T20 worldcup: బాబోయ్‌.. నా పెళ్లికీ, ప్రపంచకప్‌కీ లింక్ లేదు!: రషీద్‌ఖాన్‌ 

అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ అనగానే  మొదట గుర్తుకు వచ్చే పేరు రషీద్‌ఖాన్‌. తన స్పిన్‌ మయాజాలంతో ఎంతటి ఆటగాడినైనా కట్టడి చేయడంలో రషీద్‌ దిట్ట. ఐపీఎల్‌, బిగ్‌బాష్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్‌, పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌ వంటి టీ20 లీగ్‌లలో పాల్గొంటూ మంచి గుర్తింపుని పొందుతున్నాడు.

Published : 22 Oct 2021 01:37 IST

(Photo: ICC Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ అనగానే  మొదట గుర్తుకు వచ్చే పేరు రషీద్‌ఖాన్‌. తన స్పిన్‌ మయాజాలంతో ఎంతటి ఆటగాడినైనా కట్టడి చేయడంలో రషీద్‌ దిట్ట. ఐపీఎల్‌, బిగ్‌బాష్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్‌, పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌ వంటి టీ20 లీగ్‌లలో పాల్గొంటూ మంచి గుర్తింపుని పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని నాణ్యమైన స్పిన్నర్లలో ఒకడిగా ఎదిగాడు. టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ జట్టు నేరుగా సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించి గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌లతో తలబడనుంది. దీంతో రషీద్‌ఖాన్‌ ఈ మెగా టోర్నీపై దృష్టిపెట్టాడు. అఫ్గానిస్థాన్‌ ఇప్పుడిప్పుడే మెరుగైన జట్టుగా తయారవుతోందని, ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడానికి ఇంకొంత సమయం పడుతుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే, అఫ్గానిస్థాన్‌ ప్రపంచకప్‌ గెలిచిన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటానని, అప్పటిదాకా నిశ్చితార్థం గురించి కూడా ఆలోచించనని రషీద్‌ఖాన్‌ అన్నట్లు కొన్నాళ్ల కిందట వార్తలు వైరల్‌ అయ్యాయి. దీనిపై రషీద్‌ స్పష్టతనిచ్చాడు.

‘నిజానికి నేను ఈ వార్త విని షాక్‌కి గురయ్యాను. ఎందుకంటే నేనెప్పుడూ నా వ్యక్తిగత జీవితానికి, క్రికెట్‌కి ముడిపెట్టలేదు. ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు. నేనేం చెప్పానంటే.. వచ్చే మూడేళ్లు చాలా బిజీగా ఉండబోతున్నా. 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లు, 2023లో వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. ఇప్పుడు నా దృష్టి అంతా వాటిపైనే ఉందని చెప్పా. అంతే తప్ప ప్రపంచకప్‌ గెలిచిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని అనలేదు’అని రషీద్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని