T20 League: గుజరాత్ జట్టు గెలవడానికి కారణం అదే: సునీల్ గావస్కర్

టీ20 లీగ్‌లో అదరగొడుతున్న గుజరాత్ జట్టుపై భారత మాజీ కెప్టెన్‌ సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్‌ తొలి 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి దిగ్విజయంగా ముందుకు సాగింది.

Published : 10 May 2022 18:22 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌లో అదరగొడుతున్న గుజరాత్ జట్టుపై భారత మాజీ కెప్టెన్‌ సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్‌ తొలి 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి దిగ్విజయంగా ముందుకు సాగింది. కానీ, తన చివరి  రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అయినా, గుజరాత్‌ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఆ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిల్లో ఏ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించిన ఆ జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ జట్టు ఆటతీరుపై సునీల్ గావస్కర్‌ మాట్లాడాడు. గుజరాత్ ఆటగాళ్లు భయం లేకుండా ఆడుతున్నారని ఆయన అన్నారు.   

‘గుజరాత్ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. ఎందుకంటే వాళ్లు స్వేచ్ఛగా, భయం అనేది లేకుండా ఆడుతున్నారు. ఫలితం గురించి కూడా పెద్దగా ఆలోచించడం లేదు. తమ ఆట గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అనే భయం వారిలో లేదు. అందుకే ఆ జట్టు విజయాలు సాధిస్తోంది. గుజరాత్ ఆటగాళ్లు తమ ఆటను ఆస్వాదిస్తూ పాజిటివ్‌ క్రికెట్ ఆడుతున్నారు ’ అని సునీల్ గావస్కర్ వివరించారు. ఇదిలా ఉండగా.. నేడు లఖ్‌నవూ, గుజరాత్‌ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు.. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది.

మరోవైపు.. హార్దిక్ పాండ్య నాయకత్వం వహిస్తున్న గుజరాత్ జట్టుకు భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్‌ మద్దతు పలికాడు. ‘గుజరాత్‌ జట్టు చాలా బలంగా ఉంది. రషీద్‌ఖాన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. లఖ్‌నవూతో జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌ గెలుపొంది ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. ఈ జట్టుని ఓడించడం కష్టం’ అని హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని