Bangalore Vs Punjab : చేతులెత్తేసిన బెంగళూరు.. పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం

ఒక్క విజయం నమోదు చేస్తే చాలు బెంగళూరుకు ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయం. మరోవైపు పంజాబ్‌ కూడా ప్రతి మ్యాచ్‌ను గెలిస్తేనే అవకాశాలు సజీవంగా ఉండే ...

Updated : 13 May 2022 23:32 IST

ముంబయి: కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. పంజాబ్‌ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులే చేయగలిగింది. దీంతో బెంగళూరుపై పంజాబ్‌ 54 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బెంగళూరు బ్యాటర్లలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (35), రాజత్‌ పాటిదార్‌ (26), విరాట్ కోహ్లీ (20) ఫర్వాలేదనిపించారు. డుప్లెసిస్‌ 10, లామ్రోర్ 6, దినేశ్‌ కార్తిక్ 11, షాహ్‌బాజ్‌ 9, హర్షల్‌ పటేల్ 11* పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో రబాడ 3, రాహుల్ చాహర్ 2, రిషి ధావన్‌ 2.. బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ లివింగ్‌స్టోన్ (70), బెయిర్‌స్టో (66) ధాటికి 20 ఓవర్లలో 209/9 స్కోరు సాధించింది.

ఇక మే 19న గుజరాత్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధిస్తేనే బెంగళూరుకు ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కే అవకాశం ఉండగా.. పంజాబ్‌ మాత్రం మిగిలిన రెండింట్లోనూ గెలవాల్సి ఉంది. పంజాబ్‌కు దిల్లీ (మే 16), హైదరాబాద్‌(మే 22)తో మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ విజయంతో పంజాబ్‌ (12) పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి ఎగబాకింది. ఇక బెంగళూరు (14) తన నాలుగో స్థానంలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.


కష్టాల్లో బెంగళూరు

స్వల్ప వ్యవధిలో బెంగళూరు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో కుదురుకున్నట్లు అనిపించిన మ్యాక్స్‌వెల్ (35), రాజత్‌ పాటిదార్‌ (26) పంజాబ్‌ బౌలర్ల దెబ్బకు రెండు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం బెంగళూరు 14 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజ్‌లో దినేశ్‌ కార్తిక్ (10*), షాహ్‌బాజ్‌ అహ్మద్ (4*) ఉన్నారు. బెంగళూరు విజయానికి 36 బంతుల్లో ఇంకా 92 పరుగులు సాధించాలి.


కట్టుదిట్టంగా పంజాబ్‌ బౌలింగ్‌

బెంగళూరు బ్యాటర్లు కాస్త నిలదొక్కుకోవడంతో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతోంది. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నా నిలకడగా ఆడుతూ బెంగళూరు బ్యాటర్లు పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (28*), రాజత్‌ పాటిదార్ (29*) ఉన్నారు. వీరిద్దరూ అర్ధశతక (55) భాగస్వామ్యం నిర్మించారు. బెంగళూరు జవియం సాధించాంలంటే ఇంకా 60 బంతుల్లో 115 పరుగులు చేయాలి.


స్వల్ప వ్యవధిలో వికెట్లు

భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు తడబాటుకు గురవుతోంది. పంజాబ్‌ బౌలర్లు రాణించడంతో స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం బెంగళూరు 6 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (3*), రాజత్‌ పాటిదార్‌ (1*) ఉన్నారు. అంతకుముందు కాస్త దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ (20)తోపాటు డుప్లెసిస్‌ (10), మహిపాల్ (6) వరుసగా పెవిలియన్‌కు చేరారు. బెంగళూరు విజయం సాధించాలంటే 84 బంతుల్లో 166 పరుగులు చేయాలి.


నిలకడగా బ్యాటింగ్‌..

బెంగళూరు ఛేదన ప్రారంభించింది. పంజాబ్‌ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం బెంగళూరు 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. బ్రార్‌ వేసిన తొలి ఓవర్‌లో ఫోర్‌ సహా ఏడు పరుగులే వచ్చాయి. ఇక అర్ష్‌దీప్‌ ఓవర్‌లో విరాట్ కోహ్లీ (11*) రెండు ఫోర్లు బాదాడు. దీంతో  పది రన్స్‌ వచ్చాయి. క్రీజ్‌లో  కోహ్లీతోపాటు డుప్లెసిస్‌ (6*) ఉన్నాడు. తొలుత బ్యాటింగ్‌ పంజాబ్‌ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 


పంజాబ్‌ 209/9

కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటర్లు చెలరేగారు. బెంగళూరుకు పంజాబ్‌ 210 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లియామ్‌ లివింగ్‌స్టోన్ (70: 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (66: 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసంతో అర్ధశతకాలు సాధించారు. శిఖర్‌ ధావన్‌ 21, మయాంక్‌ అగర్వాల్ 19, జితేశ్‌ శర్మ 9, హర్‌ప్రీత్‌ బ్రార్ 7, రిషిధావన్‌ 7, రాహుల్ చాహర్‌ 2 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 4, హసరంగ 2.. మ్యాక్స్‌వెల్, షాహ్‌బాజ్‌ చెరో వికెట్ తీశారు.


తగ్గని వేగం

వికెట్లు పడినా పంజాబ్ స్కోరు బోర్డు వేగం మాత్రం ఆగడం లేదు. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (66) ధాటిగా ఆడటంతో రన్‌రేట్‌ పదికి తగ్గలేదు. అయితే షాహ్‌బాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటైనప్పటికీ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (41) వేగంగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్‌తోపాటు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్ (10*) ఉన్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు.


బెయిర్‌స్టో వేగవంతమైన హాఫ్ సెంచరీ

పంజాబ్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (61*) 21 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. బెయిర్‌స్టోకు ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. ప్రస్తుతం ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజ్‌లో బెయిర్‌స్టోతోపాటు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (8*) ఉన్నాడు. బెంగళూరు బౌలర్‌ సిరాజ్‌వేసిన ఆరో ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో సహా 23 పరుగులు వచ్చాయి. అంతకుముందు మరో ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ (21) వేగంగా ఆడే క్రమంలో మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయితే తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాజపక్స (1) హసరంగ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి హర్షల్‌ పటేల్‌ చేతికి చిక్కాడు. 


రెచ్చిపోతున్న బ్యాటర్లు

కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌ ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (34*), శిఖర్ ధావన్‌ (8*) ఉన్నారు. బెంగళూరు బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ బెయిర్‌స్టో ధాటిగా ఆడేస్తున్నాడు. తొలి ఓవర్‌లో కాస్త ఆచితూచి ఆడిన బెయిర్‌స్టో.. తర్వాత హేజిల్‌వుడ్‌ వేసిన రెండో ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మూడో ఓవర్‌ వేసిన సిరాజ్‌ బౌలింగ్‌లోనూ పంజాబ్‌ బ్యాటర్లు సిక్స్‌, ఫోర్‌ బాదారు.


టాస్‌ నెగ్గిన డుప్లెసిస్‌

ఒక్క విజయం నమోదు చేస్తే చాలు బెంగళూరుకు ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయమైపోతుంది. మరోవైపు పంజాబ్‌ కూడా ప్రతి మ్యాచ్‌ను గెలిస్తేనే అవకాశాలు సజీవంగా ఉండే పరిస్థితి. ఈ క్రమంలో మరికాసేపట్లో బెంగళూరు, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ నెగ్గిన బెంగళూరు సారథి డుప్లెసిస్‌ బౌలింగ్‌ ఎంచుకుని పంజాబ్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. మయాంక్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలతో కేవలం పది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. దీంతో సహా మిగిలిన మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే పంజాబ్‌కు అవకాశాలు ఉంటాయి. బెంగళూరు మాత్రం తన ఆఖరి రెండింట్లో ఒక్కటి గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకుంటుంది. విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు రాణిస్తున్న వేళ బెంగళూరును పంజాబ్‌ బౌలర్లు ఏమాత్రం అడ్డుకుంటారో వేచి చూడాల్సిందే. 

జట్ల వివరాలు: 

బెంగళూరు: విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్‌ (కెప్టెన్), రాజత్ పాటిదార్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, దినేశ్‌ కార్తిక్, మహిపాల్ లామ్రోర్, షాహ్‌బాజ్‌ అహ్మద్, వహిండు హసరంగ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

పంజాబ్‌: జానీ బెయిర్‌ స్టో, శిఖర్ ధావన్‌, భానుక రాజపక్స, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, రిషి ధావన్, రాహుల్‌ చాహర్, కగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని