5స్టార్‌ కెప్టెన్‌..రాహుల్‌ రైడ్‌.. బౌల్ట్‌ బుల్లెట్స్‌.. 4 సూపర్స్‌

ఐపీఎల్‌-2020కి అదిరే ముగింపు. కరోనా దెబ్బకు జరుగుతుందో లేదోనన్న పొట్టి క్రికెట్‌ వేడుక అంచనాలను మించి అలరించింది. కళ తప్పిన ఖాళీ స్టేడియాల ప్రభావాన్ని అధిగమించి అభిమానులను ఉత్కంఠతో ఊపేసింది.  ఒక్కొక్కరిని మునివేళ్లపై నిలబెట్టింది. నమ్మశక్యం కాని ప్రత్యేకతలను చాటుకుంది...

Updated : 11 Nov 2020 15:33 IST

ఈ ఐపీఎల్‌ విశేషాలు ఇంకేం ఉన్నాయంటే

ఐపీఎల్‌-2020కి అదిరే ముగింపు. కరోనా దెబ్బకు జరుగుతుందో లేదోనన్న పొట్టి క్రికెట్‌ వేడుక అంచనాలను మించి అలరించింది. కళ తప్పిన ఖాళీ స్టేడియాల ప్రభావాన్ని అధిగమించి అభిమానులను ఉత్కంఠతో ఊపేసింది.  ఒక్కొక్కరిని మునివేళ్లపై నిలబెట్టింది. నమ్మశక్యం కాని ప్రత్యేకతలను చాటుకుంది. ధోనీసేన ప్లేఆఫ్స్‌ చేరుకోలేదు. ఆఖరి మ్యాచుకు గానీ నాకౌట్స్‌కు చేరే నాలుగో జట్టేదో తేలలేదు. 224 లక్ష్యం సరిపోలేదు. ఒక మ్యాచులోనైతే రెండో సూపర్‌ ఓవర్లో గానీ ఫలితం తేల్లేదు. ఈ సీజన్‌లో ఇలాంటి అద్భుతాలు మరెన్నో..


‘0’ కరోనా కేసులు

కరోనా వైరస్‌ వల్ల అంతర్జాతీయ క్రీడలు కళ తప్పాయి. కానీ క్రికెట్‌ మాత్రం అభిమానులను అలరించింది. ముందుగా బయో బుడగలో ఇంగ్లాండ్‌ ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహిస్తే బీసీసీఐ ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పొట్టి క్రికెట్‌ లీగ్‌ను సుసాధ్యం చేసింది. దుబాయ్‌కు చేరుకొనేముందు క్వారంటైన్‌.. వచ్చాకా క్వారంటైన్‌.. చెన్నై ఆటగాళ్లలో వైరస్‌ కలకలం.. అనుమానాలెన్నో కలిగినా దాదాపు 500+ మందితో బయో బుడగలో ఐపీఎల్‌ను విజయవంతం చేసింది. టోర్నీ ఆరంభం తర్వాత ఒక్క కరోనా కేసు రానీకుండా అంచనాలను మించే అలరించింది.


5 స్టార్‌ కెప్టెన్‌.. 5 స్టార్‌ జట్టు

డిఫెండింగ్‌‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి.. లీగుకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. IPLను Miplగా మార్చేసింది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ నాయకత్వంలో వరుసగా రెండోసారి.. ఏకంగా ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. పొట్టి క్రికెట్‌ ఆడటంలో తమను మించిన వారే లేరని చాటిచెప్పింది. గతంలో కేవలం చెన్నై మాత్రమే వరుసగా రెండుసార్లు.. మొత్తంగా మూడుసార్లు టైటిల్‌ అందుకోవడం గమనార్హం. 13 సీజన్లలో 5సార్లు విజేతగా నిలవడమంటే మాటలు కాదు. అందుకే రోహిత్‌ 5స్టార్‌ కెప్టెన్‌గా అవతరించాడు.


ధోనీసేన ప్చ్‌!

ముంబయి తర్వాత లీగులో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై. 2010, 2011, 2018లో ఆ జట్టు విజేతగా అవతరించింది. ఇండియన్‌ టీ20 లీగులో ఏటా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ధోనీసేనకు ఒక అలవాటు. అలాంటిది 13 సీజన్లలో తొలిసారి ఆ జట్టు నాకౌట్స్‌ చేరుకోలేదు. ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన ఆ బృందానికి మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరుపడ్డ సురేశ్‌ రైనా, హర్భజన్‌ షాకిచ్చారు. సాధన చేయకుండా కరోనా అడ్డుపడింది. జట్టు కూర్పు కుదరక వరుస ఓటములు వెంటాడాయి. అందరికన్నా ముందుగా ప్లేఆఫ్స్‌ నుంచి తప్పుకుంది. ఆఖరి 3 మ్యాచుల్లో అదరగొట్టి  మొత్తంగా 12 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది.


పాపం.. నయా దిల్లీ

పాపం! దిల్లీ జట్టు కొత్తగా మారినప్పటికీ అదృష్టం కలిసిరావడం లేదు. గతంలో ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించేది. కానీ గత రెండు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు వచ్చి బోల్తా పడుతోంది. పెద్ద మ్యాచుల్లో ఒత్తిడి భరించలేక టైటిల్‌కు దూరమవుతోంది. ముంబయి మ్యాచులో మరో 30 పరుగులు చేస్తే ట్రోఫీని ముద్దాడేదేమో! కానీ అలా చేయలేదు. ఇక ‘ఈ సాలా కప్‌ నమదే’ నినాదంతో వచ్చే కోహ్లీసేన ఎలిమినేటర్‌ పోరులో వెనుదిరిగి మరోసారి అప్రతిష్ఠ పాలైంది. పంజాబ్‌ దురదృష్టాన్ని కెప్టెన్‌  కేఎల్‌ రాహుల్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే, బ్యాటింగ్‌ కోచ్‌ వసీమ్‌ జాఫర్‌ సైతం మార్చలేకపోయారు. అయితే 5 ఓటముల తర్వాత వరుసగా 5 విజయాలతో ఆ జట్టు ఆశలు రేపింది. వచ్చే సీజన్‌పై అంచనాలు పెంచింది.


మజా.. మజా సూపర్‌ ఓవర్లు

టీ20 క్రికెట్లో సూపర్‌ ఓవర్లు ఎంత మజా ఇస్తాయో తెలిసిన సంగతే. ఈసారి అవి సీజన్‌ మొత్తాన్నీ రక్తికట్టించాయి. 2020 మొదలైన రెండో రోజే పంజాబ్‌పై దిల్లీ సూపర్‌ ఓవర్లో గెలిచి క్రేజ్‌ పెంచేసింది. ఇప్పటి వరకు 13 ఏళ్లలో 12 సూపర్‌ ఓవర్లు పడితే ఈ ఒక్క సీజన్లోనే ఏకంగా 4 జరిగాయి. అందులో ముంబయి, పంజాబ్‌ రెండు సార్లు ఆడటం విశేషం. ఇక నవంబర్‌ 18 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే అదే రోజు రెండు మ్యాచులు సూపర్‌ ఓవర్లకు దారితీశాయి. మొదట కోల్‌కతా×హైదరాబాద్ తలపడగా కోల్‌కతా గెలిచింది. ఇక పంజాబ్‌ × ముంబయి మ్యాచులో తొలి సూపర్‌ ఓవర్‌ టై కావడంతో రెండో సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. చివరకు పంజాబ్‌ నెగ్గింది.


ఆఖరి మ్యాచ్‌ వరకు

సాధారణంగా ప్లేఆఫ్స్‌కు ఎవరెవరు వెళ్తారో వారం రోజుల ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. కానీ ఆఖరి మ్యాచ్‌ వరకు తేలకపోవడం బహుశా ఇదే తొలిసారి. 16 పాయింట్లతో తొలుత ముంబయి బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌ గెలిచి 18 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఇక 14 పాయింట్లతో సమంగా ఉన్న దిల్లీ, బెంగళూరు ఆఖర్లో వరుస మ్యాచుల్లో ఓటమిపాలై భంగపడ్డాయి. అయితే ఈ రెండు జట్లు తలపడ్డ చివరి మ్యాచులో దిల్లీ గెలిచి 16 పాయింట్లతో రెండో స్ధానానికి చేరుకుంది. అయితే దిల్లీ ఛేదన 17 ఓవర్లు దాటడంతో బెంగళూరు నాకౌట్‌కు అర్హత సాధించింది. లేదంటే కోల్‌కతా ముందడుగు వేసేది. ఇక లీగ్‌ ఆఖరి మ్యాచులో ముంబయిని హైదరాబాద్‌ ఓడించి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం గమనార్హం.


రాహుల్‌ కేక

ఈ ఏడాది కేఎల్‌ రాహుల్ ప్రత్యేకంగా నిలిచాడు. సారథిగా ఎత్తుపల్లాలు చవిచూశాడు. బెంగళూరుపై 69 బంతుల్లో 132* పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 14 మ్యాచుల్లో 670 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. సగటు 55.83, స్ట్రైక్‌రేట్‌ 129.34. పంజాబ్‌ తరఫున వరుస సీజన్లలో 500+ పరుగులతో అలరిస్తున్నాడు. ఇక కీపర్‌గానూ రాణిస్తున్నాడు. అదే జట్టుకు చెందిన మాక్స్‌వెల్‌ అన్ని మ్యాచులూ ఆడి ఒక్క సిక్సరూ కొట్టలేదు.


ఆరుగురు 500+

ప్రస్తుత సీజన్‌లో ఆరుగురు 500+ స్కోరు చేశారు. దిల్లీ, ముంబయి నుంచి ఇద్దరిద్దరు ఉన్నారు. రాహుల్‌ (670; 14 మ్యాచుల్లో), శిఖర్‌ ధావన్‌ (618; 17 మ్యాచుల్లో), డేవిడ్‌ వార్నర్‌ (548; 16 మ్యాచుల్లో), శ్రేయస్‌ అయ్యర్‌ (519; 17 మ్యాచుల్లో), ఇషాన్‌ కిషన్‌ (516; 14 మ్యాచుల్లో), క్వింటన్‌ డికాక్‌ (503; 16 మ్యాచుల్లో) అదరగొట్టారు. శిఖర్‌ ధావన్‌ రెండు శతకాలు బాదగా రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, బెన్‌స్టోక్స్‌ తలో శతకం సాధించారు. ఇషాన్‌ కిషన్‌ అత్యధికంగా 30 సిక్సర్లు దంచేశాడు. సంజు (26), హార్దిక్ ‌(25), నికోలస్‌ పూరన్‌ (25) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఒకే ఇన్నింగ్స్‌ ఎక్కువ సిక్సర్లు (9) బాదిన వారు కిషన్‌, సంజు. ఇక పూరన్‌ (106 మీటర్లు), జోఫ్రా (105 మీటర్లు), సంజు (102 మీటర్లు) సుదూర సిక్సర్లు బాదేశారు. రాహుల్‌, దేవదత్‌ పడిక్కల్‌, ఏబీ డివిలియర్స్‌ తలో ఐదు అర్ధశతకాలతో దుమ్మురేపారు. ఈ సీజన్‌లో కీరన్‌ పొలార్డ్‌ (191.42) స్ట్రైక్‌రేట్‌ను తలదన్నేవారెవరూ లేరు. ఆర్చర్‌ (179.36), హార్దిక్‌ (179.98), జడ్డూ (171.85) అతడి తర్వాతే ఉన్నారు.


దెబ్బకొట్టిన బౌల్ట్‌

బౌలర్లూ ఈ సీజన్లో ఆకట్టుకున్నారు. కాగిసో రబాడా (30 వికెట్లు) పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా (27), బౌల్ట్‌ (25), అన్రిచ్‌ నార్జ్‌ (22), యుజ్వేంద్ర చాహల్‌ (21) టాప్‌-5 వికెట్ల వీరుల జాబితాలో నిలిచారు. ఇందులో ఏకైక స్పిన్నర్‌ యూజీ మాత్రమే. ఈ సీజన్లో 20 మెయిడిన్‌ ఓవర్లు విసరగా అందులో మూడు బౌల్ట్‌వి. బుమ్రా, దీపక్‌ చాహర్‌, శివిమ్‌ మావి, మహ్మద్‌ సిరాజ్‌ తలో రెండు వేశారు. ఇక ఎక్కువ డాట్‌ బాల్స్‌ విసిరింది ఆర్చర్‌ (175), బుమ్రా (175), రషీద్‌ ఖాన్‌ (168). బౌలింగ్‌ సగటులో బుమ్రా (14.96), జేసన్‌ హోల్డర్‌ (16.64) అదరగొట్టారు. ఎకానమీ పరంగా రషీద్‌ (5.37) అందరికన్నా ముందున్నాడు. కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్ చక్రవర్తి (5/20) అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. అన్రిచ్‌ నార్జ్‌ (156.22 కి.మీ) అత్యధిక వేగవంతమైన బంతి వేశాడు. 2020లో ఏ బౌలర్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీయలేకపోయారు.


పరుగుల వరద

ఈ సీజన్లోనూ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించారు. మొత్తం 19,352 పరుగులు సాధించారు. అందులో 10,732 బౌండరీల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం. ఆటగాళ్లు ఏకంగా 734 సిక్సర్లు దంచేశారు. 5 శతకాలు, 110 అర్ధశతకాలు నమోదయ్యాయి.  ఇక బౌలర్లు 668 వికెట్లు పడగొట్టడం విశేషమైతే 4,868 డాట్‌బాల్స్‌ విసరడం గమనార్హం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 సూపర్‌ ఓవర్లు పడ్డాయి. ఇక 2 మ్యాచుల్లో ఆఖరి బంతికి ఫలితం తేలింది. బెంగళూరు (109)పై పంజాబ్‌ (206/3) 97 పరుగులు, పంజాబ్‌ (178/4)పై చెన్నై (181/0) వికెట్ల పరంగా అతిపెద్ద విజయాలు నమోదు చేశాయి.


వికెట్లు  ఎగిరాయి

2020లో 668 వికెట్లు పడితే అందులో 427 పేసర్లకు దక్కాయి. స్పిన్నర్లకు 198 వచ్చాయి. సగటున 21 బంతులకు ఓ వికెట్‌ లభించింది. ఇక పరుగుల పరంగా చెప్పాలంటే 28.97 పరుగులకు ఓ వికెట్‌ పడింది. 444 మంది క్యాచుల ద్వారా పెవిలియన్‌ చేరారు. 32 మంది వికెట్లు ముందు దొరికిపోయారు. 10 మంది స్టంపౌట్‌ అయ్యారు. 122 మంది క్లీన్‌బౌల్ట్‌ కావడం గమనార్హం. 43 రనౌట్లు కాగా 15 మంది బౌలర్‌కే క్యాచ్‌ ఇవ్వడం విశేషం.


ప్రయోజనం ‘0’

ఈ సారి ఏ జట్టుకూ సొంత మైదానం ప్రయోజనం కలగలేదు. భారత్‌లోనైతే ఆయా ఫ్రాంచైజీలు తమకు అనుకూలంగా పిచ్‌లను రూపొందించాలని క్యూరేటర్లను కోరేవి. యూఏఈలో అలాంటి అవకాశం దొరకలేదు. తటస్త వేదికలు కావడంతో బాగా పోరాడిన జట్లే విజయం అందుకున్నాయి. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ వరకూ ప్లేఆఫ్స్‌పై ఏమీ తెలియకపోవడానికి ఇదే కారణం. కోహ్లీ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పాడు. ఇక 45 రోజులు తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించిన యూఏఈ పిచ్‌లు చివరి 10 రోజులు ఛేదనకు ప్రయోజనం చేకూర్చాయి. ఉష్ణోగ్రత కనీసం 6 డిగ్రీలు తగ్గడమే ఇందుకు కారణం.‌


224 ఉఫ్‌

టీ20ల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే ఈ సీజన్‌ ముందు వరకు 215 పరుగుల లక్ష్య ఛేదనే గొప్ప. అలాంటిది పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ సునాయసంగా ఛేదించింది. ఈ మ్యాచుతోనే రాహుల్‌ తెవాతియాలో ఓ గొప్ప ఫినిషర్‌ ఉన్నాడని తెలిసింది. అతడు ఒకే ఓవర్లో 5 సిక్సర్లతో కనువిందు చేశాడు. ఇక ఈ సీజన్‌లో ఫామ్‌లోని లేని ధోనీ కొట్టిన 102 మీటర్ల సిక్సరూ హిట్టైంది. ఇక నికోలస్‌ పూరన్‌ ఫీల్డింగ్‌ విన్యాసాలు, దినేశ్‌ కార్తీక్‌ స్టన్నర్‌, జోఫ్రా ఆర్చర్‌ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్‌, పొలార్డ్‌ గాల్లోకి ఎగిరి అందుకున్న క్యాచ్‌, ఫైనల్లో దిల్లీ, ముంబయి కెప్టెన్ల అర్ధశతకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి

ముంబయిలో నేనుంటా.. ముంబయికి తోడుంటా..
సూర్యకుమార్‌ కోసం వికెట్‌ వదులు కోవాల్సింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని