Bangalore Vs Gujarat : బెంగళూరు గెలిచెన్‌.. అయినా దిల్లీ చేతిలోనే ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌!

 ప్లేఆఫ్స్ కుర్చీలాట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు జట్లు స్థానం సంపాదించాయి. ఇక మిగిలిన రెండింటి కోసం ఐదు జట్లు రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో ..

Updated : 19 May 2022 23:40 IST

ముంబయి: కీలక మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గుజరాత్ నిర్దేశించిన 169 పరగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది.  ఓపెనర్‌ విరాట్ కోహ్లీ (73) అర్ధశతకం సాధించగా.. డుప్లెసిస్‌ (44) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు పెవిలియన్‌కు చేరినా.. బెంగళూరు విజయం సాధించిందంటే దానికి కారణం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 40 నాటౌట్).  చివరి వరకు దూకుడుగా ఆడి బెంగళూరును గెలుపు తీరాలకు చేర్చాడు.  దీంతో 18.3 ఓవర్లలో 170 పరుగులు చేసి బెంగళూరు విజయం సాధించింది. గుజరాత్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లను పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ 168/5 స్కోరు సాధించింది.

ప్రస్తుతం బెంగళూరు 14 మ్యాచులకుగాను 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే దిల్లీ తన ఆఖరి మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధిస్తే మాత్రం బెంగళూరు ఇంటిముఖం పట్టక తప్పదు. ఒకవేళ దిల్లీ ఓడితే మాత్రం బెంగళూరు ప్లేఆఫ్స్‌ వెళ్లినట్లే. మరోవైపు బెంగళూరు గెలవడంతో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఫలితం సంబంధం లేకుండా పంజాబ్‌, హైదరాబాద్‌ ఇంటిముఖం పట్టాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా గుజరాత్‌ నష్టమేమీ లేదు. అగ్రస్థానంతోనే లీగ్‌ దశను ముగించింది. 


రసవత్తరంగా మ్యాచ్‌

బెంగళూరు, గుజరాత్‌ మ్యాచ్‌ రసవత్తరంగా మారుతోంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (63*), డుప్లెసిస్‌ (42*) శతక భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్ మాత్రం దక్కడం లేదు. బెంగళూరు విజయం సాధించాలంటే ఇంకా 36 బంతుల్లో 56 పరుగులు సాధించాలి.


నిలకడగా బ్యాటింగ్‌..

బెంగళూరు లక్ష్యం దిశగా సాగుతోంది. గుజరాత్‌ బౌలింగ్‌ సమర్థంగా ఎదుర్కొంటూ వికెట్‌ ఇవ్వకుండా ఆడుతోంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (44*), డుప్లెసిస్‌ (27*) నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. బెంగళూరు విజయం సాధించాలంటే 66 బంతుల్లో 92 పరుగులు చేయాలి. 


ఛేదన ప్రారంభం..

కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు లక్ష్య ఛేదనను ప్రారంభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (11*), డుప్లెసిస్‌ (9*) ఆచితూచి ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. బెంగళూరు విజయానికి 102 బంతుల్లో 143 పరుగులు కావాలి. తొలుత బ్యాటింగ్‌ గుజరాత్‌ ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 


బెంగళూరు లక్ష్యం ఎంతంటే?

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (62*), డేవిడ్ మిల్లర్‌ (34), వృద్ధిమాన్‌ సాహా (31), రషీద్‌ ఖాన్‌ (19*), మ్యాథ్యూ వేడ్ (16) ధాటిగా ఆడటంతో బెంగళూరుకు లఖ్‌నవూ ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుకు 169 పరుగులను లక్ష్యంగా ఉంచింది. శుభ్‌మన్‌ గిల్‌ (1), రాహుల్ తెవాతియా (2) విఫలమ్యారు.  బెంగళూరు బౌలర్లలో జోష్‌ హేజిల్‌వుడ్ 2.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, హసరంగ చెరో వికెట్ తీశారు.


నెమ్మదించిన స్కోరు బోర్డు

గుజరాత్‌ స్కోరు బోర్డు నెమ్మదించింది. బెంగళూరు బౌలర్లు వికెట్లను తీయకపోయినా పరుగులను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజ్‌లో డేవిడ్ మిల్లర్‌ (24*), హార్దిక్‌ పాండ్య (35*) ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు 47 పరుగులను జోడించారు. మ్యాక్స్‌వెల్‌ వేసిన 14వ ఓవర్‌లో డేవిడ్ మిల్లర్‌ వరుసగా రెండు సిక్సర్లను బాదాడు. లేకపోతే గుజరాత్‌ స్కోరు ఇంకా తక్కువగా ఉండేది.


ఆచితూచి ఆడుతూ.. 

బెంగళూరు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో గుజరాత్‌ ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్‌లో డేవిడ్ మిల్లర్ (2*), హార్దిక్‌ పాండ్య (13*) ఉన్నారు. అంతకుముందు దూకుడుగా ఆడుతున్న వృద్ధిమాన్‌ సాహా (31) రనౌటయ్యాడు. డుప్లెసిస్‌ డైరెక్ట్‌గా వికెట్లకు త్రో విసరడంతో సాహా పెవిలియన్‌కు చేరాడు. మ్యాథ్యూ వేడ్ (16)ను మ్యాక్స్‌వెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.


ఇన్నింగ్స్‌ ప్రారంభం..

టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. అయితే మూడో ఓవర్‌ మూడో బంతికి ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్‌ (1) పెవిలియన్‌కు చేరాడు. హేజిల్ వుడ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో మ్యాక్స్‌వెల్ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. ఈ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. అయితే మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (19*) దూకుడుగా ఆడుతున్నాడు. బెంగళూరు బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 14 పరుగులను రాబట్టాడు. అనంతరం రెండో ఓవర్‌ను షాహ్‌బాజ్‌ కట్టుదిట్టంగా వేశాడు. ఈ ఓవర్‌లో ఆరు రన్స్‌ మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజ్‌లో సాహాతోపాటు మ్యాథ్యూ వేడ్‌ ఉన్నాడు. 


టాస్‌ నెగ్గిన హార్దిక్‌

ప్లేఆఫ్స్ కుర్చీలాట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు జట్లు స్థానం సంపాదించాయి. ఇక మిగిలిన రెండింటి కోసం ఐదు జట్లు రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో మరికాసేపట్లో బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. టాస్‌ నెగ్గిన గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌ ఎంచుకుని బెంగళూరుకు బౌలింగ్‌ అప్పగించాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. దినేశ్‌ కార్తిక్‌ ఎలానూ లోయర్‌ఆర్డర్‌లో రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌లో టాప్‌ఆర్డర్‌ బ్యాటర్లు ఆడితే బెంగళూరు విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు ఇప్పటికే అగ్రస్థానంతో ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న గుజరాత్‌ లీగ్ దశను విజయంతోనే ముగించాలని భావిస్తోంది. 

జట్ల వివరాలు : 

బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్‌ (కెప్టెన్), రాజత్‌ పాటిదార్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లామ్రోర్, దినేశ్‌ కార్తిక్, షాహ్‌బాజ్‌ అహ్మద్, వహిండు హసరంగ, హర్షల్ పటేల్, సిద్ధార్థ్‌ కౌల్, జోష్ హేజిల్‌వుడ్

గుజరాత్‌: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్, మ్యాథ్యూ వేడ్, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, సాయి కిశోర్, లాకీ ఫెర్గూసన్‌, యాష్ దయాల్, షమీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని