Updated : 07 Jul 2022 07:07 IST

IND vs ENG : ధనాధన్‌ వేళాయె..

ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి టీ20 నేడు
రాత్రి 10.30 నుంచి

ఇలా టెస్టు మ్యాచ్‌ అయిందో లేదో అలా టీ20 సిరీస్‌ వచ్చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి సమరం నేడే. ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు చాలా ప్రాధాన్యమే ఏర్పడింది. ప్రయోగాలను పక్కన పెట్టి మెగా టోర్నీకి అత్యుత్తమ ఎలెవన్‌ను గుర్తించడమే లక్ష్యంగా టీమ్‌ఇండియా సమరానికి సన్నద్ధమైంది. జట్టు నిండా హిట్టర్లతో బాదుడును మరో స్థాయికి తీసుకెళ్లిన ఇంగ్లాండ్‌ను నిలువరించడం సవాలే. ఈ సిరీస్‌తో జోస్‌ బట్లర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ మొదలు కానుంది.

సౌథాంప్టన్‌

ఇక ధనాధన్‌ ఆట. పరుగుల మోత. గురువారం జరిగే తొలి టీ20లో టీమ్‌ఇండియా.. ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. టెస్టు పరాజయాన్ని మరిచిపోయి తిరిగి చెలరేగాలనుకుంటున్న భారత్‌.. దూకుడుగా ఆడే ఆతిథ్య జట్టుకు మధ్య ఆసక్తికర సమరం ఖాయం. ప్రపంచకప్‌ తుది జట్టుపై అంచనాకు రావడానికి భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ సిరీస్‌ను ఉపయోగించుకోనుంది. కరోనా కారణంగా టెస్టు మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టులోకి వచ్చాడు. కోహ్లి, బుమ్రా, జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌ మాత్రం రెండో టీ20 నుంచి ఆడతారు. అయినా.. రుతురాజ్‌, సంజు శాంసన్‌ పెవిలియన్‌కు పరిమితం కాక తప్పదు. ఇషాన్‌ కిషన్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. ఇప్పటివరకు వచ్చిన అవకాశాల్లో ఇషాన్‌ ఫర్వాలేదనిపించాడు. ఈ సిరీస్‌లో రాణించి, రిజర్వ్‌ ఓపెనర్‌గా తన స్థానాన్ని స్ధిరపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు. కోహ్లి రెండో టీ20 నుంచి ఆడనున్న నేపథ్యంలో.. మూడో స్థానంలో మరోసారి మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేయడంపై దీపక్‌ హుడా దృష్టిసారించనున్నాడు. 47 నాటౌట్‌, సెంచరీతో ఐర్లాండ్‌పై హుడా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతణ్ని తుది జట్టుకు ఎంపిక చేయకుండా ఉండడం కష్టం. ఇక అరంగేట్రం చేయని ఆటగాళ్లు రాహుల్‌ త్రిపాఠి, అర్ష్‌దీప్‌ సింగ్‌లు రెండు, మూడో టీ20లకు జట్టులో లేరు. ఈ మ్యాచ్‌కు ఉన్నా.. తుది జట్టులో స్థానం లభించే అవకాశం కనిపించట్లేదు. మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. బలమైన ఇంగ్లాండ్‌పై పైచేయి సాధించాలంటే ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ మెరవాల్సిన అవసరముంది. వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌గా తన బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తాడో చూడాలి. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌లపై చాలా భారం ఉంది. ఐర్లాండ్‌ బ్యాటర్ల ఎదురుదాడికి కంగుతిన్న భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌ మరింత కఠిన ప్రత్యర్థిపై రాణించాలంటే తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. మూడో పేసర్‌ స్థానంలో కోసం ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ మధ్య పోటీ ఉంది. చాహల్‌, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ బాధ్యతలను పంచుకుంటారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు మొత్తం 15 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సివుంది.

ఉత్సాహంగా ఇంగ్లాండ్‌: ఆతిథ్య జట్టు ఉత్సాహంగా సమరానికి సిద్ధమైంది. మోర్గాన్‌ రిటైరైన నేపథ్యంలో ఈ సిరీస్‌తో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ శకం మొదలు కానుంది. బెన్‌ స్టోక్స్‌, బెయిర్‌స్టోలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. అయినా ఆ జట్టులో హిట్టర్లకు కొదువలేదు. బట్లర్‌, లివింగ్‌స్టోన్‌ భారత టీ20లీగ్‌లో చెలరేగిన సంగతి తెలిసిందే. వాళ్లు ఈ సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నారు. వారిని నిలువరించడం భారత బౌలర్లకు పెను సవాలే. ఎలా బౌలింగ్‌ చేస్తారో చూడాలి.


పిచ్‌.. వాతావరణం

సౌథాంప్టన్‌ పిచ్‌పై కాస్త పచ్చిక ఉంది. బౌండరీ చాలా దూరంగా ఉంటుంది. ఈ సీజన్‌ టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో ఇక్కడ మరీ పరుగులేమీ రాలేదు. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 165. ఏడు మ్యాచ్‌ల్లో అయిదుసార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని