T20 World Cup: భారీ స్కోరు చేయకుండా విండీస్‌ను నిలువరించిన ఆసీస్‌ బౌలర్లు

సెమీస్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాకు చావోరేవోలాంటి మ్యాచ్‌. అలాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారీ స్కోరు చేయకుండా ఆసీస్‌ బౌలర్లు...

Published : 06 Nov 2021 17:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెమీస్‌కు చేరాలంటే ఆస్ట్రేలియాకు చావోరేవోలాంటి మ్యాచ్‌. అలాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారీ స్కోరు చేయకుండా ఆసీస్‌ బౌలర్లు అడ్డుకోగలిగారు. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌కు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్‌ కీరన్ పొలార్డ్‌ (44) రాణించడంతో విండీస్‌ ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి టోర్నీ నుంచి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించిన విండీస్‌కు కలిసిరాలేదు. రెండు ఓవర్లకే 24 పరుగులు చేసినా.. వెనువెంటనే వికెట్లను కోల్పోవడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది. తొలి నుంచి ధాటిగా ఆడేందుకు యత్నించిన క్రిస్‌ గేల్‌ (15)ను కమిన్స్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్‌ హేజిల్‌వుడ్‌ (4/39) విజృంభించాడు. నికోలస్‌ పూరన్‌ (4), రోస్టన్‌ ఛేజ్‌ (0)లను ఔట్‌ చేసిన హేజిల్‌వుడ్.. మంచి ఫామ్‌లో ఉన్న హెట్మెయిర్‌ (27)ను పెవిలియన్‌కు పంపాడు. జంపా బౌలింగ్‌లో లూయిస్‌ (29) ఔట్‌ అయ్యాడు. వందలోపే ఐదు వికెట్లను కోల్పోయిన విండీస్‌ను ఆఖర్లో బ్రావో (12)తో కలిసి కీరన్‌ పొలార్డ్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే బ్రావోతోపాటు పొలార్డ్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో విండీస్‌కు భారీ స్కోరు సాధించే అవకాశం లేకుండా పోయింది. చివరి ఓవర్‌లో రస్సెల్‌ (18*) రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 4.. స్టార్క్, కమిన్స్, జంపా తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని