SuryaKumar-Virat: కోహ్లీ ‘ఫిట్‌నెస్‌’ చూశాక.. పోటీపడలేమనుకున్నా: సూర్యకుమార్

ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్‌ను అందుకోవడం చాలా కష్టమని భారత క్రికెటర్ సూర్యకుమార్‌ యాదవ్ వ్యాఖ్యానించాడు.

Updated : 04 Jul 2024 13:52 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ఫైనల్‌లో అద్భుతమైన క్యాచ్‌తో భారత క్రికెటర్ సూర్యకుమార్‌ యాదవ్ సంచలనంగా మారిపోయాడు. పొట్టి కప్‌ను అందించిన ఆ క్యాచ్‌ను అందుకోవడానికి పరోక్షంగా విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా నిలిచాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్‌ను అందుకోవడం చాలా కష్టమని సూర్య వ్యాఖ్యానించాడు. టీ20ల్లో అరంగేట్రం చేసిన తర్వాత కోహ్లీతో కలిసి ఆడిన అనుభవం చాలా ఉపయోగపడిందని తెలిపాడు. 

‘‘విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతమైన నాయకుడు. ఒక్కసారి మైదానంలోకి అడుగుపెడితే అతడి ఎనర్జీ మొత్తం బయటకొచ్చేస్తుంది. పవర్‌హౌస్‌లాంటోడు. ప్రదర్శనతో సంబంధం లేకుండా దూకుడుగా ఉంటాడు. నేను డెబ్యూ చేసిన తర్వాత.. ఎక్కువగా కోహ్లీతో ఆడే అవకాశం లభించింది. ద్వైపాక్షిక సిరీస్‌లతోపాటు వరల్డ్‌ కప్‌లోనూ ఆడా. అతడితో ఆడేటప్పుడు ఫిట్‌నెస్‌ను పోల్చుకుంటూ ఉంటా. కానీ, ఏ దశలోనూ కోహ్లీ స్థాయికి రాలేనని అర్థమైంది. ఎందుకంటే ఖాళీ ప్రదేశంలోకి బంతిని పంపించి అత్యంత వేగంగా రెండు పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఒక్కోసారి నాలుగుగా మార్చాలని చూస్తుంటాడు. అందుకే జట్టు స్ట్రెంత్‌ అండ్ కండీషనింగ్‌ కోచ్‌ సోహమ్ దేశాయ్‌కు ఒకే మాట చెప్పా. నా ట్రైనింగ్‌ టైమ్‌ను ఎక్కువగా విరాట్‌తో ఉండేలా చూడమని కోరా. కొన్ని రోజులు ట్రైనింగ్‌ లేకపోతే నా శరీరం అలసిపోయినట్లుగా లేదా మానసికంగా సిద్ధంగా లేనట్లు అనిపిస్తుంది. కనీసం శిక్షణ సమయంలో 40 నిమిషాలపాటు అతడిని చూస్తూ జిమ్‌లో గడపడం ద్వారా మళ్లీ ఎనర్జీ వచ్చేస్తుంది’’ అని సూర్యకుమార్ (Suryakumar Yadav) వ్యాఖ్యానించాడు.

రెండో స్టార్‌ వచ్చేసింది: సంజూ శాంసన్

టీ20 ప్రపంచ కప్‌ 2024ను టీమ్‌ఇండియా సొంతం చేసుకుని 17 ఏళ్ల నిరీక్షణకు తెరతీసింది. రెండోసారి కప్‌ను దక్కించుకోవడంతో భారత జట్టు జెర్సీపై ‘రెండు స్టార్లు’ చేరాయంటూ సంజూ శాంసన్‌ (Sanju తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు పెట్టాడు. ‘భారత్‌ ఛాంపియన్స్‌’ అని టీమ్‌ఇండియా జెర్సీని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టుకొన్నాడు. విండీస్‌ నుంచి దిల్లీకి వచ్చిన భారత క్రికెటర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.  ఆ తర్వాత ముంబయికి బయల్దేరారు. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ టాప్‌ బస్‌పై రోడ్‌షో జరగనుంది. అనంతరం ప్లేయర్లను బీసీసీఐ సన్మానించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని