Mumbai vs Rajasthan : ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం..

టీ20 మెగా టోర్నీలో రాజస్థాన్ రెండో విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబయి.. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 170/8 స్కోరుకే పరిమితమైంది...

Updated : 02 Apr 2022 20:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో రాజస్థాన్ రెండో విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబయి.. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 170/8 స్కోరుకే పరిమితమైంది. దీంతో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీరన్ పొలార్డ్ (22) ఆఖరి బంతికి ఔటయ్యాడు. ముంబయి బ్యాటర్లలో తిలక్‌ వర్మ (61 : 33 బంతుల్లో 3×4, 5×6), ఓపెనర్‌ ఇషాన్ కిషన్ (54 : 43 బంతుల్లో 5×4, 1×6) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (10), అన్మోల్ ప్రీత్ సింగ్ (5), టిమ్ డేవిడ్‌ (1), డేనియల్ సామ్స్ (0) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, నవదీప్‌ సైనీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీశారు.


స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయిన ముంబయి

ముంబయి ఓపెనర్‌ ఇషాన్ కిషన్‌ (54) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్ వేసిన 13వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించిన అతడు ఈ మార్క్‌ను చేరుకున్నాడు. ఇదే ఓవర్లో ఆఖరు బంతికి బౌండరీ లైన్‌ వద్ద నవదీప్‌ సైనికి చిక్కి క్రీజు వీడాడు. అంతకు ముందు రియాన్ పరాగ్‌ వేసిన 12వ ఓవర్లో ఓ సిక్స్ బాదిన తిలక్‌ వర్మ (61).. 14వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 15వ ఓవర్లో తొలి బంతిని సిక్స్‌గా మలిచిన తిలక్‌ వర్మ.. రెండో బంతికి బౌల్డయ్యాడు. కీరన్‌ పొలార్డ్ (0), టిమ్‌ డేవిడ్‌ (1) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ముంబయి విజయానికి ఇంకా 58 పరుగులు కావాల్సి ఉంది. 


వేగం పెంచిన ముంబయి బ్యాటర్లు..

ముంబయి బ్యాటర్లు వికెట్‌ కాపాడుకుంటూ నిలకడగా ఆడుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌ వేసిన ఏడో ఓవర్లో ఆఖరు బంతిని తిలక్‌ వర్మ (37) సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాతి ఓవర్లో యుజ్వేంద్ర చాహల్ ఆరే పరుగులు ఇచ్చాడు. నవదీప్ సైని వేసిన తొమ్మిదో ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించిన తిలక్‌ వర్మ.. ఐదో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ తిలక్‌ ఓ సిక్స్‌, ఓ ఫోర్‌ బాదాడు. ఇషాన్‌ కిషన్‌ (40) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి 94/2 స్కోరుతో నిలిచింది. 


పవర్‌ ప్లే పూర్తి..

పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి ముంబయి జట్టు రెండు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. నవదీప్‌ సైని వేసిన నాలుగో ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ (31) ఓ సిక్స్‌, ఓ ఫోర్‌ బాదాడు. ఆఖరు బంతికి అన్మోల్ ప్రీత్ సింగ్‌ (5).. దేవ్‌దత్‌ పడిక్కల్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదే పరుగులు ఇచ్చాడు. ఆరో ఓవర్లో తొలి బంతిని ఇషాన్‌ కిషన్‌ బౌండరీకి తరలించాడు. తిలక్‌ వర్మ (2) క్రీజులో ఉన్నాడు.


హిట్‌మ్యాన్‌ ఔట్‌..

భారీ లక్ష్యంతో ముంబయి బ్యాటర్లు ఛేదనకు దిగారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ (8) ఓ ఫోర్ బాదగా.. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్లో రెండో బంతిని సిక్స్‌గా మలిచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (10).. ఐదో బంతికి రియాన్‌ పరాగ్‌కి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. మూడో ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. అన్మోల్‌ ప్రీత్ సింగ్‌ (5) క్రీజులో ఉన్నాడు. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి 24/1 స్కోరుతో నిలిచింది.


రాజస్థాన్ బ్యాటింగ్‌ పూర్తి.. ముంబయి ముందు భారీ లక్ష్యం..

రాజస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ముంబయి ముందు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్‌ జోస్ బట్లర్‌ (100 : 68 బంతుల్లో 11×4, 5×6) శతకంతో అదరగొట్టాడు. షిమ్రోన్ హెట్‌మయర్‌ (35 : 14 బంతుల్లో 3×4, 3×6) క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో అలరించాడు. సంజూ శాంసన్‌ (30) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. యశస్వీ జైస్వాల్‌ (1), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (7), నవదీప్‌ సైని (2) విఫలమయ్యారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (0) డకౌటయ్యాడు. రియాన్ పరాగ్‌ (5) ఆఖరు బంతికి క్యాచ్‌ ఔటయ్యాడు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కీరన్ పొలార్డ్‌ ఓ వికెట్ తీశాడు. ఆఖరి రెండు ఓవర్లలోనే రాజస్థాన్ ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. 


వేగం పెంచిన రాజస్థాన్ బ్యాటర్లు..

రాజస్థాన్ బ్యాటర్లు వేగం పెంచారు. మురుగన్ అశ్విన్ వేసిన 11వ ఓవర్లో సంజూ శాంసన్‌ (30) ఓ సిక్స్, జోస్‌ బట్లర్‌ (96) ఓ సిక్స్, ఓ ఫోర్‌ బాదారు. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే 21 పరుగులు వచ్చాయి. డేనియల్ సామ్స్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో శాంసన్‌ మరో సిక్స్ బాదాడు. కీరన్‌ పొలార్డ్ వేసిన 13వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించిన బట్లర్‌.. బుమ్రా వేసిన ఆ తర్వాతి ఓవర్లో మరో ఫోర్ బాదాడు. ఈ క్రమంలోనే కీరన్‌ పొలార్డ్‌ వేసిన 15వ ఓవర్‌ రెండో బంతిని గాల్లోకి లేపిన కెప్టెన్ సంజూ శాంసన్‌.. తిలక్‌ వర్మకు చిక్కి క్రీజు వీడాడు. షిమ్రోన్ హెట్‌మయర్‌ (1) క్రీజులో ఉన్నాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్‌ 138/3 స్కోరుతో నిలిచింది. 


బట్లర్‌ అర్ధ శతకం.. నిలకడగా రాజస్థాన్‌ బ్యాటింగ్‌..

రాజస్థాన్ ఓపెనర్ జోస్‌ బట్లర్‌ (64) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. డేనియల్‌ సామ్స్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతడు ఈ మార్క్‌ను అందుకున్నాడు. అంతకు ముందు పొలార్డ్ వేసిన ఏడో ఓవర్లో మూడో బంతిని కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌండరీకి తరలించాడు. మురుగన్‌ అశ్విన్ వేసిన తొమ్మిదో ఓవర్లో ఆఖరు బంతిని బౌండరీకి తరలించిన బట్లర్‌.. టైమల్ మిల్స్ వేసిన పదో ఓవర్లో నాలుగో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆఖరు బంతిని సంజూ శాంసన్‌ (14) బౌండరీకి తరలించాడు. దీంతో 10 ఓవర్లకు రాజస్థాన్‌ రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.


బట్లర్‌ దూకుడు..

రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (40) వేగం పెంచాడు. బాసిల్‌ తంపి వేసిన నాలుగో ఓవర్లో ఏకంగా మూడు సిక్సులు, రెండు ఫోర్లు సహా 26 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో మురుగన్‌ అశ్విన్ కట్టుదిట్టంగా బంతులేసి నాలుగే పరుగులు ఇచ్చాడు. టైమల్ మిల్స్ వేసిన ఆరో ఓవర్లో ఆఖరు బంతికి దేవ్‌దత్‌ పడిక్కల్‌ (7) రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి రాజస్థాన్‌ 48/2 స్కోరుతో నిలిచింది.


తొలి వికెట్ డౌన్‌..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్‌ కోల్పోయి 17 పరుగులు చేసింది. బుమ్రా వేసిన తొలి ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించిన జోస్‌ బట్లర్‌ (12).. డేనియల్ సామ్స్‌ వేసిన రెండో ఓవర్లో మూడో బంతిని భారీ సిక్స్‌గా మలిచాడు. బుమ్రా వేసిన మూడో ఓవర్లో నాలుగో బంతికి ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (1).. టిమ్‌ డేవిడ్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖరు బంతిని దేవ్‌ దత్‌ పడిక్కల్‌ (4) బౌండరీకి తరలించాడు.   


ముంబయి బోణీ కొట్టేనా.? రాజస్థాన్‌ జోరు కొనసాగించేనా.?

టీ20 లీగ్‌లో ఇవాళ డబుల్‌ ధమాకా వచ్చేసింది. మొదటి మ్యాచ్‌లో ముంబయి, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ప్రస్తుత సీజన్‌లోని తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవి చూసింది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో మాత్రం విఫలం కావడం ముంబయిని కలవరపెడుతోంది. బుమ్రా ఫామ్‌లోకి వచ్చి వికెట్లను తీయాలని ఆ జట్టు ఆశిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసిన రాజస్థాన్‌ సమరోత్సాహంతో ఉంది. ఆ జట్టు సారథి సంజూ శాంసన్‌ సహా దేవదత్ పడిక్కల్‌, బట్లర్‌, యశస్వీ జైస్వాల్‌, హెట్‌మయర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా ముంబయి, రాజస్థాన్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుని రాజస్థాన్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది.

జట్ల వివరాలు : 

ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్‌), అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌, తిలక్ వర్మ, కీరన్‌ పొలార్డ్, టిమ్‌ డేవిడ్, డేనియల్‌ సామ్స్, మురుగన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, టైమల్‌ మిల్స్, బాసిల్‌ థంపి

రాజస్థాన్‌: జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్‌, నవ్‌దీప్‌ సైని, ప్రసిద్ధ్ధ్‌ కృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని