IND vs AUS: షాక్‌లో ఉన్న కంగారూలు.. జోరు మీదున్న టీమ్‌ఇండియా.. హోరాహోరీ తప్పదా?

టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్‌-8లో అఫ్గాన్‌ చేతిలో ఓటమిపాలై షాక్‌లో ఉన్న ఆస్ట్రేలియా సోమవారం (జూన్‌ 24న) టీమ్‌ఇండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే కంగారూల జట్టు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. 

Updated : 23 Jun 2024 18:44 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్‌-8లో ఆస్ట్రేలియాను అఫ్గానిస్థాన్‌ ఓడించడంతో సెమీస్‌ రేసు ఆసక్తికరంగా మారింది. గ్రూప్‌-1 నుంచి వరుసగా రెండు విజయాలతో టీమ్‌ఇండియా దాదాపుగా సెమీస్ చేరింది. అఫ్గాన్‌ చేతిలో ఓటమిపాలై షాక్‌లో ఉన్న కంగారూల జట్టు సోమవారం (జూన్‌ 24న) టీమ్‌ఇండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత్, ఆసీస్ జట్ల బలబలాలపై లుక్కేద్దాం.   

 • లీగ్ దశ నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ సెమీస్ చేరడానికి అవకాశాలుంటాయి. 
 • ఆసీస్‌తో మ్యాచ్‌కు బ్యాటర్లందరూ లయ అందుకోవడం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశం. బంగ్లాదేశ్‌పై సూర్యకుమార్‌ మినహా ప్రధాన బ్యాటర్లందరూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు. 
 • టోర్నీ ఆరంభంలో నిరాశపర్చిన విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడం ఊరటనిచ్చే అంశం. బంగ్లాపై అతడు స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. 
 • రోహిత్, కోహ్లీ ఓపెనింగ్ జోడీ టోర్నీలో తొలిసారి బంగ్లాదేశ్‌పై శుభారంభం అందించింది. కంగారూలపై కూడా ఈ ద్వయం నుంచి మెరుపు ఆరంభాన్ని ఆశిస్తోంది జట్టు. 
 • రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్య ప్రస్తుత ఫామ్‌ని కొనసాగించాల్సిన అవసరముంది. సూర్యకుమార్‌, శివమ్‌ దూబె కూడా చెలరేగితే ఆసీస్‌ బౌలర్లకు తిప్పలు తప్పవు. 
 • పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్నర్‌ కల్‌దీప్‌ యాదవ్ మరోసారి చెలరేగితే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. అర్ష్‌దీప్‌ సింగ్, హార్దిక్ పాండ్య కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ తమవంతు పాత్ర పోషిస్తున్నారు. 
 • అఫ్గానిస్థాన్‌ చేతిలో ఓడినంత మాత్రాన ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇందులో గెలిస్తేనే కంగారూలకు సెమీస్‌ అవకాశాలు ఉండటంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయం. 
 • ఆసీస్‌ ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్ (179 రన్స్), డేవిడ్ వార్నర్‌ (172 పరుగులు) మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరి దూకుడుకు భారత బౌలర్లు ఆరంభంలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. 
 • మిడిల్ ఆర్డర్‌లో స్టాయినిస్ (167 రన్స్‌) అదరగొడుతున్నాడు. అతడు బంతితోనూ రాణిస్తున్నాడు. మ్యాక్స్‌వెల్ ఫామ్‌ అందుకోవడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.
 • పాట్ కమిన్స్‌, మిచెల్ స్టార్క్‌, హేజిల్‌వుడ్‌లతో పేస్ విభాగంగా పటిష్టంగా ఉంది. కమిన్స్‌ ఇప్పటికే రెండుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన సంగతి తెలిసిందే. 
 • స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. అతడు టోర్నీలో ఇప్పటివరకు 13 వికెట్లు పడగొట్టాడు. 
 • టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు పొట్టి కప్‌లో ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరగ్గా.. టీమ్‌ఇండియా 3, ఆసీస్ 2 మ్యాచ్‌ల్లో నెగ్గాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని