Kolkata Vs Hyderabad : హైదరాబాద్‌కు వరుసగా ఐదో పరాజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం!

ఘన విజయం సాధించిన శ్రేయస్‌ నేతృత్వంలోని కోల్‌కతా..

Updated : 14 May 2022 23:54 IST

ఘన విజయం సాధించిన కోల్‌కతా

పుణె: హైదరాబాద్‌ వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ టాప్‌ఆర్డర్‌లోని పలువురి ఆటగాళ్లు టెస్టు ఆటను తలపించారు. కోల్‌కతా నిర్దేశించిన 178 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (43), మార్‌క్రమ్‌ (32) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో హైదరాబాద్‌ 123/8 స్కోరుకే పరిమితమైంది. హైదరాబాద్‌ బ్యాటర్లలో కేన్‌ విలియమ్సన్ (17 బంతుల్లో 9), రాహుల్‌ త్రిపాఠి (12 బంతుల్లో 9), నికోలస్‌ పూరన్ (3 బంతుల్లో 2), వాషింగ్టన్‌ సుందర్ (9 బంతుల్లో 3), శశాంక్‌ సింగ్‌ (12 బంతుల్లో 11), మార్కో జాన్‌సెన్‌ (2 బంతుల్లో 1) ఘోరంగా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్‌ 3, టిమ్‌ సౌథీ 2.. ఉమేశ్‌, వరుణ్‌, సునిల్ తలో వికెట్ తీశారు. అంతకుముందు కోల్‌కతా 177/6 స్కోరు చేసింది.

దీంతో హైదరాబాద్‌ తన ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. హైదరాబాద్‌పై ఘన విజయం సాధించిన కోల్‌కతా సాంకేతికంగా ఛాన్స్‌లను సజీవంగా ఉంచుకుంది.  ప్రస్తుతం 12 మ్యాచుల్లో హైదరాబాద్‌ ఐదు విజయాలతో 10 పాయింట్లను మాత్రమే సాధించింది. ఇక కోల్‌కతా 13 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి ఆరో స్థానానికి చేరుకుంది. ఈ ఓటమితో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 


కష్టాల్లో హైదరాబాద్‌

హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో అభిషేక్ శర్మ (43)తోపాటు నికోలస్‌ పూరన్ (2) పెవిలియన్‌కు చేరారు. అనంతరం కాస్త దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన మార్‌క్రమ్ (32)ను కోల్‌కతా బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసి హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు.  ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ ఐదు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజ్‌లో వాషింగ్టన్ సుందర్ (2*), శశాంక్‌ సింగ్ (1*) ఉన్నారు. హైదరాబాద్‌ విజయం సాధించాలంటే ఇంకా 30 బంతుల్లో 78 పరుగులు చేయాలి.


పోరాడుతున్న హైదరాబాద్‌

విజయం కోసం హైదరాబాద్ పోరాడుతోంది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో హైదరాబాద్‌ కీలక వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం 10 ఓవర్లకు హైదరాబాద్‌ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (40*), మార్‌క్రమ్‌ (5*) ఉన్నారు. ఇంకా హైదరాబాద్‌ విజయానికి 60 బంతుల్లో 113 పరుగులు కావాలి.


హైదరాబాద్‌కు షాక్‌

ఆచితూచి ఆడుతూ పరుగులు చేస్తున్న హైదరాబాద్‌కు షాక్‌ తగిలింది. ఓపెనర్‌, కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ (7) మరోసారి విఫలమయ్యాడు. కోల్‌కతా బౌలర్‌ ఆండ్రూ రస్సెల్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (21*), రాహుల్‌ త్రిపాఠి ఉన్నారు. హైదరాబాద్‌ విజయం సాధించాలంటే 14 ఓవర్లలో 146 పరుగులు చేయాలి.


ఛేదన ప్రారంభం

హైదరాబాద్ లక్ష్య ఛేదనను ప్రారంభించింది. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేన్‌ విలియమ్సన్ (1*), అభిషేక్ శర్మ (10*) ఉన్నారు. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో ఆచితూచి ఆడుతున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 


లక్ష్యం ఎంతంటే?

ఆండ్రూ రస్సెల్‌ (49*), సామ్‌ బిల్లింగ్స్‌ (34),  అజింక్య రహానె (28), నితీశ్‌ రాణా (26) రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్‌కు 178 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. వాషింగ్టన్ సుందర్‌ వేసిన చివరి ఓవర్‌లో రస్సెల్‌ మూడు సిక్సర్లు బాదాడు. వెంకటేశ్‌ అయ్యర్ 7, శ్రేయస్‌ అయ్యర్ 15, రింకు సింగ్‌ 5 పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్ 3.. భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్, నటరాజన్‌ తలో వికెట్ తీశారు.


15 ఓవర్లకు స్కోరెంతంటే?

స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటంతో కోల్‌కతా బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా వేస్తుండటంతో ఆచితూచి కోల్‌కతా ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా ఐదు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఆండ్రూ రస్సెల్‌ (16*), సామ్‌ బిల్లింగ్స్ (14*) ఉన్నారు. అయితే రస్సెల్‌ ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతకుముందు రింకు సింగ్‌ (5)ను నటరాజన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 


పుంజుకున్న హైదరాబాద్‌ బౌలర్లు

హైదరాబాద్‌ బౌలర్లు పుంజుకున్నారు. ఉమ్రాన్‌ మాలిక్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. ఆరంభం నుంచి కాస్త దూకుడుగా ఆడిన అజింక్య రహానె (28), నితీశ్‌ రాణా (26)లను ఉమ్రాన్‌ బోల్తా కొట్టించాడు. బౌండరీ లైన్‌ వద్ద శశాంక్‌ సింగ్‌ అద్భుతమైన క్యాచ్‌లను పట్టాడు. ప్రస్తుతం కోల్‌కతా 9 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్ (11*), సామ్‌ బిల్లింగ్స్‌ (1*) ఉన్నారు.


ధాటిగా ఆడేసిన బ్యాటర్లు..

ఆరంభంలో ఆచితూచి ఆడిన కోల్‌కతా బ్యాటర్లు పవర్‌ ప్లే ముగిసేసరికి ధాటిగా ఆడేశారు. మరీ ముఖ్యంగా నితీశ్ రాణా (24*) దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాణాతోపాటు అజింక్య రహానె (20) ఉన్నాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఇప్పటికే 38 పరుగులు జోడించారు. హైదరాబాద్‌ బౌలర్లు కాస్త పట్టువిడవడంతో దంచి కొట్టారు.


ఓపెనర్‌ ఔట్

హైదరాబాద్‌కు జాన్‌సెన్‌ మంచి ఆరంభం ఇచ్చాడు. రెండు ఓవర్లపాటు వికెట్‌ లేకుండా ముగిద్దామని అనుకున్న కోల్‌కతాకు షాక్‌ ఇస్తూ వెంకటేశ్‌ అయ్యర్‌ (7)ను జాన్‌సెన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. తొలి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కుమార్‌లో ఫోర్‌తో సహా తొమ్మిది పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌లో జాన్‌సెన్‌ సిక్సర్‌ ఇచ్చినా.. కీలకమైన వికెట్‌ను పడగొట్టాడు. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజ్‌లో అజింక్య రహానె (7*), నితీశ్‌ రాణా ఉన్నాడు.


టాస్‌ నెగ్గిన కోల్‌కతా

తొలి రెండు పరాభవాల తర్వాత వరుసగా ఐదు విజయాలు సాధించి సంచలనంగా మారిన హైదరాబాద్‌ ఆ తర్వాత డీలా పడింది. నాలుగు ఓటములతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే హైదరాబాద్‌ ఛాన్స్‌ ఉంటుంది. ఈ క్రమంలో కోల్‌కతాతో హైదరాబాద్‌ మరికాసేపట్లో తలపడనుంది. టాస్‌ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ బ్యాటింగ్‌ ఎంచుకుని హైదరాబాద్‌కు బౌలింగ్‌ అప్పగించాడు. మరోవైపు కోల్‌కతాకు కూడానూ ఇది కీలకమైన మ్యాచే. ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు ముగిసినా సాంకేతికంగా రేసులోనే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ అవకాశాలను కోల్‌కతా అడ్డుకుంటుందా...? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. హైదరాబాద్‌ జట్టులోకి మళ్లీ జాన్‌సెన్‌ వచ్చాడని కేన్‌ తెలిపాడు. ఈసారి హైదరాబాద్‌ నలుగురు ఫాస్ట్‌బౌలర్లతో బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు: 

హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్‌ పూరన్, శశాంక్‌ సింగ్, వాషింగ్టన్‌ సుందర్‌, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్‌ కుమార్‌, టి. నటరాజన్, ఉమ్రాన్‌ మాలిక్

కోల్‌కతా: వెంకటేశ్‌ అయ్యర్, అజింక్య రహానె, నితీశ్‌ రాణా, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్), సామ్‌ బిల్లింగ్స్‌, రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, సునిల్ నరైన్, ఉమేశ్‌ యాదవ్, టిమ్‌ సౌథీ, వరుణ్‌ చక్రవర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని