Punjab vs Gujarat : శుభ్‌మన్‌ ధనాధన్.. గుజరాత్‌ హ్యాట్రిక్ విజయం..

టీ20 మెగా టోర్నీలో గుజరాత్‌ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరు బంతికి ఛేదించింది.

Updated : 08 Apr 2022 23:42 IST

ఇంటర్నెట్ డెస్క్ : టీ20 మెగా టోర్నీలో గుజరాత్‌ జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరు బంతికి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్ (96 : 59 బంతుల్లో 11×4, 1×6)అర్ధ శతకంతో రాణించాడు. సాయి సుదర్శన్‌ (35), కెప్టెన్ హార్దిక్ పాండ్య (27) పరుగులు చేశారు. ఓపెనర్ మాథ్యూ వేడ్‌ (6) నిరాశ పరిచాడు. ఆఖర్లో వచ్చిన రాహుల్ తెవాతియా (13) ఆఖరి రెండు బంతులకు రెండు సిక్సులు బాది జట్టుకి విజయాన్నందించాడు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ రెండు, రాహుల్ చాహర్ ఓ వికెట్ పడగొట్టారు.


పటిష్ట స్థితిలో గుజరాత్‌..

గుజరాత్‌ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగుతున్నారు. రాహుల్ చాహర్‌ వేసిన 11వ ఓవర్లో ఐదో బంతిని బౌండరీకి తరలించిన  శుభ్‌మన్‌ గిల్ (89).. అర్ష్‌ దీప్ సింగ్‌ వేసిన తర్వాతి ఓవర్లో మరో ఫోర్‌ కొట్టాడు. వైభవ్ అరోరా వేసిన 13వ ఓవర్లో 9 పరుగులు ఇచ్చాడు. కగిసో రబాడ వేసిన ఈ తర్వాతి ఓవర్లో మూడో బంతిని సాయి సుదర్శన్‌ బౌండరీకి తరలించాడు. రాహుల్ చాహర్‌ వేసిన 15వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన సాయి సుదర్శన్‌ (35).. మయాంక్ అగర్వాల్‌కి చిక్కి క్రీజు వీడాడు. కెప్టెన్‌ హార్దిక్ పాండ్య (1) క్రీజులోకి వచ్చాడు. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ 134/2 స్కోరుతో నిలిచింది.  గుజరాత్ విజయానికి ఇంకా 56 పరుగులు కావాల్సి ఉంది.


ధాటిగా ఆడుతున్న గుజరాత్ బ్యాటర్లు..

భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన గుజరాత్ జట్టు 10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ కోల్పోయి 94 పరుగులు చేసింది. ఓడీన్ స్మిత్ వేసిన ఎనిమిదో ఓవర్లో ఓ సిక్స్‌ బాదిన శుభ్‌మన్‌ గిల్‌ (59).. లివింగ్‌ స్టోన్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో మరో ఫోర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఓడీన్‌ స్మిత్‌ వేసిన పదో ఓవర్లో నాలుగో బంతిని సాయి సుదర్శన్ (27) బౌండరీకి తరలించాడు. విజయానికి గుజరాత్ ఇంకా 96 పరుగుల దూరంలో ఉంది.


దూకుడుగా ఆడుతున్న గుజరాత్ ఆటగాళ్లు..

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్‌ శుభమన్‌ గిల్ (39*), వన్‌డౌన్‌ బ్యాటర్‌  సాయి సుదర్శన్‌ (19*) వేగంగా ఆడుతున్నారు. వైభవ్‌ అరోరా వేసిన ఐదో ఓవర్‌, రబాడ వేసిన తర్వాతి ఓవర్‌లోనూ ఎనిమిది పరుగులు వచ్చాయి. రాహుల్ చాహర్‌ వేసిన ఏడో ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో సాయి సుదర్శన్‌ ఓ సిక్సర్‌ బాదాడు. 7 ఓవర్లకు గుజరాత్ 66/1తో ఉంది.


గుజరాత్‌కు శుభారంభం.. 

టీ20 లీగ్‌లో భాగంగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  భారీ లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్‌కు శుభారంభం దక్కింది. నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభమన్‌ గిల్ (24*) దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్ (6) ఔటయ్యాడు. రబాడ వేసిన 3.2 ఓవర్‌కు వేడ్‌.. బెయిర్‌ స్టోకి చిక్కాడు. సాయి సుదర్శన్‌ (5*)  క్రీజులో ఉన్నాడు. వైభవ్‌ అరోరా వేసిన మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన శుభమన్‌ గిల్.. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. వైభవ్‌ అరోరా వేసిన మూడో ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. తొలుత  బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి  189 పరుగులు చేసింది.


పంజాబ్‌ బ్యాటింగ్ పూర్తి.. గుజరాత్‌ లక్ష్యం ఎంతంటే?

పంజాబ్‌ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్ (64: 27 బంతుల్లో 7×4, 4×6) అర్ధ శతకంతో మెరిశాడు. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (35), జితేశ్ శర్మ (23) విలువైన పరుగులు జోడించారు. షారుఖ్‌ ఖాన్‌ (15) పరుగులు చేయగా.. కెప్టెన్‌ మయాంక్ అగర్వాల్‌ (5), జానీ బెయిర్ స్టో (8), కగిసో రబాడ (1), వైభవ్ అరోరా (2) విఫలమయ్యారు. ఓడీన్ స్మిత్ (0) డకౌటయ్యాడు. ఆఖర్లో రాహుల్ చాహర్‌ (22*) ధాటిగా ఆడాడు. అర్ష్ దీప్ సింగ్ (10*) పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు, దర్శన్ నల్కండే రెండు, లాకీ ఫెర్గూసన్‌, హార్దిక్‌ పాండ్య, మహమ్మద్‌ షమి తలో వికెట్ పడగొట్టారు.


చెలరేగుతున్న గుజరాత్ బౌలర్లు.. కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్..

గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో.. పంజాబ్ స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్ తెవాటియా వేసిన 13వ ఓవర్లో జితేశ్ శర్మ (23) రెండు సిక్సులు బాదగా.. లివింగ్‌ స్టోన్‌ ఓ సిక్స్, ఓ ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అదే ఊపులో దర్శన్‌ నల్కండే వేసిన తర్వాతి ఓవర్లో భారీ షాట్‌కి ప్రయత్నించిన జితేశ్..శుభ్‌మన్‌ గిల్‌కి చిక్కాడు. ఆ తర్వాతి బంతికే ఓడీన్‌ స్మిత్‌ (0) కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి శుభ్‌మన్‌కి చిక్కడం విశేషం. దీంతో పంజాబ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయినట్లయింది. షమి వేసిన 15వ ఓవర్లో నాలుగో బంతిని షారుఖ్‌ ఖాన్‌ (14) రెండు సిక్సులు బాదాడు. ఆఖరు బంతిని లివింగ్‌స్టోన్‌ (64) బౌండరీకి తరలించాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్‌ ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. 


ధాటిగా ఆడుతున్న లివింగ్ స్టోన్‌..

పవర్‌ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ బ్యాటర్లు వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడుతున్నారు. లాకీ ఫెర్గూసన్‌ వేసిన ఏడో ఓవర్లో ఆరు పరుగులు ఇవ్వగా.. దర్శన్ నల్కండే వేసిన ఆ తర్వాతి ఓవర్లో లివింగ్‌స్టోన్ ఓ సిక్స్ బాదాడు. రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్లో లివింగ్‌ స్టోన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఐదో బంతిని భారీ షాట్‌గా మలిచిన లివింగ్‌ స్టోన్.. బౌండరీ లైన్‌ వద్ద ఉన్న హార్దిక్ పాండ్య అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. అయితే, బంతిని అందుకునే క్రమంలో హర్దిక్ బౌండరీ లైన్‌కి కాలు తగలడంతో అతడు బతికిపోయాడు. జీవనదానాన్ని సద్వినియోగం చేసుకున్న లివింగ్ స్టోన్ (36).. దర్శన్ నల్కండే వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన 11వ ఓవర్లో తొలి బంతికి శిఖర్‌ ధావన్‌ (35) కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. దీంతో 10.1 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్‌ 86/3 స్కోరుతో నిలిచింది.  


పవర్‌ ప్లే పూర్తి.. పంజాబ్ స్కోరెంతంటే.?

పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి పంజాబ్ జట్టు 43/2 స్కోరుతో నిలిచింది. హర్దిక్ పాండ్య వేసిన నాలుగో ఓవర్లో ఆఖరు బంతిని బౌండరీకి తరలించిన జానీ బెయిర్ స్టో (8).. లాకీ ఫెర్గూసన్‌ వేసిన తర్వాతి ఓవర్లో ఐదో బంతికి రాహుల్ తెవాటియాకు చిక్కి క్రీజు వీడాడు. ఆఖరు బంతికి లియామ్ లివింగ్‌స్టోన్‌ (5) ఫోర్‌ కొట్టాడు. ఇదే ఓవర్లో అంతకు ముందు ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (24) మరో రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే 13 పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్లో రషీద్ ఖాన్ ఐదు పరుగులు ఇచ్చాడు. 


కట్టుదిట్టంగా గుజరాత్ బౌలింగ్‌.. పంజాబ్ కెప్టెన్‌ ఔట్‌..

టాస్‌ ఓడిన పంజాబ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ ఒక వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసింది. మహమ్మద్‌ షమి వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతిని బౌండరీకి తరలించిన పంజాబ్ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్ (5).. హార్దిక్ పాండ్య వేసిన రెండో ఓవర్లో ఆఖరు బంతికి రషీద్‌ ఖాన్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. షమి వేసిన మూడో ఓవర్లో తొలి బంతిని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (10) బౌండరీకి తరలింగా.. నాలుగో బంతికి జానీ బెయిర్ స్టో (4) ఫోర్‌ కొట్టాడు.  


టాస్ నెగ్గిన గుజరాత్‌ కెప్టెన్‌.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన హార్దిక్‌.!

టీ20 మెగా టోర్నీలో మరో ఆసక్తికర మ్యాచ్‌కు వేళయింది. గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య పోరు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్‌ ఎంచుకున్నాడు. పంజాబ్‌కు  బ్యాటింగ్‌ అప్పగించాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు గుజరాత్‌ జట్టు ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు. ఆడిన రెండింట్లోనూ గెలుపొందింది. మరోవైపు, పంజాబ్ జట్టు మూడింట్లో రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. ముంబయిలోని బ్రాబౌర్న్ మైదానం వేదికగా జరుగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు ఆదిపత్యం చెలాయిస్తుందో చూడాలి.!

తుది జట్ల వివరాలు..

పంజాబ్‌ : మయాంక్‌ అగర్వాల్ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో, లియామ్ లివింగ్‌స్టోన్‌, జితేశ్ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, ఓడీన్ స్మిత్‌, కగిసో రబాడ, రాహుల్ చాహర్‌, వైభవ్‌ అరోరా, అర్ష్‌దీప్ సింగ్‌

గుజరాత్‌ : మాథ్యూ వేడ్‌, శుభ్‌మన్‌ గిల్,  సాయి సుదర్శన్, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్‌ ఖాన్‌, లాకీ ఫెర్గూసన్‌, మహమ్మద్‌ షమి, దర్శన్‌ నల్కండే
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని