IND vs AFG: భారత్‌, అఫ్గాన్ సూపర్-8 మ్యాచ్‌.. తక్కువ అంచనా వేస్తే షాక్‌ తప్పదు!

టీ20 ప్రపంచ కప్‌ 2024 సూపర్‌ 8లో భాగంగా జూన్ 20న భారత్‌, అఫ్గానిస్థాన్ (IND vs AFG) తలపడనున్నాయి. 

Updated : 19 Jun 2024 16:35 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ 2024లో బుధవారం (జూన్‌ 19) నుంచి సూపర్‌-8 దశ ప్రారంభంకానుంది. భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ రెండో దశకు అర్హత సాధించాయి. టాప్‌-4లో నిలిచి సెమీస్‌కు చేరేందుకు ఈ ఎనిమిది జట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. సూపర్‌-8లో భాగంగా జూన్‌ 20న భారత్, అఫ్గానిస్థాన్ (IND vs AFG) మ్యాచ్‌ జరగనుంది. ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దాం. 

 • సూపర్‌ 8లో ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ఎలో భారత్‌, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్.. గ్రూప్‌ బిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, అమెరికా, దక్షిణాఫ్రికా ఉన్నాయి.
 • లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి ఎరుగని భారత్‌.. అఫ్గానిస్థాన్‌పై గెలిచి సూపర్‌-8లో శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది. 
 • న్యూయార్క్‌లో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన సూపర్‌-8 మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో ఆడనుంది. ఇక్కడి పిచ్‌లు సాధారణంగా స్పిన్‌కు అనుకూలిస్తాయి. 
 • కుల్‌దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, యుజువేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజాలతో టీమ్ఇండియా స్పిన్‌ విభాగం పటిష్టంగా ఉంది. 
 • తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లను తీసుకునే ఛాన్స్‌ ఉంది. అదే జరిగితే కుల్‌దీప్ యాదవ్‌ జట్టులోకి రావడం ఖాయం. బుమ్రా,   అర్ష్‌దీప్‌ను పేసర్లుగా తీసుకునే అవకాశముంది. 
 • బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సూర్యకుమార్‌ కీలకం కానున్నారు. విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌ అందుకుంటే భారత్‌కు తిరుగుండదు. 
 • లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి సూపర్‌-8కు వచ్చిన అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 
 • ఈ ప్రపంచకప్‌లో కివీస్‌ను అఫ్గాన్ చిత్తుగా ఓడించిన విషయాన్ని భారత్‌ మార్చిపోకూడదు. న్యూజిలాండ్‌ను 75 పరుగులకే ఆలౌట్‌ చేసి 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
 • అఫ్గాన్ బ్యాటర్లు రెహ్మనుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. గుర్బాజ్‌ 167 పరుగులతో ఈ ప్రపంచకప్‌లో టాప్‌ స్కోరర్‌గా ఉండగా.. జద్రాన్‌ 152 రన్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. 
 • రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, నూర్ అహ్మద్‌లతో కూడిన అఫ్గాన్ స్పిన్ విభాగం టీమ్ఇండియాకు సవాలు విసురుతోంది. పేసర్ ఫజల్ హక్ ఫారూఖీ అత్యధిక (12) వికెట్ల వీరుడిగా ఉన్నాడు. నబీ, రషీద్ ఖాన్‌ బ్యాట్‌తోనూ సత్తా చాటగలరు. 
 • భారత్‌, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్‌ ఓవల్‌ మైదానంలోనే జూన్‌ 29న ఫైనల్‌ జరగనుంది. 
 • ఈ వేదికలో ఇప్పటివరకు 47 అంతర్జాతీయ టీ20లు జరిగాయి. 30 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని