T20 World Cup: నమీబియాపై అఫ్గానిస్థాన్‌ భారీ విజయం

టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అఫ్గాన్‌ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా

Updated : 31 Oct 2021 19:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో సెమీస్ రేసులో అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అఫ్గాన్‌ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేసింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్‌ వైస్‌ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గాన్‌ బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌, హమీద్‌ హసన్‌ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, గుల్బాదీన్‌ నైబ్‌ రెండు,  రషీద్‌ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

టపాటపా

లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా ఆరంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ విలియమ్స్‌ (1), మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ వాన్‌ లింగెన్‌ (11) ఔటయ్యారు. వీరిద్దరిని నవీన్ ఉల్‌ హక్‌ పెవిలియన్‌కి చేర్చాడు. గుల్బాదీన్‌ వేసిన ఆరో ఓవర్లో లాప్టి ఎటాన్‌ (14) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. కుదురుకున్నట్టు కనిపించిన ఎరాస్‌మస్‌ (12)ని 11 ఓవర్‌లో హమీద్‌ వెనక్కి పంపాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి జే జే స్మిత్‌ (0) కూడా ఔటయ్యాడు. దీంతో నమీబియా మరింత కష్టాల్లో పడింది. ఫ్రైలింక్‌ (6), ఫ్రాన్స్‌ (3) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. 17 ఓవర్‌లో డేవిడ్ వైస్‌ ఔటయ్యాడు. ట్రంపుల్మన్‌ (12), బెర్నాడ్ (6) నాటౌట్‌గా నిలిచారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ (33: 4ఫోర్లు, 2 సిక్సర్లు), మహమ్మద్‌ షంజాద్‌ (45: 3 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు అర్ధశతకం (53) భాగస్వామ్యం నిర్మించారు. పవర్‌ప్లేలో ధాటిగా ఆడిన అఫ్గాన్‌ను నమీబియా బౌలర్లు అడ్డుకున్నారు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లతోపాటు రహమాన్‌తుల్లా (4), జాద్రాన్‌ (7)ను ఔట్‌ చేసి కాస్త పట్టు సాధించారు. అయితే అస్గర్ అఫ్గాన్‌ (31: 3 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ మహమ్మద్‌ నబీ (32*: 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఆఖర్లో దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. నమీబియా బౌలర్లలో రుబెన్ ట్రంపుల్మన్‌ 2, జాన్‌ నికోల్ 2.. స్మిత్ ఒక వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని