
T20 World Cup: ఆరంభం.. ఆఖర్లో అఫ్గాన్ దూకుడు
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ మంచి స్కోరును సాధించింది. అయితే ఆరంభంలో ఉన్న దూకుడు మధ్య ఓవర్లలో లేకపోవడంతో భారీ స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఆఖర్లో ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. దీంతో నమీబియాకు 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (33: 4ఫోర్లు, 2 సిక్సర్లు), మహమ్మద్ షంజాద్ (45: 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు అర్ధశతకం (53) భాగస్వామ్యం నిర్మించారు. పవర్‌ప్లేలో ధాటిగా ఆడిన అఫ్గాన్‌ను నమీబియా బౌలర్లు అడ్డుకున్నారు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లతోపాటు రహమాన్తుల్లా (4), జాద్రాన్ (7)ను ఔట్ చేసి కాస్త పట్టు సాధించారు. అయితే అస్గర్ అఫ్గాన్ (31: 3 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ మహమ్మద్ నబీ (32*: 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఆఖర్లో దూకుడుగా బ్యాటింగ్ చేశారు. నమీబియా బౌలర్లలో రుబెన్ ట్రంపుల్మన్ 2, జాన్ నికోల్ 2.. స్మిత్ ఒక వికెట్ తీశారు.