IND vs ZIM: జింబాబ్వేని చిత్తు చేసి.. అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్‌

టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌ 12లో ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. జింబాబ్వేను చిత్తుగా ఓడించి ఇంగ్లాండ్‌తో సెమీస్‌ పోరుకు సిద్ధమైంది. గ్రూప్ -2లో ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Updated : 08 Dec 2022 17:26 IST

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌ -12లో ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. జింబాబ్వేను చిత్తుగా ఓడించి ఇంగ్లాండ్‌తో సెమీస్‌ పోరుకు సై అంటోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (61; 25 బంతుల్లో), కేఎల్ రాహుల్‌ (51; 35 బంతుల్లో) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే.. భారత బౌలర్ల ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. దీంతో రోహిత్‌ సేన 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే బ్యాటర్లలో రియాన్‌ బర్ల్‌ (35), సికిందర్‌ రజా (34) మాత్రమే పోరాడారు. 

టీమ్‌ఇండియా బౌలర్ల జోరు.. జింబాబ్వే బ్యాటర్ల విలవిల 

187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే భువి షాకిచ్చాడు. మొదటి బంతికే మెదర్వె (0) కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అర్ష్‌దీప్‌ వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి చకబ్వా (0) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. తర్వాత కొద్దిసేపు వికెట్ల పతనం ఆగినా పరుగులు మాత్రం రాలేదు. షమి వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతికి విలియమ్స్‌ (11) భువికి చిక్కాడు.  హార్దిక్‌ వేసిన ఏడో ఓవర్‌లో ఎర్విన్ (13) హార్దిక్‌కే క్యాచ్‌ ఇవ్వగా..  షమీ వేసిన తర్వాతి ఓవర్‌లో టోనీ (5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 59-5గా నమోదైంది. అనంతరం జింబాబ్వే కాస్త పుంజుకుంది. అక్షర్‌ పటేల్ వేసిన 11వ ఓవర్‌లో 16, 13 ఓవర్‌లో 13వ పరుగులు రాబట్టింది. 16వ ఓవర్‌లో అశ్విన్‌  ఓవర్‌లో మసకద్జ (1), ఎన్‌గరవా (1)లను పెవిలియన్‌ చేర్చాడు. తర్వాతి ఓవర్‌లో సికిందర్‌ రజా కూడా ఔట్‌ కావడంతో జింబాబ్వే  విజయంపై ఆశలు వదులుకుంది.

ఆఖరి ఐదు ఓవర్లలో సూర్యకుమార్ విధ్వంసం

15 ఓవర్లకు భారత్ స్కోరు 107/4. సూర్యకుమార్‌ 6 బంతుల్లో 5 పరుగులు. మ్యాచ్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి సూర్యకుమార్‌ స్కోరు 61. ఇదొక్కటి చాలు sky విధ్వంసం ఎలా సాగిందో చెప్పడానికి. మసకద్జ వేసిన 16వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన సూర్య..  ఎన్‌గరవా వేసిన తర్వాతి ఓవర్‌లో ఓ ఫోర్‌, సిక్స్‌ బాదాడు. చతారా వేసిన 18వ ఓవర్‌లోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. ఆఖరి ఓవర్‌లో కూడా ఓ బౌండరీ, సిక్స్‌ బాదాడు. భారత్ చివరి ఐదు ఓవర్లలో 79 పరుగులు రాబట్టడం విశేషం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు