Lucknow vs Rajasthan : లఖ్‌నవూకి షాక్‌.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ గెలుపు

టీ20 మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న లఖ్‌నవూ జట్టుకి రాజస్థాన్ షాకిచ్చింది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ గెలుపొందింది...

Updated : 10 Apr 2022 23:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న లఖ్‌నవూ జట్టుకి రాజస్థాన్ షాకిచ్చింది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన లఖ్‌నవూ జట్టును రాజస్థాన్‌ బౌలర్లు  162 పరుగులకే పరిమితం చేశారు. దీంతో రాజస్థాన్‌ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. లఖ్‌నవూ బ్యాటర్లలో ఓపెనర్‌ క్వింటన్‌ డి కాక్ (39), దీపక్‌ హుడా (25), కృనాల్ పాండ్య (22) రాణించారు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (0) గోల్డెన్‌ డకౌట్ కాగా.. కృష్ణప్ప గౌతమ్‌ (0), జేసన్‌ హోల్డర్‌ (8), ఆయుష్‌ బదోని (5), దుష్మంత చమీర (13) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన మార్కస్‌ స్టొయినిస్‌ (38*), అవేశ్‌ ఖాన్ (7*) ఆఖరి వరకు పోరాడిన ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు, ట్రెంట్ బౌల్ట్‌ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీప్ సేన్‌ చెరో వికెట్ పడగొట్టారు.


చెలరేగుతున్న రాజస్థాన్‌ బౌలర్లు..

రాజస్థాన్ బ్యాటర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ లఖ్‌నవూని కట్టడి చేస్తున్నారు. 13వ ఓవర్లో అశ్విన్ ఆరు పరుగులు ఇవ్వగా.. తర్వాతి  ఓవర్లో కుల్దీప్‌ ఏడే పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 15వ ఓవర్లో కృనాల్ పాండ్య (15) రెండు ఫోర్లు బాదాడు. చాహల్ వేసిన 16వ ఓవర్లో మూడో బంతికి క్వింటన్‌ డి కాక్‌ (39) రియాన్‌ పరాగ్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. ఐదో బంతికి కృనాల్ పాండ్య (22) బౌల్డయ్యాడు. దుష్మంత చమీర (4), మార్కస్ స్టొయినిస్‌ (1) క్రీజులో ఉన్నారు. దీంతో 16 ఓవర్లకు లఖ్‌నవూ 106/7 స్కోరుతో నిలిచింది. లఖ్‌నవూ విజయానికి ఇంకా 24 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి ఉంది.


కట్టుదిట్టంగా రాజస్థాన్ బౌలింగ్‌..

లఖ్‌నవూ ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. 9వ ఓవర్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదు పరుగులు ఇచ్చాడు. కుల్దీప్‌ సేన్‌ వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతికే దీపక్‌ హుడా (25) బౌల్డయ్యాడు. ఆఖరు బంతిని డి కాక్ (26) బౌండరీకి తరలించాడు. 11వ ఓవర్లో నాలుగే పరుగులు వచ్చాయి. యుజ్వేంద్ర చాహల్ వేసిన 12వ ఓవర్లో ఆఖరు బంతికి ఆయుష్‌ బదోని (5) రియాన్ పరాగ్‌కి చిక్కాడు. దీంతో 12 ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్‌నవూ ఐదు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. లఖ్‌నవూ విజయానికి ఇంకా 48 బంతుల్లో 92 పరుగులు కావాల్సి ఉంది.


నెమ్మదిగా ఆడుతున్న లఖ్‌నవూ బ్యాటర్లు..

ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో లఖ్‌నవూ బ్యాటర్లు వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడుతున్నారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఐదో ఓవర్లో దీపక్‌ హుడా ఓ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదు పరుగులు ఇచ్చాడు. కుల్‌దీప్‌ సేన్‌ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్ (15) ఓ సిక్స్ బాదాడు. యుజ్వేంద్ర చాహల్ వేసిన 8వ ఓవర్లో దీపక్‌ హుడా (22) మరో ఫోర్‌ కొట్టాడు. ఈ క్రమంలోనే 8 ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్‌నవూ 47/3 స్కోరుతో నిలిచింది.


రాజస్థాన్‌ బౌలర్ల జోరు.. లఖ్‌నవూ మూడు వికెట్లు డౌన్‌

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ తడబడుతోంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాహుల్‌ సేన.. ట్రెంట్ బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి బంతికి కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. తర్వాత వైడ్‌ వచ్చింది. రెండో బంతికి  కృష్ణప్ప గౌతమ్‌ (0) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 3.3 ఓవర్‌కు జేసన్‌ హొల్డర్‌ (8) అశ్విన్‌కు చిక్కాడు. 4 ఓవర్లకు లఖ్‌నవూ 19/3 స్కోరుతో నిలిచి కష్టాల్లో పడింది. దీపక్‌ హుడా (5*), క్వింటన్ డికాక్ (4*)క్రీజులో ఉన్నారు.


రాణించిన హెట్‌మయర్‌.. లఖ్‌నవూ ముందు మోస్తరు లక్ష్యం

రాజస్థాన్ బ్యాటింగ్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లఖ్‌నవూ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బ్యాటర్లలో బ్యాటర్లలో షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (59* : 36 బంతుల్లో 1×4, 5×6) అర్ధ శతకంతో రాణించాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (29), కెప్టెన్ సంజూ శాంసన్‌ (13), జోస్‌ బట్లర్ (13) పరుగులు చేశారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (28) రిటైర్డ్‌ ఔట్‌గా మధ్యలోనే క్రీజు వీడాడు. వాండర్ డస్సెన్ (4), రియాన్‌ పరాగ్‌ (8) విఫలమయ్యాడు. ట్రెంట్ బౌల్ట్‌ (2*) పరుగులు చేశాడు. లఖ్‌నవూ బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్‌ రెండు, జేసన్‌ హోల్డర్ చెరో రెండేసి వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్‌ ఓ వికెట్ పడగొట్టాడు.


కట్టుదిట్టంగా లఖ్‌నవూ బౌలింగ్‌.. నెమ్మదిగా రాజస్థాన్‌ బ్యాటింగ్‌

స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ ఆటగాళ్లు వికెట్‌ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడుతున్నారు. 11వ ఓవర్లో దుష్మంత చమీర మూడు పరుగులు ఇవ్వగా.. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో ఆఖరు బంతిని షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (19) సిక్సర్‌గా మలిచాడు. 13, 14, 15వ ఓవర్లలో కలిపి 10 పరుగులు వచ్చాయి. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన 16వ ఓవర్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ (22) వరుసగా రెండు సిక్సులు బాదాడు. దీంతో 16 ఓవర్లకు రాజస్థాన్‌ 108/4 స్కోరుతో నిలిచింది.


చెలరేగుతున్న లఖ్‌నవూ బౌలర్లు..కీలక వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌

లఖ్‌నవూ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో రాజస్థాన్‌ స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్‌ వేసిన ఏడో ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన కెప్టెన్ సంజూ శాంసన్‌ (13).. అవేశ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనూ మరో ఫోర్‌ బాదాడు. ఈ క్రమంలోనే జేసన్‌ హోల్డర్‌ వేసిన 9వ ఓవర్లో మూడో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాండర్‌ డస్సెన్ ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన పదో ఓవర్లో తొలి బంతికే ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్ (29).. హోల్డర్‌కి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. ఐదో బంతికి వాండర్‌ డస్సెన్‌ (5) బౌల్డయ్యాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (3), రవిచంద్రన్‌ అశ్విన్‌ (0) క్రీజులో ఉన్నారు. 


పవర్‌ ప్లే పూర్తి.. రాజస్థాన్‌ స్కోరెంతంటే.?

పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి రాజస్థాన్‌ ఒక వికెట్‌ కోల్పోయి 44 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్‌ వేసిన నాలుగో ఓవర్లో దేవ్‌దత్‌ పడిక్కల్ (25) రెండు ఫోర్లు కొట్టాడు. ఐదో ఓవర్లో దుష్మంత చమీర మూడే పరుగులు ఇచ్చాడు. అవేశ్ ఖాన్‌ వేసిన ఆరో ఓవర్లో తొలి బంతికి ఓపెనర్‌ జోస్‌ బట్లర్ (13) బౌల్డయ్యాడు. సంజూ శాంసన్‌ (2) క్రీజులో ఉన్నాడు.


ధాటిగా ఆడుతున్న రాజస్థాన్ ఓపెనర్లు..

డబుల్ హెడర్‌ మ్యాచ్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్ ఓడిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. దుష్మంత చమీర వేసిన తొలి ఓవర్లో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్ (14) రెండు ఫోర్లు బాదగా.. జేసన్‌ హోల్డర్‌ వేసిన రెండో ఓవర్లో జోస్‌ బట్లర్ (11) ఓ సిక్స్‌, ఓ ఫోర్‌ కొట్టాడు. మూడో ఓవర్లో పడిక్కల్ మరో ఫోర్‌ కొట్టాడు.


టాస్‌ నెగ్గిన కేఎల్ రాహుల్.. రాజస్థాన్‌ను అడ్డుకునేనా.?

టీ20 మెగా టోర్నీ డబుల్ హెడర్ మ్యాచులో భాగంగా మరి కాసేపట్లో లఖ్‌నవూ, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. ఇప్పటి వరకు లఖ్‌నవూ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గెలుపొందగా.. రాజస్థాన్‌ జట్టు మూడింట్లో రెండు విజయాలు సాధించింది. ఈ మ్యాచులో ఏ జట్టు ఆదిపత్యం చెలాయిస్తుందో చూడాలి.!

తుది జట్ల వివరాలు..

రాజస్థాన్ : జోస్ బట్లర్, రస్సీ వాండర్‌ డస్సెన్‌, దేవ్‌దత్ పడిక్కల్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్ కీపర్‌), షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రియాన్ పరాగ్‌, కుల్దీప్ సేన్‌, రవిచంద్రన్‌ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌

లఖ్‌నవూ : కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), క్వింటన్‌ డి కాక్‌ (వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టోయినిస్‌, దీపక్‌ హుడా, ఆయుష్‌ బదోని, కృనాల్ పాండ్య, జేసన్‌ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్‌, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని