T20 League : ఓటమితో ఆరంభం.. చెన్నైని లఖ్‌నవూ అడ్డుకుంటుందా..?

ప్రస్తుతం టీ20 లీగ్‌లో రెండో రౌండ్‌ జోరు కొనసాగుతోంది. డిపెండింగ్‌ ఛాంపియన్‌ ...

Published : 31 Mar 2022 15:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం టీ20 లీగ్‌లో రెండో రౌండ్‌ జోరు కొనసాగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన చెన్నై తొలి మ్యాచ్‌లో ఓటమితో ప్రస్తుత సీజన్‌ను ఆరంభించింది. గత సీజన్‌లోనూ చెన్నై టైటిల్‌ వేటను పరాజయంతో ప్రారంభించి విజేతగా నిలిచింది. దీంతో ఈ సారి కూడా తమ అభిమాన జట్టు పుంజుకుని రేసులో నిలుస్తుందని ఫ్యాన్స్‌ ఆశగా ఎదురు చూస్తున్నారు. అలానే నూతన జట్టు లఖ్‌నవూ కూడా ఓటమితోనే ప్రయాణం మొదలెట్టింది. ఈ క్రమంలో ఇరు జట్లూ తొలి విజయం కోసం శాయశక్తులా పోరాడటం ఖాయం. 

చెన్నైకి అదొక సానుకూలాంశం

టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ సీనియర్‌ బ్యాటర్‌ ఎంఎస్‌ ధోనీ (50*) చాన్నాళ్ల తర్వాత ఫామ్‌లోకి రావడం చెన్నైకి శుభసూచికం. అయితే, ఓపెనర్లు కుదురుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్‌-కాన్వే జంట ఘోరంగా విఫలమైంది. ఉతప్ప (28) వేగంగా పరుగులు చేసినా భారీ స్కోరుగా మరల్చలేకపోయాడు. రాయుడు (17), శివమ్‌ దూబె (3) రాణించలేకపోయారు. ధోనీతోపాటు రవీంద్ర జడేజా చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా ప్రత్యర్థి ముందు చెన్నై భారీ లక్ష్యం నిర్దేశించలేకపోయింది. జడేజా వేగంగా పరుగులు చేయలేకపోవడం దృష్టిసారించాల్సిన అంశమే. ఇక బౌలర్లు తమవంతు కృషి చేశారు. స్వల్ప లక్ష్యమైనా దానిని కాపాడేందుకు శాయశక్తులా కష్టపడ్డారు. వెటరన్‌ బౌలర్ డ్వేన్‌ బ్రావో, జడేజా చక్కగా బౌలింగ్‌ చేశారు. ప్రత్యర్థి ఎదుట మెరుగైన స్కోరును ఉంచితే కాపాడగలమని చెప్పకనే చెప్పారు.

లఖ్‌నవూకు కలిసిరాని అదృష్టం..

తొలిసారి రెండు కొత్త జట్లు తలపడిన మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, మంచి ఫామ్‌లో ఉన్న లఖ్‌నవూ సారథి కేఎల్‌ రాహుల్‌ (0) గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. అయినా సరే గుజరాత్‌ ఎదుట పోరాడే లక్ష్యం నిర్దేశించిన ఘనత కొత్త కుర్రాడు ఆయుష్ బదోని (54), దీపక్‌ హుడా (5)కు దక్కుతుంది. వీరిద్దరూ అర్ధశతకాలతో లఖ్‌నవూ 158/6 స్కోరు చేసింది. అయితే అవేశ్‌ ఖాన్‌ (3.4-33-1), దీపక్‌ హుడా (3-31-1) భారీగా పరుగులు ఇవ్వడం లఖ్‌నవూ ఓటమికి కారణంగా చెప్పుకోవాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రవి బిష్ణోయ్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. గత సీజన్‌లో రాణించని కృనాల్ పాండ్య (21 పరుగులు, 1/17) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోవడం లఖ్‌నవూకు కలిసొచ్చే అంశం. అవేశ్‌ ఖాన్‌ ఫామ్‌లోకి వస్తే చమీరా, బిష్ణోయ్‌, కృనాల్‌ మోహసిన్‌ ఖాన్‌తో కూడిన బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉంటుంది. టాప్‌ ఆర్డర్ బ్యాటర్లు రాహుల్, డికాక్‌, లూయిస్‌, మనీశ్ పాండే కుదురుకుంటే బ్యాటింగ్‌లోనూ తిరుగుండదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని