IND vs ENG: ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమికి కారణం ఇదే: వీరేంద్ర సెహ్వాగ్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో తొలి 10 ఓవర్లలో భారత్ బ్యాటింగ్ చేసిన విధానం వల్లే మ్యాచ్‌ చేజారిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 

Published : 12 Nov 2022 22:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బౌలింగ్‌ వైఫల్యం వల్లే ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో భారత్‌ ఓటమిపాలైందని మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. అయితే, రోహిత్‌ వాదనతో భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ విభేదించాడు. తొలి 10 ఓవర్లలో భారత్ బ్యాటింగ్ చేసిన విధానం వల్లే మ్యాచ్‌ చేజారిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

‘టాప్ ఆర్డర్ 12 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 77 పరుగులు చేస్తే, తర్వాత వచ్చే బ్యాటర్లు దూకుడుగా ఆడి ఎనిమిది ఓవర్లలో 100 పరుగులు చేస్తారని ఆశించడం సరికాదు. ఈ మైదానం (అడిలైడ్‌ ఒవెల్) సగటు స్కోరు 150-160 ఉండవచ్చు. మీరు దాని కంటే ఎక్కువ సాధించారు. ఆ పిచ్‌పై ఒక బ్యాటర్‌ నిలదొక్కుకుని ఉంటే దీని గురించి చర్చే అవసరం ఉండేది కాదు. బౌలర్ల వైఫల్యమే  మ్యాచ్‌ ఓడిపోవడానికి కారణమని టీమ్‌ఇండియా భావిస్తే దానితో నేను దానితో ఏకీభవించను. మొదటి 10 ఓవర్లలో బ్యాటర్లు మెరుగ్గా ఆడకపోవడం వల్లనే భారత్‌ మ్యాచ్‌లో ఓటమిపాలైంది’ అని సెహ్వాగ్ వివరించాడు. 

మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఓటమికి గల కారణాలను రోహిత్‌ శర్మ వివరించాడు.‘మ్యాచ్‌ ఫలితం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. బ్యాటింగ్‌ ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో మాత్రం తేలిపోయాం. ఇక్కడి పిచ్ బౌలింగ్‌కు సహకరించలేదు. అయినా 16 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ లక్ష్యాన్ని ఛేదించడం బాధాకరమే. మేం బ్యాటింగ్‌ చేసేటప్పుడు బంతి సరిగ్గా బ్యాట్‌కు రాలేదు. కానీ ఇంగ్లాండ్ ఓపెనర్లు మాత్రం బాగా ఆడారు’ అని  పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని