టాస్‌ గెలిస్తే ప్రపంచకప్‌ గెలిచేస్తారేమో!

టీ20 సిరీసులో టాస్‌ కీలకం అవుతుండటంపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ ఛలోక్తి విసిరాడు. చూస్తుంటే భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో మెరుగైన టాసర్‌ కప్‌ను కైవసం చేసుకుంటారేమోనని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం భారత్‌, ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ గురించి ఆయన ఇలా స్పందించాడు....

Updated : 17 Mar 2021 12:22 IST

మైకేల్‌ వాన్‌ చమత్కారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 సిరీసులో టాస్‌ కీలకం అవుతుండటంపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ ఛలోక్తి విసిరాడు. చూస్తుంటే భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో మెరుగైన టాసర్‌ కప్‌ను కైవసం చేసుకుంటారేమోనని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం భారత్‌, ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ గురించి ఆయన ఇలా స్పందించాడు.

ఐదు టీ20 సిరీసులో ఇప్పటి వరకు మూడు మ్యాచులు జరిగాయి. మొదటి పోరులో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా పేలవంగా ఆడింది. తక్కువ స్కోరే చేయడంతో మోర్గాన్‌ సేన విజయం సాధించింది. రెండో పోరులో కోహ్లీ టాస్‌ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకొని ఆంగ్లేయులను దెబ్బకొట్టాడు. జట్టును గెలుపు బాట పట్టించాడు. మంగళవారం జరిగిన మూడో టీ20లోనూ ఇదే సన్నివేశం పునరావృతమైంది. టాస్‌ గెలిచిన మోర్గాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని కోహ్లీసేనను మోస్తరు స్కోరుకే పరిమితం చేశాడు. దాంతో ఇంగ్లాండ్‌ 2-1తో సిరీస్‌లో పైచేయి సాధించింది.

ఇలా టాస్‌ కీలకం అవుతుండటంతో వాన్‌ ట్వీట్‌ చేశాడు. ‘చూస్తుంటే భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ టాసర్‌ విజేతగా నిలుస్తాడేమో అనిపిస్తోంది!!!’ అని పోస్ట్‌ చేశాడు. అయితే తమ ఓటములకు టాస్‌ను నిందించబోమని కోహ్లీ స్పష్టం చేశాడు. ‘ఒకవేళ టాస్‌ ఓడితే ప్రత్యర్థి అడిగింది చేయాలి. కొత్త బంతితో ఇంగ్లాండ్‌ బౌలర్లు అదరగొట్టాడు. తొలి ఆరు ఓవర్లలో అసలు పరుగులు చేయనివ్వలేదు. కఠినంగా బంతులేశారు. మేం పుంజుకొనేందుకు ప్రయత్నించినా రెండో అర్ధభాగంలో మా తీవ్రత, బలం తగ్గింది’ అని అన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని