Kolkata vs Delhi : తిప్పేసిన కుల్దీప్‌ యాదవ్‌.. దిల్లీ ఖాతాలో రెండో విజయం

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచులో దిల్లీ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా జట్టుని.. దిల్లీ బౌలర్లు 19.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో దిల్లీ 44 పరుగుల తేడాతో గెలుపొందింది...

Published : 10 Apr 2022 19:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచులో దిల్లీ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా జట్టుని.. దిల్లీ బౌలర్లు 19.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో దిల్లీ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. కోల్‌కతా బ్యాటర్లలో కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్ (54 : 33 బంతుల్లో 5×4, 2×6), నితీశ్ రాణా (30), ఆండ్రూ రసెల్ (24) పరుగులు చేశారు. వెంకటేశ్ అయ్యర్‌ (18), సామ్ బిల్లింగ్స్‌ (15) పరుగులు చేయగా.. ఓపెనర్‌ అజింక్య రహానె (8), ప్యాట్ కమ్మిన్స్ (4), సునీల్ నరైన్‌ (4), ఉమేశ్ యాదవ్‌ (0), రసిక్‌ సలాం (7) విఫలమయ్యారు. వరుణ్‌ చక్రవర్తి (1) నాటౌట్‌గా నిలిచాడు. దిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌ నాలుగు, ఖలీల్‌ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ రెండు, లలిత్ యాదవ్‌ ఓ వికెట్ పడగొట్టారు.


కుల్దీప్‌ యాదవ్‌కి ఒకే ఓవర్లో మూడు వికెట్లు..

దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు.  అక్షర్‌ పటేల్ వేసిన 14వ ఓవర్లో ఓ ఫోర్‌, ఓ సిక్స్‌ కొట్టిన సామ్‌ బిల్లింగ్స్‌ (15).. ఖలీల్ అహ్మద్‌ వేసిన తర్వాతి ఓవర్లో నాలుగో బంతికి అతడు లలిత్ యాదవ్‌కి చిక్కాడు. కుల్దీప్ యాదవ్‌ వేసిన 16వ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి కోల్‌కతాను గట్టి దెబ్బ తీశాడు. మూడో బంతికి ప్యాట్ కమ్మిన్స్‌ (4) ఎల్బీడబ్ల్యూ  కాగా.. ఐదో బంతికి సునీల్‌ నరైన్ (4).. రోమన్‌ పావెల్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. చివరి బంతికి ఉమేశ్ యాదవ్‌ (0) క్యాచ్‌ ఔటయ్యాడు. దీంతో 17 ఓవర్లు పూర్తయ్యే సరికి కోల్‌కతా 152/8 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం ఆండ్రూ రసెల్ (10), రసిఖ్‌ సలాం (3) క్రీజులో ఉన్నారు.


కట్టుదిట్టంగా దిల్లీ బౌలింగ్‌.. కీలక వికెట్లు కోల్పోయిన కోల్‌కతా

ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో కోల్‌కతా బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. కుల్దీప్‌ యాదవ్ వేసిన 11వ ఓవర్లో శ్రేయస్‌ ఓ ఫోర్‌ బాదాడు. లలిత్‌ యాదవ్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో రెండో బంతికి భారీ సిక్సర్‌ బాదిన నితీశ్‌ రాణా(30).. నాలుగో బంతికి పృథ్వీ షాకి క్యాచ్‌ ఇచ్చాడు. 13వ ఓవర్లో వరుసగా రెండు సిక్సులు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (54).. తర్వాతి బంతికే స్టంపౌటయ్యాడు. దీంతో 13 ఓవర్లు పూర్తయ్యే సరికి కోల్‌కతా 118/4 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం ఆండ్రూ రసెల్‌ (2), సామ్‌ బిల్లింగ్స్‌ (1) క్రీజులో ఉన్నారు. కోల్‌కతా విజయం సాధించాలంటే 42 బంతుల్లో 98 పరుగులు చేయాల్సి ఉంది.


సగం ఓవర్లు పూర్తి.. కోల్‌కతా ఇంకా ఎంత కొట్టాలంటే.?

సగం ఓవర్లు పూర్తయ్యే సరికి కోల్‌కతా 91/2 స్కోరుతో నిలిచింది. అక్షర్‌ పటేల్ వేసిన ఏడో ఓవర్లో శ్రేయస్‌ అయ్యర్‌ (39) ఓ ఫోర్‌ బాదగా.. కుల్దీప్ యాదవ్‌ వేసిన తర్వాతి ఓవర్లో నితీశ్ రాణా (22) ఓ సిక్స్ కొట్టాడు. 9వ ఓవర్లో శ్రేయస్ మరో సిక్స్ కొట్టాడు. రోమన్‌ పావెల్ వేసిన పదో ఓవర్లో శ్రేయస్‌ ఓ ఫోర్‌, నితీశ్‌ రాణా ఓ సిక్స్‌ బాదారు. కోల్‌కతా విజయానికి ఇంకా 125 పరుగులు కావాల్సి ఉంది.


ఛేదనలో తడబడుతున్న కోల్‌కతా బ్యాటర్లు.. పవర్‌ ప్లేలోనే రెండు వికెట్లు డౌన్‌ 

భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా బ్యాటర్లు తడబడుతున్నారు. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి రెండు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేశారు. ఖలీల్ అహ్మద్‌ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్‌ వెంకటేశ్ అయ్యర్‌ (18).. అక్షర్‌ పటేల్‌కి చిక్కగా.. ఐదో ఓవర్లో అజింక్య రహానె (8).. శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (14), నితీశ్ రాణా (2) క్రీజులో ఉన్నారు.


మూడు సార్లు బతికిపోయిన రహానె 

దిల్లీ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు కోల్‌కతా బ్యాటర్లు బరిలోకి దిగారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ అజింక్య రహానె (1) మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ముస్తాఫిజుర్‌ రహ్మాన్ వేసిన తొలి బంతి రహానె ప్యాడ్‌ను తాకి కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతికి చిక్కింది. అయితే, బంతి బ్యాటును తాకినట్లుగా భావించిన అంపైర్‌ ఔటిచ్చాడు. దీంతో రహానె రివ్యూ కోరాడు. సమీక్షలో బంతి ప్యాడ్‌ను తాకినట్లు తేలడంతో బతికిపోయాడు. ఆ తర్వాతి బంతికి రహానెను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడు. రహానె మళ్లీ రివ్యూ కోరాడు. సమీక్షలో బంతి తొలుత బ్యాటును తాకినట్లుగా తేలడంతో మరోసారి బతికిపోయాడు. అయితే, మూడో బంతి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్‌ను తాకి పంత్‌ చేతుల్లో పడింది. అయితే, ఎవరూ అప్పీల్ చేయకపోవడంతో రహనె మూడో సారి బతికిపోయాడు. ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. శార్దూల్ ఠాకూర్‌ వేసిన రెండో ఓవర్లో వెంకటేశ్‌ అయ్యర్‌ (14) వరుసగా రెండు సిక్సులు బాదాడు. దీంతో రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి కోల్‌కతా వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. 


కోల్‌కతా ముందు భారీ లక్ష్యం..

కోల్‌కతా జట్టుతో జరుగుతున్న మ్యాచులో దిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేశారు. కోల్‌కతా ముందు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. దిల్లీ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (61 : 45 బంతుల్లో 6×4, 2×6), పృథ్వీ షా (51 : 29 బంతుల్లో 7×4, 2×6) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ రిషభ్‌ పంత్‌ (27) పరుగులు చేయగా.. లలిత్‌ యాదవ్‌ (1), రోమన్‌ వావెల్ (8) నిరాశ పర్చారు. ఆఖర్లో వచ్చిన అక్షర్‌ పటేల్ (22*), శార్దూల్ ఠాకూర్‌ (29*) ధాటిగా ఆడారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్‌ రెండు, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రసెల్ తలో వికెట్ పడగొట్టారు. 


భారీ స్కోరు దిశగా దిల్లీ..

దిల్లీ జట్టు మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (60) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆండ్రూ రసెల్ వేసిన 13వ ఓవర్లో రెండో బంతికి సిక్స్‌ బాదిన వార్నర్‌ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఐదో బంతికి కెప్టెన్‌ రిషభ్ పంత్‌ (27).. భారీ షాట్‌కు ప్రయత్నించి ఉమేశ్‌ యాదవ్‌కి చిక్కి క్రీజు వీడాడు. సునీల్ నరైన్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే ఐదో బంతికి లలిత్ యాదవ్‌ (1) ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకు ముందు వరుణ్ చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో పంత్ ఓ సిక్స్‌, ఓ ఫోర్‌ బాదగా.. వార్నర్ మరో ఫోర్‌ కొట్టాడు. అదనపు పరుగుల రూపంలో మరో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే వరుణ్‌ చక్రవర్తి 24 పరుగులు ఇచ్చినట్లయింది. ఆ తర్వాతి ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 15వ ఓవర్లో ఓ సిక్స్‌ కొట్టిన రోమన్‌ పావెల్‌ (8).. సునిల్‌ నరైన్ వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతికి రింకూ సింగ్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలోనే 15.1 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.


నిలకడగా దిల్లీ బ్యాటింగ్‌..

మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న ఓపెనర్‌ పృథ్వీ షా (51)  అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో వరుసగా ఓ సిక్స్‌, ఓ ఫోర్ బాదిన పృథ్వీ ఆఖరు బంతికి సింగిల్‌ తీసి ఈ మార్క్‌ను అందుకున్నాడు. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే బౌల్డయ్యాడు. దీంతో 93 పరుగుల వద్ద దిల్లీ తొలి వికెట్ కోల్పోయినట్లయింది. అంతకు ముందు ఏడో ఓవర్లో ఆండ్రూ రసెల్ ఐదే పరుగులు ఇచ్చాడు. సునీల్ నరైన్‌ వేసిన పదో ఓవర్లో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (6) ఓ ఫోర్‌ బాదాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ ఒక వికెట్‌ కోల్పోయి 101 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (38) క్రీజులో ఉన్నాడు.  


పవర్ ప్లే పూర్తి.. ధాటిగా ఆడుతున్న దిల్లీ ఓపెనర్లు..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. క్రీజులో ఉన్న పృథ్వీ షా (36), డేవిడ్ వార్నర్‌ (27) బౌండరీలతో అలరిస్తున్నారు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి దిల్లీ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన మూడో ఓవర్లో పృథ్వీ షా రెండు ఫోర్లు బాదగా.. ఆ తర్వాతి ఓవర్లో వార్నర్‌ మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఆఖరు బంతిని పృథ్వీ సిక్స్‌గా మలిచాడు. ఐదో ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి ఎనిమిది పరుగులు ఇచ్చాడు. సునీల్‌ నరైన్ వేసిన ఆరో ఓవర్లో పృథ్వీ, వార్నర్‌ చెరో ఫోర్‌ కొట్టారు.


బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ ఓపెనర్లు..

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ బ్యాటింగ్‌ ప్రారంభించింది. ప్రస్తుతం 2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి దిల్లీ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజ్‌లో పృథ్వీషా (15*), డేవిడ్ వార్నర్ (5*) ఉన్నారు. తొలి ఓవర్‌ వేసిన ఉమేశ్‌ బౌలింగ్‌లోనూ, రసిక్‌ వేసిన రెండో ఓవర్‌లోనూ దిల్లీ బ్యాటర్లు రెండేసి బౌండరీలు రాబట్టారు.


టాస్‌ నెగ్గిన శ్రేయస్‌..

టీ20 లీగ్‌లో వరుసగా రెండో రోజూ డబుల్‌ బొనాంజా సిద్ధమైంది. ఇవాళ కూడానూ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ కోల్‌కతా, దిల్లీ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత టాస్‌ నెగ్గిన శ్రేయస్‌ అయ్యర్ బౌలింగ్‌ ఎంచుకుని దిల్లీకి బ్యాటింగ్ అప్పగించాడు. పాయింట్ల పట్టికలో మూడు విజయాలతో టాప్‌ స్థానంలో కొనసాగుతున్న కోల్‌కతాను.. రెండో గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్న దిల్లీ ఏమేరకు అడ్డుకోగలదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. గత సీజన్‌ వరకు ఒకే జట్టుకు (దిల్లీకి) ఆడిన శ్రేయస్‌, రిషభ్‌ పంత్‌.. ఈసారి మాత్రం ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. 

జట్ల వివరాలు : 

కోల్‌కతా : శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), సామ్‌ బిల్లింగ్స్, అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రస్సెల్, సునిల్ నరైన్, కమిన్స్, ఉమేశ్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, రసిక్‌ సలామ్‌

దిల్లీ : రిషభ్‌ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, పావెల్, సర్ఫరాజ్‌ ఖాన్‌, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముస్తాఫిజర్‌ రహ్మాన్‌, ఖలీల్‌ అహ్మద్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని