Delhi vs Bangalore : ఛేదనలో తడబడిన దిల్లీ.. బెంగళూరు ఖాతాలో మరో విజయం..

టీ20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది. దిల్లీతో జరిగిన మ్యాచులో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది...

Published : 16 Apr 2022 23:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది. దిల్లీతో జరిగిన మ్యాచులో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన దిల్లీ తడబడింది. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. బెంగళూరుకిది నాలుగో విజయం కాగా.. దిల్లీకి మూడో ఓటమి. దిల్లీ బ్యాటర్లలో ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ (66 : 38 బంతుల్లో 4×4, 5×6) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్‌ రిషభ్‌ పంత్ (34) ఫర్వాలేదనిపించాడు. శార్దూల్ ఠాకూర్‌ (17), ఓపెనర్‌ పృథ్వీ షా (16), మిచెల్ మార్ష్‌ (14), రోమన్ పావెల్ (0), లలిత్ యాదవ్‌ (1) విఫలమయ్యారు. అక్షర్‌  పటేల్ (10), కుల్దీప్ యాదవ్‌ (10) నాటౌట్‌గా నిలిచారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ మూడు, మహమ్మద్ సిరాజ్‌ రెండు వికెట్లు తీయగా.. వనిందు హసరంగ ఓ వికెట్ పడగొట్టాడు.


బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ దిల్లీపై ఒత్తిడి పెంచుతున్నారు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (66).. హసరంగ వేసిన 12వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లో సిరాజ్‌ ఐదే పరుగులు ఇచ్చాడు. 14వ ఓవర్లో కెప్టెన్‌ రిషభ్ పంత్ (15*) రెండు ఫోర్లు కొట్టాడు. ఆఖరు బంతికి మిచెల్ మార్ష్‌ (14) రనౌటయ్యాడు. జోష్‌ హేజిల్‌వుడ్ వేసిన 15వ ఓవర్‌ తొలి బంతికి రోమన్‌ పావెల్ (0).. కీపర్‌కి చిక్కాడు. ఆఖరు బంతికి లలిత్‌ యాదవ్‌ (1).. భారీ షాట్‌కు ప్రయత్నించి ప్రభుదేశాయ్‌కి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ 115/5 స్కోరుతో నిలిచింది. దిల్లీ విజయానికి ఇంకా 30 బంతుల్లో 75 పరుగులు కావాల్సి ఉంది. 


దిల్లీ బ్యాటర్లు వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఏడో ఓవర్లో హర్షల్ పటేల్‌ ఐదే పరుగులు ఇచ్చాడు. హసరంగ వేసిన ఎనిమిదో ఓవర్లో ఓ సిక్స్ బాదిన డేవిడ్ వార్నర్‌ (54).. ఆ తర్వాతి ఓవర్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మిచెల్ మార్ష్‌ (7) క్రీజులో ఉన్నాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి దిల్లీ 79/1 స్కోరుతో నిలిచింది. దిల్లీ విజయానికి 60 బంతుల్లో 111 పరుగులు కావాల్సి ఉంది.


ఛేదనకు దిగిన దిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి దిల్లీ ఒక వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది. హేజిల్ వుడ్ వేసిన మూడో ఓవర్లో డేవిడ్ వార్నర్‌ (38) ఓ సిక్స్ బాదగా.. పృథ్వీ షా ఓ ఫోర్‌ కొట్టాడు. షాబాజ్‌ అహ్మద్‌ వేసిన తర్వాతి ఓవర్లో వార్నర్‌ మరో ఫోర్‌, సిక్స్‌ బాదాడు. సిరాజ్‌ వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పృథ్వీ షా (16).. అనుజ్‌ రావత్‌కి చిక్కి క్రీజు వీడాడు. మిచెల్ మార్ష్‌ (1) క్రీజులోకి వచ్చాడు.


బెంగళూరు నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిల్లీ బ్యాటర్లు బరిలోకి దిగారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన తొలి ఓవర్లో డేవిడ్ వార్నర్‌ (8) ఓ సిక్స్‌ బాదాడు. మహమ్మద్‌ సిరాజ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో పృథ్వీ షా (11) మరో సిక్స్‌ కొట్టాడు. దీంతో రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.


బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దిల్లీ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు జట్టులో దినేశ్‌ కార్తిక్ (66* : 34 బంతుల్లో 5×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌తో మరోసారి సత్తా చాటాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన దినేశ్ కార్తిక్.. ముస్తాఫిజుర్ రహ్మాన్ వేసిన 18వ ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఏకంగా నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాది.. ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (55 : 34 బంతుల్లో 7×4, 2×6) అర్ధ శతకంతో రాణించాడు. షాబాజ్‌ అహ్మద్ (32*) కూడా ఆఖర్లో ధాటిగా ఆడాడు. కెప్టెన్ డు ప్లెసిస్‌ (8), అనుజ్‌ రావత్ (0), విరాట్ కోహ్లీ (12), సుయశ్ ప్రభుదేశాయ్‌ (6) విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌, ఖలీల్ అహ్మద్‌, అక్షర్‌ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.


దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న కాసేపటికే ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (55) ఔటయ్యాడు. కుల్దీప్‌ యాదవ్ వేసిన 12వ ఓవర్లో రెండో బంతికి అతడు లలిత్‌ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చాడు. 11 - 14 ఓవర్ల మధ్య 20 పరుగులే వచ్చాయి. ఖలీల్‌ అహ్మద్ వేసిన 15వ ఓవర్లో రెండో బంతిని షాబాజ్ అహ్మద్‌ (13) బౌండరీకి తరలించగా.. ఆఖరు బంతిని దినేశ్ కార్తిక్‌ (15) సిక్స్‌గా మలిచాడు. ఈ క్రమంలోనే 15 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు 115/5 స్కోరుతో నిలిచింది.


బెంగళూరు ఆల్ రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (49) అర్ధ శతకానికి చేరువయ్యాడు. కుల్దీప్ యాదవ్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదాడు. అక్షర్‌ పటేల్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో సుయశ్ ప్రభుదేశాయ్ (6) కుల్దీప్‌ యాదవ్‌కి చిక్కాడు. క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ (4) ఓ ఫోర్‌ బాదాడు. అంతకు ముందు 7, 8 ఓవర్లలో కలిపి ఏడే పరుగులు వచ్చాయి. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు 82/4 స్కోరుతో నిలిచింది.


ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో.. బెంగళూరు ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. అక్షర్‌ పటేల్ వేసిన నాలుగో ఓవర్లో గ్లెన్‌ మ్యాక్స్ వెల్ (19) ఓ ఫోర్‌ బాదగా.. ఖలీల్ అహ్మద్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో కోహ్లీ (12) మరో ఫోర్ కొట్టాడు. ఆరో ఓవర్లో మ్యాక్స్‌వెల్ మరో రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. 


ఆరంభంలోనే శార్దూల్‌ ఠాకూర్‌ బెంగళూరును దెబ్బ కొట్టాడు. తన ఓవర్‌ రెండో బంతికే వికెట్‌ తీసుకున్నాడు. అనుజ్‌ రావత్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఐదు పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్‌లో డుప్లెసిస్‌ (8) వికెట్‌ను బెంగళూరు కోల్పోయింది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (4*), మ్యాక్స్‌వెల్ (4*) ఉన్నారు.


డబుల్ ధమాకాలో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్‌ మరికాసేపట్లో దిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. టాస్‌ నెగ్గిన దిల్లీ సారథి రిషభ్‌ పంత్ బౌలింగ్‌ ఎంచుకుని బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలంటే ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాల్సిందే. బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటికీ.. బెంగళూరు బౌలింగ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతుంది. అద్బుతమైన బౌలర్లు ఉన్నప్పటికీ కీలక సమయాల్లో తేలిపోతున్నారు. మరోవైపు దిల్లీ బౌలర్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో విజయం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూద్దాం.. 

జట్ల వివరాలు: 

దిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్‌ పంత్ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ పటేల్, ముస్తాఫిజర్‌ రహ్మాన్‌, ఖలీల్ అహ్మద్

బెంగళూరు: డు ప్లెసిస్‌ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, షాహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, సూయష్‌ ప్రభుదేశాయ్‌, హసరంగ, హర్షల్‌ పటేల్, హేజిల్‌వుడ్, సిరాజ్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని