T20 World Cup: కివీస్‌కు స్వల్ప లక్ష్యం.. ఇక ఆశలన్నీ అఫ్గాన్‌ బౌలర్లపైనే!

సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో భారీ స్కోరు చేయకుండా అఫ్గానిస్థాన్‌ను న్యూజిలాండ్‌ బౌలర్లు..

Updated : 07 Nov 2021 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ భారీ స్కోరు చేయకుండా న్యూజిలాండ్‌ బౌలర్లు నిలువరించారు. టాస్‌ నెగ్గిన అఫ్గానిస్థాన్‌ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని కివీస్‌కు బౌలింగ్‌ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గాన్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (73) అద్భుత అర్ధశతకంతో అఫ్గాన్‌ ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. దీంతో న్యూజిలాండ్‌కు 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మహమ్మద్‌ షహజాద్ (4), హజ్రతుల్లా జజాయ్‌ (2)తోపాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ గుర్బాజ్‌ (6) విఫలమయ్యారు. అనంతరం వచ్చిన నయీబ్‌ (15)తో కలిసి నజీబుల్లా ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు.

ఈ ఇద్దరూ కుదురుకుంటున్న సమయంలో నయీబ్‌ను సోధి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ నబీ (14) దూకుడుగా ఆడలేకపోయినా నజీబుల్లాకు చక్కటి సహకారం అందించాడు. అయితే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోవడంతో అఫ్గాన్‌ మళ్లీ కష్టాల్లో పడింది. 115/4తో ఉన్న అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్‌ బౌలర్లు దెబ్బతీశారు. నబీ, నజీబుల్లా, కరీమ్‌ (2)ను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చారు. దీంతో అఫ్గానిస్థాన్‌ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, సౌథీ 2.. మిల్నే, సోధి, నీషమ్‌ తలో వికెట్‌ తీశారు. టీమ్‌ఇండియా సెమీస్‌ అవకాశాలు ఇక అఫ్గాన్‌ బౌలర్ల చేతిలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని