
T20 World Cup Final: టాస్ గురించి ఆందోళన చెందట్లేదు: ఆరోన్ ఫించ్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ పైనల్లో టాస్ గురించి ఆందోళన చెందట్లేదని, మ్యాచ్ ఫలితం దానిపై ఆధారపడి ఉండదని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. దుబాయ్ వేదికగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గురించి ఫించ్ ప్రస్తావించాడు. అక్కడ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. అయితే, దుబాయ్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు రాత్రివేళ జరగ్గా.. ఛేదనకు దిగిన జట్టు 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆసీస్ ఐదు విజయాలు సాధించగా..అన్నింట్లోనూ రెండోసారి బ్యాటింగ్ (ఛేదన) చేయడం గమనార్హం.
‘‘టాస్ గురించి ఆందోళనపడట్లేదు. దాన్ని కచ్చితంగా అధిగమించవచ్చు. టోర్నమెంట్లో కొన్నిసార్లు తొలుత బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టోర్నీలో గెలవాలంటే ముందుగా ఆ జట్టు బ్యాటింగ్‌లో గెలవాలి. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో నేను టాస్ ఓడిపోవాలని ఆశించా. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచడానికి ఇష్టపడతాను. దాంతో చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటంతో ప్రత్యర్థి జట్టు ప్రారంభంలో రిస్క్ తీసుకుంటుంది’ అని ఫించ్ అన్నాడు.
"ప్రపంచంలోని చాలా జట్లు టీ20 క్రికెట్లో ఛేజింగ్‌ను ఇష్టపడతాయని భావిస్తున్నా. అయితే ఇది రిస్క్‌తో కూడుకున్నది. ఒక జట్టు భారీ స్కోరును చేస్తే దాన్ని ప్రత్యర్థి జట్టు ఛేదించడం కష్టం. కానీ, ఈ టోర్నీలో ఛేదనకు దిగిన జట్టే గెలుస్తోంది. న్యూజిలాండ్ ఎంత పోటీగా ఆడుతుందో తెలుసు. ఆ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఎలాంటి స్థితిలోనైనా పోరాడి మ్యాచ్‌లో పైచేయి సాధించగలదు’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, ఆసీస్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.
► Read latest Sports News and Telugu News