Kuldeep Yadav: బౌండరీలు బాదుతున్నా.. ఆ సూత్రానికే కట్టుబడి ఉంటా: కుల్‌దీప్‌

Kuldeep Yadav: కరీబియన్‌ పిచ్‌లకు అనుగుణంగా కుల్‌దీప్‌ను జట్టులోకి తీసుకోవడం భారత జట్టుకు కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో తాను అనుసరిస్తున్న వ్యూహంపై తాజాగా స్పందించాడు.

Published : 23 Jun 2024 11:31 IST

Kuldeep Yadav | గ్రాస్‌ఐలెట్‌: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) టోర్నీ ముందుకు సాగేకొద్దీ కరీబియన్‌ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయని భారత జట్టు అంచనా వేసింది. అందుకు అనుగుణంగా వ్యూహాలు మార్చింది. పేసర్‌ సిరాజ్‌ను తప్పించి అక్షర్, జడేజాలకు తోడు మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ను (Kuldeep Yadav) తుది జట్టులోకి తీసుకుంది. ఈ ప్రయోగం ఫలితాన్నిస్తోంది. కుల్‌దీప్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు సూపర్‌-8 మ్యాచ్‌లలో అంచనాలకు అనుగుణంగా రాణించాడు. దీనిపై స్పందిస్తూ.. దూకుడుగా ఆడడమే తన విజయానికి కారణమని తాజాగా కుల్‌దీప్‌ వెల్లడించాడు.

గత 12 నెలలుగా అన్ని ఫార్మాట్లలో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ (Kuldeep) రాణించాడు. అయినా, అమెరికా పిచ్‌లు పేసర్లకు సహకరిస్తాయన్న అంచనాల మధ్య అతణ్ని గ్రూప్‌ దశలో ఒక్క మ్యాచూ ఆడించలేదు. కరీబియన్‌లోని స్పిన్‌ పిచ్‌లకు అనుగుణంగా అతణ్ని జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు తీశాడు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడు అనుసరిస్తున్న వైఖరే విజయానికి కారణం. బ్యాటర్లు బౌండరీలు బాదుతున్నా లెంగ్త్‌ విషయంలో మాత్రం అతడు రాజీపడకుండా బౌలింగ్‌ చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై ఇదే వ్యూహాన్ని అనుసరించాడు. గూగ్లీతో ఓపెనర్‌ తంజిద్‌ను ఔట్‌ చేసిన అతడు తర్వాత స్ట్రెయిటర్‌ బాల్‌తో తౌహిద్‌ను వెనక్కి పంపాడు. హసన్‌ కూడా అతనికే చిక్కడంతో బంగ్లా ఓటమి ఖరారైంది.

అడుగు పడినట్లే..బంగ్లాపై భారత్‌  ఘనవిజయం

తన ఆటతీరు, వ్యూహాలపై మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో ఏ స్పిన్నర్‌ అయినా సరే.. లెంగ్త్‌ చాలా ముఖ్యం. ప్రత్యేకంగా ఈ ఫార్మాట్‌లో అసలు బ్యాటర్‌ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి. అతడు దూకుడుగా ఆడుతుంటే.. స్పిన్‌ బౌలర్‌ మరింత దూకుడుగా ఉండాలి. అదే ఐపీఎల్‌లోగానీ, టీ20 ప్రపంచకప్‌లోగానీ నాకు పనికొస్తోంది’’ అని బంగ్లాతో మ్యాచ్‌ అనంతరం కుల్‌దీప్‌ (Kuldeep Yadav) వివరించాడు. సోమవారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌ అతనికి కీలకంగా మారనుంది.

బ్యాటర్లు బౌండరీలు బాదుతున్నప్పుడు మీ వ్యూహం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు కుల్‌దీప్‌ (Kuldeep) బదులిచ్చాడు. ‘‘ప్రత్యర్థి జట్టుకు ఓవర్‌కు 10 లేదా 12 పరుగులు కావాల్సినప్పుడు బ్యాటర్లు దూకుడుగా ఆడుతుంటారు. అలాంటప్పుడు లెంగ్త్‌కు కట్టుబడి ఉండడమే నా ప్లాన్‌. వాళ్లు అటాక్‌ చేస్తున్నప్పుడు.. సరైన లెంగ్త్‌లో బంతులను సంధిస్తే చాలు. వారు ఔటవ్వడానికి అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. నా ఆలోచనంతా దానిపైనే ఉంటుంది. ఔట్‌ చేయాలనే లక్ష్యంపై కాకుండా కేవలం లెంగ్త్‌పైనే దృష్టి సారిస్తా’’ అని కుల్‌దీప్‌ వివరించాడు.

కరీబియన్‌లో జరిగే మ్యాచ్‌లలో జట్టు కూర్పు ఎలా ఉంటుందో తనకు ముందే అవగాహన ఉందని కుల్‌దీప్‌ వెల్లడించాడు. పరోక్షంగా పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగానే గ్రూప్‌ దశలో తనని జట్టులోకి తీసుకోలేదని చెప్పాడు. సూపర్‌-8లో తమపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశాడు. అక్కడ కూడా లెంగ్త్‌కు కట్టుబడి ఉంటూ పేస్‌ను మార్చడమే తన వ్యూహమని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని