది.


దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్ కెప్టెన్‌..

రాజస్థాన్‌ జోరుకి హైదరాబాద్ బౌలర్లు కళ్లెం వేశారు. రొమెరియో షెఫర్డ్‌ వేసిన ఏడో ఓవర్లో తొలి బంతికి ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (20).. మార్‌క్రమ్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్‌ జోస్ బట్లర్ (35) కూడా ఔటయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన తొమ్మిదో ఓవర్ తొలి బంతికి అతడు కీపర్‌కి చిక్కాడు. అంతకు ముందు అభిషేక్‌ శర్మ వేసిన 8వ ఓవర్లో ఓ సిక్స్‌, ఓ ఫోర్‌ బాదిన కెప్టెన్ సంజూ శాంసన్ (23).. రొమెరియో షెఫర్డ్ వేసిన పదో ఓవర్లో మరో సిక్స్ బాదాడు. దేవ్‌దత్‌ పడిక్కల్ (3) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు రాజస్థాన్‌ స్కోరు 87/2 గా నమోదైంది.


వేగం పెంచిన రాజస్థాన్‌ బ్యాటర్లు..

తొలి మూడు ఓవర్లు ఆచితూచి ఆడిన రాజస్థాన్ బ్యాటర్లు వేగం పెంచారు. ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన నాలుగో ఓవర్లో జోస్ బట్లర్ రెండు సిక్సులు, ఓ ఫోర్‌ బాదాడు. నో బాల్ రూపంలో మరో ఫోర్‌ వచ్చింది. దీంతో ఒకే ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన ఐదో ఓవర్లో జోస్‌ బట్లర్ (33), యశస్వీ జైస్వాల్‌ (20) చెరో సిక్స్ బాదారు. నటరాజన్ వేసిన ఆరో ఓవర్లో తొలి బంతిని జైస్వాల్ బౌండరీకి తరలించాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే  సరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.


కట్టుదిట్టంగా బౌలింగ్‌..

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి జోస్ బట్లర్‌ (0) ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంతి బ్యాటును తాకి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అబ్దుల్ సమద్ చేతుల్లో పడింది. అయితే, అది నోబాల్ కావడంతో బట్లర్‌ బతికిపోయాడు. రోమెరియో షెఫర్డ్‌ వేసిన రెండో ఓవర్లో ఆఖరు బంతిని జోస్‌ బట్లర్‌ (5) బౌండరీకి తరలించాడు. భువనేశ్వర్‌ వేసిన మూడో ఓవర్లో నాలుగో బంతిని యశస్వీ జైస్వాల్ (6) బౌండరీకి తరలించాడు. దీంతో మూడు ఓవర్లకు రాజస్థాన్‌ 13/0 స్కోరుతో నిలిచింది.    


హైదరాబాద్‌దే టాస్‌..

టీ20 మెగా టోర్నీలో భాగంగా మరికాసేపట్లో హైదరాబాద్‌ జట్టు.. రాజస్థాన్‌తో తలపడనుంది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రాజస్థాన్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వనించాడు. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. గతేడాది పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచిన హైదరాబాద్‌ ఈ సారైనా మెరుగ్గా రాణిస్తుందేమో చూడాలి!

తుది జట్ల వివరాలు..

హైదరాబాద్‌ : రాహుల్ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), మార్‌క్రమ్‌, అబ్దుల్ సమద్‌, వాషింగ్టన్ సుందర్‌, రొమెరియో షెఫర్డ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్ మాలిక్‌, టి. నటరాజన్‌

రాజస్థాన్‌ : యశస్వీ జైస్వాల్, జోస్‌ బట్లర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్ కీపర్‌), షిమ్రోన్‌ హెట్‌మైర్‌, రియాన్ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, నాథన్‌ కౌల్టర్ నైల్‌, యుజ్వేంద్ర చాహల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని