Updated : 30 May 2022 08:18 IST

T20 League : వచ్చారు.. పట్టుకుపోయారు

అరంగేట్ర సీజన్లోనే గుజరాత్‌ అదరహో
ఫైనల్లో రాజస్థాన్‌పై ఘనవిజయం
హార్దిక్‌ ఆల్‌రౌండ్‌ షో
టీ20 లీగ్‌ ట్రోఫీ కైవసం

15 ఏళ్ల కిందట టీ20 లీగ్‌ మొదలైనప్పటి నుంచి టైటిల్‌ కోసం పోరాడుతూనే ఉన్నాయి కొన్ని జట్లు. కానీ ఇలా లీగ్‌లో అరంగేట్రం చేసిందో లేదో అలా కప్పు కొట్టేసింది గుజరాత్‌. తొలిసారి జట్టుగా ఏర్పడ్డ ఆటగాళ్లతో, పెద్దగా స్టార్లు కూడా లేకుండా, అతి తక్కువ అంచనాలతో లీగ్‌లో అడుగు పెట్టి.. మరే జట్టుకూ సాధ్యం కాని సమష్టితత్వంతో, నిలకడతో, అసాధారణ పోరాటంతో ఫైనల్‌కు దూసుకొచ్చిన గుజరాత్‌.. తుది సమరంలో రాజస్థాన్‌కు అవకాశమే ఇవ్వలేదు. బంతితో, బ్యాటుతో అదరగొట్టి కప్పును ఎగరేసుకుపోయింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సగర్వంగా కప్పును అందుకున్నాడు.

అహ్మదాబాద్‌

అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్‌లో స్థానం.. లీగ్‌ దశలో పది విజయాలతో నంబర్‌వన్‌.. తొలి క్వాలిఫయర్లో గెలుపుతో నేరుగా ఫైనల్‌ బెర్తు.. ఈ టీ20 లీగ్‌లో అత్యుత్తమ జట్టు గుజరాత్‌ టైటాన్సే అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి. ఆ అత్యుత్తమ జట్టునే టీ20 లీగ్‌ ట్రోఫీ వరించింది. అరంగేట్ర సీజన్లోనే అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్‌ సేన.. ఫైనల్లోనూ తిరుగులేని ఆటతో కప్పును సొంతం చేసుకుంది. ఆదివారం ఆ జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను మట్టికరిపించింది. మొదట హార్దిక్‌ పాండ్య (3/17), సాయికిశోర్‌ (2/20)లతో పాటు మిగతా బౌలర్లూ సత్తా చాటడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 130/9కు పరిమితం అయింది. బట్లర్‌ (39; 35 బంతుల్లో 5×4) టాప్‌స్కోరర్‌. అనంతరం గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్‌ (45 నాటౌట్‌; 43 బంతుల్లో 3×4, 1×6), హార్దిక్‌ పాండ్య (34; 30 బంతుల్లో 3×4, 1×6), మిల్లర్‌ (32 నాటౌట్‌; 19 బంతుల్లో 3×4, 1×6) తలో చేయి వేసి జట్టును గెలిపించారు. బంతితో, బ్యాటుతో సత్తా చాటిన హార్దిక్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. టీ20 లీగ్‌ తొలి సీజన్లోనే ఫైనల్‌ చేరి కప్పు గెలిచిన రాజస్థాన్‌.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తుది పోరుకు అర్హత సాధించినా విజేతగా మాత్రం నిలవలేకపోయింది.

అంత తేలిగ్గా ఏం కాదు..: పడ్డ వికెట్లు మూడే. ఇంకో 11 బంతులుండగానే మ్యాచ్‌ గెలిచింది. కాబట్టి గుజరాత్‌ సులువుగా గెలిచేసిందనుకుంటే పొరబాటే. 131 పరుగుల చిన్న లక్ష్యమే అయినా.. ఆ జట్టు ఛేదన తేలిగ్గా ఏమీ సాగలేదు. ఇన్నింగ్స్‌ చాలా నెమ్మదిగా మొదలు కాగా.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న సాహా (5)ను రెండో ఓవర్లోనే ప్రసిద్ధ్‌ బౌల్డ్‌ చేశాడు. కాసేపటికే వేడ్‌ (8)ను బౌల్ట్‌ పెవిలియన్‌ చేర్చాడు. 8 ఓవర్లకు గుజరాత్‌ స్కోరు 38 (2 వికెట్లకు) మాత్రమే. నిజానికి బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో శుభ్‌మన్‌ క్యాచ్‌ను చాహల్‌ వదిలేయకుంటే.. గుజరాత్‌ పరిస్థితి ఇంకా కష్టంగా ఉండేదే. ఆ తప్పిదానికి రాజస్థాన్‌ భారీ మూల్యమే చెల్లించుకుంది. చిన్న లక్ష్యాలున్నపుడు క్రీజులో పాతుకుపోయి జట్టును గెలిపించే అలవాటున్న గిల్‌.. ఫైనల్లోనూ అదే చేశాడు. ఎక్కువ బంతులాడినా ఇబ్బంది లేని లక్ష్యం కావడంతో ఓపిక పట్టాడు. కుదురుకున్నాక సమయోచితంగా షాట్లు ఆడాడు. హార్దిక్‌ కూడా కాసేపు ఆచితూచి ఆడి తర్వాత షాట్లకు దిగాడు. ఈ జోడీ చూస్తుండగానే మ్యాచ్‌ను రాజస్థాన్‌ నుంచి లాక్కెళ్లిపోయింది. 41 బంతుల్లో 45 పరుగులే చేయాల్సిన స్థితిలో హార్దిక్‌ ఔటైనా.. గుజరాత్‌కు ఇబ్బందే లేకపోయింది. టీ20 లీగ్‌ కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న మిల్లర్‌.. మరోసారి ఫినిషర్‌ పాత్రను పోషించి ఛేదనను మరింత వేగవంతం చేశాడు. 12 బంతుల్లో 4 పరుగులే అవసరమైన స్థితిలో గిల్‌ సిక్సర్‌ బాది గుజరాత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు.

బ్యాటింగ్‌ ఎంచుకుని.. బోల్తా కొట్టి..: ఈ సీజన్లో మెజారిటీ జట్లు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నవే. దానికి భిన్నంగా రాజస్థాన్‌ కెప్టెన్‌ ఫైనల్లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. తాము టాస్‌ నెగ్గితే బౌలింగే తీసుకునేవాళ్లమంటూ సంతోషం వెలిబుచ్చాడు గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య. అతను పిచ్‌ను సరిగ్గా అంచనా వేశాడని, మొదట బౌలింగ్‌ చేయడమే సరైందని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. బౌలింగ్‌ దాడిని ముందుండి నడిపిస్తూ హార్దిక్‌ బంతితో విజృంభించడంతో రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ఆద్యంతం ఒడుదొడుకులతో సాగింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ బట్లర్‌ 12 ఓవర్లకు పైగా క్రీజులో ఉన్నా చేసింది 39 పరుగులే. అందుకోసం అతను 35 బంతులాడేశాడు. ఇన్నింగ్స్‌ మొత్తంలో కాస్త ధాటిగా ఆడింది ఒక్క యశస్వి (22; 16 బంతుల్లో 1×4, 2×6) మాత్రమే. కానీ మంచి ఊపులో ఉన్న అతను.. యశ్‌ దయాళ్‌ బౌలింగ్‌లో పేలవ షాట్‌ ఆడి వెనుదిరిగాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఊపే లేదు. శాంసన్‌ (14) ఇన్నింగ్స్‌ ఆశాజనకంగానే మొదలైంది కానీ.. ఈ మ్యాచ్‌తో మళ్లీ పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ అతడిని ఔట్‌ చేసి రాజస్థాన్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఇక్కడి నుంచి ఏ దశలోనూ వికెట్ల పతనం ఆగలేదు. పడిక్కల్‌ (2) ఇలా వచ్చి అలా వెళ్లగా.. నిలదొక్కుకున్నాక చెలరేగుతాడనుకున్న బట్లర్‌తో పాటు హెట్‌మయర్‌ (11)ను ఔట్‌ చేసిన హార్దిక్‌.. రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అశ్విన్‌ (6) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. పరాగ్‌ (15), బౌల్ట్‌ (11), మెకాయ్‌ (8) పోరాడడంతో రాజస్థాన్‌ కాస్త గౌరవప్రదంగా ఇన్నింగ్స్‌ను ముగించింది.


ప్రైజ్‌మనీ

విజేత: రూ.20 కోట్లు (గుజరాత్‌)

రన్నరప్‌: రూ.13 కోట్లు (రాజస్థాన్‌)

మూడో స్థానం: రూ.7 కోట్లు (బెంగళూరు)

నాలుగో స్థానం: 6.5 కోట్లు  (లఖ్‌నవూ)


అత్యధిక పరుగులు: రూ.15 లక్షలు (బట్లర్‌, 863 పరుగులు, రాజస్థాన్‌)


అత్యధిక వికెట్లు: రూ.15 లక్షలు (చాహల్‌, 27 వికెట్లు, రాజస్థాన్‌)


ఈ సీజన్లో గుజరాత్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ ఓటమి చవిచూసింది. లీగ్‌ దశలో, తర్వాత తొలి క్వాలిఫయర్లో పరాజయం చవిచూసిన రాజస్థాన్‌కు.. ఇప్పుడు ఫైనల్లోనూ ఓటమి తప్పలేదు.


1,04,859

 టీ20 లీగ్‌ ఫైనల్‌ వీక్షించేందుకు అహ్మదాబాద్‌ స్టేడియానికి వచ్చిన అభిమానులు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక మంది అభిమానులు హాజరైన మ్యాచ్‌ ఇదే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని