Zimbabwe Vs INDIA: ఇక కుర్రాళ్ల సమయం

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం.

Updated : 06 Jul 2024 10:14 IST

యువ భారత్‌కు తొలి పరీక్ష
జింబాబ్వేతో నేటి నుంచే టీ20 సిరీస్‌
సా.4.30 నుంచి
హరారె

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టు.. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తలపడనుంది. మరి ఈ సిరీస్‌లో తమదైన ముద్ర వేసే యువ ఆటగాళ్లెవరో?

యువ ఆటగాళ్లతో నిండిన టీమ్‌ఇండియా.. జింబాబ్వేతో టీ20 పోరుకు సిద్ధమైంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి పోరు శనివారమే. టీ20 ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకోలేకపోయిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ సిరీస్‌లో జట్టును నడిపించనున్నాడు. అతడితో పాటు రుతురాజ్‌ గైక్వాడ్, అభిషేక్‌ శర్మ, సాయి సుదర్శన్, జితేశ్‌ శర్మ, రింకు సింగ్‌ లాంటి కుర్రాళ్ల ప్రదర్శన ఈ సిరీస్‌లో ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేకెత్తించే విషయం. సికిందర్‌ రజా నాయకత్వంలోని జింబాబ్వే జట్టులో ప్రతిభావంతులకు కొదవ లేకపోవడంతో సిరీస్‌ ఆసక్తికరంగానే సాగే అవకాశముంది.

భలే ఛాన్సులే..: జింబాబ్వేతో జరగబోయేది అయిదు మ్యాచ్‌ల సిరీస్‌. కాబట్టి జట్టులోని 15 మంది సభ్యులకూ కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడే అవకాశం దక్కడం ఖాయం. పూర్తిగా యువ ఆటగాళ్లను పరీక్షించడానికే ఈ సిరీస్‌ను భారత్‌ ఉపయోగించుకుంటోందనడంలో సందేహం లేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన ఏ ఆటగాడూ ఈ జట్టులో లేడు. ఈ నేపథ్యంలో ఈ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం. టీ20 జట్టుకు కెప్టెన్‌గా రేసులో ముందున్నది హార్దిక్‌ పాండ్యనే అయినా.. శుభ్‌మన్‌ గిల్‌ ఈ సిరీస్‌లో సారథిగా తనదైన ముద్ర వేస్తే తన పేరునూ సెలక్టర్లు పరిగణిస్తారు. అతను బ్యాటర్‌గానూ జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. శుభ్‌మన్‌కు తోడుగా రుతురాజ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న అభిషేక్‌ శర్మ, ఈ సీజన్లో నిలకడగా రాణించిన రియాన్‌ పరాగ్‌ కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నారు. గుజరాత్‌ తరఫున సత్తా చాటిన తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్‌ కూడా చూడదగ్గ ఆటగాడే. అయితే తొలి మ్యాచ్‌లో అతడికి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. వికెట్‌ కీపర్‌గా జితేశ్‌ శర్మకే ఛాన్స్‌ లభించవచ్చు. మిడిలార్డర్లో రింకు సింగ్‌ మెరుపుల కోసం అభిమానులు ఎదురు చూస్తారనడంలో సందేహం లేదు. వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనుండగా.. అవేష్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, ముకేశ్‌ కుమార్‌ పేస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. 

దీటుగానే..: కుర్రాళ్లతో నిండిన భారత జట్టుకు జింబాబ్వే నుంచి సవాలు ఎదురు కావచ్చు. ప్రపంచ మేటి ఆల్‌రౌండర్లలో ఒకడైన కెప్టెన్‌ సికిందర్‌ రజాకు తోడు ముజరబాని, ఎంగరవ లాంటి ఉత్తమ పేసర్లు ఆ జట్టు సొంతం. మద్వీర, జాంగ్వి, మసకద్జ బంతితోనే కాక బ్యాటుతోనూ సత్తా చాటగలరు. బ్యాటర్లు జొనాథన్‌ క్యాంప్‌బెల్, మరుమాని మంచి ఫామ్‌లోనే ఉన్నారు. కాబట్టి సిరీస్‌లో భారత్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీనే ఉంటుంది. 

తుది జట్లు (అంచనా)..

భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్, జితేశ్‌ శర్మ, రింకు సింగ్, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, ముకేశ్‌ కుమార్‌.

జింబాబ్వే: ఇనోసెంట్‌ కైయా, జొనాథన్‌ క్యాంప్‌బెల్, సికిందర్‌ రజా (కెప్టెన్‌), మరుమాని, షుంబా, మద్వీర, జాంగ్వి, మసకద్జా, ముజరబాని, ఎంగరవ, చటార.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు