Kolkata Vs Lucknow : ప్లేఆఫ్స్‌కు ‘లక్‌’నవూ.. కోల్‌ ‘కథ’ ముగిసే

టీ20 లీగ్‌ తుది దశకు చేరుకుంది. కోల్‌కతా ఎదుట లఖ్‌నవూ భారీ లక్ష్యం ఉంచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లకు.. 

Updated : 18 May 2022 23:54 IST

ముంబయి: లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై లఖ్‌నవూ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఎనిమిది వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్ (50), రింకు సింగ్ (40), నితీశ్‌ రాణా (42), సామ్‌ బిల్లింగ్స్‌ (36), సునిల్ నరైన్ (21*) ధాటిగా ఆడినా విజయం సాధించలేకపోయింది. లఖ్‌నవూ బౌలర్లలో మోహ్‌సిన్‌ ఖాన్‌ 3, మార్కస్‌ స్టొయినిస్‌ 3.. కృష్ణప్ప గౌతమ్‌, రవి బిష్ణోయ్‌ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో కోల్‌కతా ఇంటిముఖం పట్టింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (70 బంతుల్లో 140 నాటౌట్: 10 ఫోర్లు, 10 సిక్సర్లు ) శతకంతో చెలరేగాడు. కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 68 నాటౌట్: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) డికాక్‌కు అండగా నిలిచాడు. టీ20 లీగ్‌లో లఖ్‌నవూ రికార్డు సృష్టించింది. వికెట్‌ కోల్పోకుండా 20 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసింది. టీ20 లీగ్‌ దశలో 14 మ్యాచుల్లో తొమ్మిది విజయాలతో లఖ్‌నవూ (18) ప్లేఆఫ్స్‌కు చేరుకున్న రెండో జట్టుగా అవతరించింది.


శ్రేయస్‌ అయ్యర్ ఔట్

కీలక సమయంలో శ్రేయస్‌ అయ్యర్ (50) పెవిలియన్‌కు చేరాడు. లఖ్‌నవూ బౌలర్‌ స్టొయినిస్ బౌలింగ్‌లో దీపక్‌ హుడా క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. అంతకుముందు నితీశ్ రాణా (42) దూకుడుగా ఆడేశాడు. నితీశ్‌తో 56 పరుగులు, సామ్‌ బిల్లింగ్స్ (28*)తో కలిసి 66 పరుగులు జోడించాడు. ప్రస్తుతం కోల్‌కతా 14 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కోల్‌కతా విజయం సాధించాలంటే ఇంకా 36 బంతుల్లో 79 పరుగులు చేయాలి.


దూకుడుగా బ్యాటింగ్‌

వికెట్లు పడినా పవర్‌ప్లే ఓవర్లలో కోల్‌కతా ధాటిగా ఆడింది. మరీ ముఖ్యంగా నితీశ్ రాణా (22 బంతుల్లో 42: తొమ్మిది ఫోర్లు) వేగంగా ఆడేశాడు. అయితే లఖ్‌నవూ బౌలర్‌ కృష్ణప్ప గౌతమ్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి స్టొయినిస్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్ (26*), సామ్‌ బిల్లింగ్స్‌ (1*) ఉన్నారు. కోల్‌కతా విజయానికి ఇంకా 72 బంతుల్లో 136 పరుగులు చేయాలి.


ఛేదన ప్రారంభం..

లక్ష్య ఛేదనను కోల్‌కతా ప్రారంభించింది. అయితే తొలి ఓవర్‌లోనే  ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. డికాక్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. మోహ్‌సిన్‌ వేసిన ఈ ఓవర్‌లో నాలుగు పరుగులే వచ్చాయి. హోల్డర్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనూ నాలుగే వచ్చాయి. ఇక మూడో ఓవర్‌ వేసిన మోహ్‌సిన్‌ మరొక వికెట్ తీశాడు. అభిజిత్‌ తోమర్‌ (4) షాట్‌ కొట్టేందుకు యత్నించి కేఎల్ రాహుల్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజ్‌లో నితీశ్ రాణా (5*), శ్రేయస్‌ అయ్యర్ ఉన్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 210 పరుగులు చేసింది.


లఖ్‌నవూ రికార్డు బ్యాటింగ్‌

టీ20 లీగ్‌లో లఖ్‌నవూ రికార్డు సృష్టించింది. వికెట్‌ కోల్పోకుండా 20 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసింది. నిదానంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లఖ్‌నవూ భారీ స్కోరు సాధించింది. దీంతో కోల్‌కతాకు 211 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (70 బంతుల్లో 140 నాటౌట్: 10 ఫోర్లు, 10 సిక్సర్లు ) శతకంతో చెలరేగాడు. మరోవైపు కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 68 నాటౌట్: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మూడు క్యాచ్‌లను వదిలేయడం కూడా లఖ్‌నవూకు కలిసొచ్చింది. వికెట్లను తీయడంలో కోల్‌కతా బౌలర్లు తేలిపోయారు. సీజన్‌ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం.


డికాక్‌ శతకం..

లఖ్‌నవూ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (102*) సెంచరీ సాధించాడు. ప్రస్తుత టీ20 లీగ్‌లో శతకం చేసిన మూడో బ్యాటర్‌గా అవతరించాడు. ఇంతకుముందు జోస్ బట్లర్ (3), కేఎల్ రాహుల్‌ (2) మాత్రమే సెంచరీలు బాదారు. ఇప్పుడు డికాక్‌ శతకాల వీరుల జాబితాలో చేరాడు. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసేసరికి లఖ్‌నవూ వికెట్ నష్టపోకుండా 164 పరుగులు చేసింది. క్రీజ్‌లో డికాక్‌తోపాటు కేఎల్ రాహుల్ (61*) ఉన్నాడు.


నిలకడగా బ్యాటింగ్‌

 లఖ్‌నవూ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో ఓపెనర్లు డికాక్ (60*), కేఎల్ రాహుల్ (50*) అర్ధశతకాలు బాదేశారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి లఖ్‌నవూ వికెట్ నష్టపోకుండా 111 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు. ఆరంభంలో డికాక్‌ క్యాచ్‌ను కోల్‌కతా ఫీల్డర్లు వదిలేయడం లఖ్‌నవూకు కలిసొచ్చింది.


ఆచితూచి ఆడుతూ..

కీలకమైన మ్యాచ్‌లో లఖ్‌నవూ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. కోల్‌కతా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. క్రీజ్‌లో డికాక్ (39*), కేఎల్ రాహుల్ (28*) ఉన్నారు. అడపాదడపా బౌండరీలు బాదుతున్న లఖ్‌నవూ బ్యాటర్లు ఇక నుంచి దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది.


బ్యాటింగ్‌ ప్రారంభం..

లఖ్‌నవూ బ్యాటింగ్‌ ప్రారంభించింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో లఖ్‌నవూ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి లఖ్‌నవూ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజ్‌లో డికాక్ (9*), కేఎల్ రాహుల్ (13*) ఉన్నారు. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద డికాక్‌ ఇచ్చిన క్యాచ్‌ను అభిజిత్ తోమర్‌ జారవిడిచాడు. అయితే అదే ఓవర్‌ చివరి బంతికి డికాక్‌ సిక్సర్ బాదాడు.


టాస్‌ నెగ్గిన కేఎల్ రాహుల్

టీ20 లీగ్‌ తుది దశకు చేరుకుంది. లీగ్‌ దశలో అన్ని జట్లకూ ఒక్కో మ్యాచ్‌ మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో మరికాసేపట్లో లఖ్‌నవూ, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇవాళ టోర్నీలో రెండు జట్ల భవితవ్యం తేలిపోతుందా..? అంటే చెప్పలేని పరిస్థితి.. ఎందుకంటే లఖ్‌నవూ గెలిస్తేనే కోల్‌కతా ఇంటిముఖం పడుతుంది. ఒక వేళ కోల్‌కతా విజయం సాధిస్తే మాత్రం ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారుతుంది. అయితే లఖ్‌నవూకు ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా.. కోల్‌కతా అవకాశాలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి ఉత్కంఠభరిత పోరులో టాస్‌ నెగ్గిన లఖ్‌నవూ బ్యాటింగ్‌ ఎంచుకుని కోల్‌కతాకు బౌలింగ్‌ అప్పగించింది. 

కేఎల్ రాహుల్‌ నేతృత్వంలోని లఖ్‌నవూ ఇప్పటి వరకు 13 మ్యాచులకుగాను ఎనిమిది విజయాలు సాధించి 16 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి రెండో స్థానంతో ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు శ్రేయస్ నాయకత్వం వహిస్తున్న కోల్‌కతా కేవలం ఆరు మ్యాచుల్లో గెలిచి 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఇరు జట్లకూ ఆఖరి మ్యాచ్‌ కావడంతో విజయం ఎవరివైపు ఉంటుందో తెలియాలంటే కాసేపు వేచి చూడాల్సిందే. 

జట్ల వివరాలు: 

లఖ్‌నవూ: క్వింటన్ డికాక్‌, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), ఎవిన్ లూయిస్, దీపక్‌ హుడా, మనన్‌ వోహ్రా, మార్కస్ స్టొయినిస్‌, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్‌, మోహ్‌సిన్‌ ఖాన్‌, అవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌

కోల్‌కతా: వెంకటేశ్‌ అయ్యర్, అభిజిత్ తోమర్, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్), నితీశ్‌ రాణా, సామ్‌ బిల్లింగ్స్, రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, సునిల్ నరైన్, ఉమేశ్‌ యాదవ్, టిమ్‌ సౌథీ, వరుణ్‌ చక్రవర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు