Mumbai Vs Hyderabad : వరుస ఓటములకు బ్రేక్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌ విజయం

సాంకేతికతంగా మాత్రమే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్న హైదరాబాద్‌ మరికాసేపట్లో ముంబయితో తలపడనుంది. టాస్‌ నెగ్గిన ..

Updated : 17 May 2022 23:45 IST

ముంబయి: వరుసగా ఐదు ఓటముల తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్‌ విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబయిపై హైదరాబాద్‌ 3 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్ 193/6 స్కోరు సాధించింది. అనంతరం ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ (48), ఇషాన్‌ కిషన్‌ (43), టిమ్‌ డేవిడ్ (46) ధాటిగా ఆడటంతో ఓ దశలో ముంబయి గెలిచేలా కనిపించింది. అయితే భువనేశ్వర్‌ కుమార్‌ (1/26), ఉమ్రాన్‌ మాలిక్ (3/23) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో హైదరాబాద్‌ విజయం సాధించింది. మిగతా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్‌ ఒక వికెట్ తీశాడు. టి. నటరాజన్‌ (0/60) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 

ప్రస్తుతం ఆరో విజయం సాధించిన హైదరాబాద్‌ (12) స్థానం మాత్రం పాయింట్ల పట్టికలో మారలేదు. ఇప్పటివరకు 13 మ్యాచులకుగాను ఆరు విజయాలు, ఏడు ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ తన ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్‌ (మే 22)తో తలపడనుంది. మరోవైపు ముంబయి తన చివరి మ్యాచ్‌లో దిల్లీతో మే 21న ఢీకొట్టనుంది. దిల్లీకి ప్లేఆఫ్స్ బెర్తు దక్కాలంటే తప్పక గెలవాలి. 


స్వల్ప వ్యవధిలో వికెట్లు

స్వల్ప వ్యవధిలో ముంబయి రెండు వికెట్లను చేజార్చుకుంది. హైదరాబాద్‌ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా వేస్తున్నప్పటికీ ముంబయి బ్యాటర్లు పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి ముంబయి రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజ్‌లో డానియల్‌ సామ్స్ (14*), తిలక్ వర్మ (8*) ఉన్నారు. మంబయి విజయం సాధించాలంటే 36 బంతుల్లో ఇంకా 71 పరుగులు చేయాలి.


దూకుడుగా బ్యాటింగ్‌

హైదరాబాద్‌ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో ముంబయి బ్యాటర్లు అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ (35*), ఇషాన్‌ కిషన్ (35*) ఉన్నారు. ముంబయి విజయానికి ఇంకా 66 బంతుల్లో 116 పరుగులు కావాలి.


ఛేదన ప్రారంభం

ముంబయి ఛేదన ప్రారంభించింది. ఓపెనర్లు నిలకడగా ఆడుతూ పరుగులు  రాబడుతున్నారు. తొలి రెండు ఓవర్లలో ఆచితూచి ఆడారు. అయితే వాషింగ్టన్ సుందర్‌ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లను బాదారు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌ (10*), రోహిత్ శర్మ (9*) ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ 193/6 స్కోరు చేసింది.


ముంబయి లక్ష్యం ఎంతంటే?

స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటంతో హైదరాబాద్‌ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో ముంబయికి 194 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. రాహుల్ త్రిపాఠి (76) అర్ధశతకం సాధించగా.. ప్రియమ్‌ గార్గ్ (42), నికోలస్‌ పూరన్ (38) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ  9, మార్‌క్రమ్ 2 కేన్‌ విలియ్సన్ 8*, సుందర్‌ 9 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో రమణ్‌దీప్‌ 3.. డానియల్‌ సామ్స్, రిలే మెరిడెత్, బుమ్రా తలో వికెట్ తీశారు. టీ20 ఫార్మాట్‌లో బుమ్రా 250 వికెట్లను తీసిన బౌలర్‌గా అవతరించాడు.


పోటాపోటీగా బౌండరీలు

 

హైదరాబాద్‌ బ్యాటర్లు పోటాపోటీగా బౌండరీలు బాదేశారు. ముంబయి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్ త్రిపాఠి (50*), నికోలస్‌ పూరన్ (35*) ఉన్నారు. ఈ క్రమంలో త్రిపాఠి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు ధాటిగా ఆడిన ప్రియమ్‌ గార్గ్ (42) పెవిలియన్‌కు చేరాడు. 


దూకుడుగా బ్యాటింగ్‌

ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయినా హైదరాబాద్‌ స్కోరు బోర్డు వేగం మాత్రం తగ్గలేదు. బ్యాటర్లు ప్రియమ్‌ గార్గ్ (37*), రాహుల్ త్రిపాఠి (33*) ఆచితూచి ఆడుతూనే భారీ షాట్లు కొట్టారు. దీంతో ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లను చక్కగా ఎదుర్కొని మరీ ఇద్దరు బ్యాటర్లు అర్ధశతక (71) భాగస్వామ్యం నిర్మించారు.


అభిషేక్‌ ఔట్

హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. తొలి రెండు ఓవర్లలో ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు చేసేందుకు హైదరాబాద్‌ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే మూడో ఓవర్‌లో కాస్త వేగం పెంచేందుకు ప్రయత్నించే క్రమంలో అభిషేక్ శర్మ (9) పెవిలియన్‌కు చేరాడు. అయితే ప్రియమ్‌ గార్గ్‌ (9*) రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజ్‌లో ప్రియమ్‌ గార్గ్‌తోపాటు రాహుల్ త్రిపాఠి (1*) ఉన్నారు.


టాస్‌ నెగ్గిన ముంబయి

సాంకేతికతంగా మాత్రమే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్న హైదరాబాద్‌ మరికాసేపట్లో ముంబయితో తలపడనుంది. టాస్‌ నెగ్గిన ముంబయి కెప్టెన్‌ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకుని హైదరాబాద్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ 12 మ్యాచులకుగాను ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక మిగిలిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే.. ఇతర జట్ల ఫలితాలపై ఏమైనా అవకాశాలు కొద్దో గొప్పో ఉంటాయి. ఇప్పుడు ముంబయి చేతిలో ఓటమిపాలైతే మాత్రం ఇంటిముఖం పట్టక తప్పదు. మరోవైపు ముంబయికి ఇప్పటికే దారులు మూసుకుపోయాయి. కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసింది. అయితే ఇతర జట్ల ఫలితాలను ప్రభావితం చేసే ఛాన్స్‌ మాత్రం ముంబయి ఎదుట ఉంది. అంతేకాకుండా మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించి కాస్త గౌరవంగా టోర్నీ ముగించాలని ముంబయి అభిమానులు ఆశిస్తున్నారు. 

జట్ల వివరాలు: 

హైదరాబాద్‌ : అభిషేక్ శర్మ, ప్రియమ్‌ గార్గ్‌, కేన్‌ విలియమ్సన్ (కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్‌ పూరన్, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫరూఖి, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్‌

ముంబయి : ఇషాన్‌ కిషన్‌, రోహిత్ శర్మ (కెప్టెన్‌), డానియల్ సామ్స్, తిలక్ వర్మ, రమణ్‌దీప్‌ సింగ్, త్రిస్టాన్‌ స్టబ్స్, టిమ్‌ డేవిడ్, సంజయ్ యాదవ్, బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్‌ మార్కండే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు