T20 World Cup: ఆ నాలుగు జట్లు సెమీస్‌ చేరుతాయి: గంభీర్‌

టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం అయ్యేందుకు మరో రెండు నెలల సమయం ఉంది.

Published : 20 Aug 2021 22:32 IST


 

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం అయ్యేందుకు మరో రెండు నెలల సమయం ఉంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో విజయం సాధించాలని చాలా జట్లు తహతహలాడుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆటగాళ్లను సంసిద్ధం చేస్తున్నాయి. అయితే, ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలుస్తుంది, ఏయే జట్లు సెమీస్ చేరుతాయి అనే విషయాలపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

ఈ మెగా టోర్నీలో  సెమీస్‌ చేరే జట్లపై టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ తన అంచనాను బయటపెట్టాడు. ‘ఈ టీ20 ప్రపంచకప్‌లో ఏయే జట్లు సెమీస్ చేరుతాయని అంచనా వేస్తున్నారు’ అని అడిగిన ప్రశ్నకు ‘‘భారత్, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లు సెమీస్‌ చేరుతాయని భావిస్తున్నా’’ అని గంభీర్‌  బదులిచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈసారి  ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని రికీ పాంటింగ్‌  జోస్యం చెప్పగా.. సెమీస్‌ చేరే జట్లపై గంభీర్‌ అంచనా వేసిన జట్లలో ఆస్ట్రేలియాకు చోటే దక్కలేదు.

టీ20 ప్రపంచకప్‌ని టీమ్‌ఇండియా ఒక్కసారి మాత్రమే ముద్దాడింది. 2007 ఆరంభ ఎడిషన్‌లో ధోనీ సారథ్యంలో పాకిస్తాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. వెస్టిండీస్‌ రెండుసార్లు(2012, 2016) విజేతగా నిలవగా.. 2010లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌గా అవతరించింది. న్యూజిలాండ్‌ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ని సాధించలేదు. కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని