Playoffs 2022: తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌తో తలపడేదెవరు?

గుజరాత్‌తో తొలి క్వాలిఫయర్‌తో తలపడే జట్టు ఏది అవ్వొచ్చో ఓసారి చూద్దాం!

Published : 18 May 2022 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం:  భారత టీ20 లీగ్‌ చివరి దశకు చేరింది. దీంతో ఒక్కో మ్యాచ్‌ ఆసక్తిగా సాగుతోంది. ప్లే ఆఫ్స్‌కు చేరే ఆ 3 జట్లు ఏవీ అనే విషయంలో ఇంకా లెక్క తేలలేదు. తొలి స్థానం గుజరాత్‌కి పక్కా అనేది అందరికీ తెలిసిందే. మరి ఆ గుజరాత్‌తో తొలి క్వాలిఫయర్‌తో తలపడే జట్టు ఏది అవ్వొచ్చో ఓసారి చూద్దాం!

పాయింట్ల పట్టికలో గుజరాత్ 20 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఆ జట్టు ఇంకా బెంగళూరుతో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అదీ గెలిస్తే మొత్తం 22 పాయింట్లతో లీగ్‌ స్టేజ్‌ను దిగ్విజయంగా పూర్తి చేయనుంది. ఒకవేళ ఓడినా తొలి స్థానానికి ఢోకా లేదు. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌, లఖ్‌నవూ చెరో 16 పాయింట్లతో ఉన్నాయి. ఆ రెండు జట్లూ తమ చివరి మ్యాచ్‌ల్లో నెగ్గినా 18 పాయింట్లతోనే సరిపెట్టుకుంటాయి. 

ఒకవేళ ఓడితే 16 పాయింట్లతో మూడు లేదా నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంటాయి. ప్రస్తుతం నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న దిల్లీ, బెంగళూరు 14 పాయింట్లతో ఉన్నాయి. అవి తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే రాజస్థాన్‌, లఖ్‌నవూతో సమానంగా 16 పాయింట్లతో ఉంటాయి. అలాంటప్పుడు రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న జట్లే రెండు, మూడు, నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటాయి.

రాజస్థాన్‌: ఇప్పుడు రాజస్థాన్‌ 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. లఖ్‌నవూ కన్నా కాస్త మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉండటం సంజూ శాంసన్‌ సేనకు ఊరటనిచ్చే విషయం. అయితే, రాజస్థాన్‌ శుక్రవారం చెన్నైతో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది. చెన్నై ఎలాగూ బలహీనంగా ఉండటంతో ఆ మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిస్తే 18 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. అప్పుడు గుజరాత్‌తో తొలి క్వాలిఫయర్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. అయితే, ఇక్కడ లఖ్‌నవూ తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది.

లఖ్‌నవూ: పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది లఖ్‌నవూ. ఈ రోజు కోల్‌కతాతో చివరి మ్యాచ్‌లో పోటీ పడాల్సి ఉంది. ఇప్పటికే 16 పాయింట్లతో ఉన్న రాహుల్‌ టీమ్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే 18 పాయింట్లు సాధించి రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఓడిపోతే 16 పాయింట్లతోనే నిలిచి... మూడు లేదా నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంటుంది. అది ఇతర జట్లతో సమానంగా నిలిస్తే రన్‌రేట్‌ను బట్టి స్థానం ఉంటుంది.

దిల్లీ: దిల్లీ వరుసగా గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అనూహ్యంగా ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పుడు ఈ జట్టు తమ చివరి మ్యాచ్‌లో శనివారం ముంబయితో ఆడాల్సి ఉంది. రోహిత్‌ సేన పేలవ ఫామ్‌లో ఉండటంతో దిల్లీ మంచి రన్‌రేట్‌తో గెలిస్తే నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుతం రెండు, మూడులో ఉన్న రాజస్థాన్‌, లఖ్‌నవూ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడితే.. అప్పుడు దిల్లీ ఏకంగా రెండో స్థానాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.

గమనిక: ఇవి అంచనాలు మాత్రమే. ప్లే ఆఫ్స్‌ జట్ల విషయంలో రన్‌రేట్‌ కీలకం కాబట్టి. స్థానాలు ఎటైనా మారొచ్చు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని