Published : 07 Nov 2021 01:47 IST

T20 World Cup: కివీస్‌పై అఫ్గాన్‌ గెలిస్తే.. సందేహాలు వ్యక్తమవుతాయి: అక్తర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ చివరి దశకు చేరుకుంది. గ్రూప్‌-2 నుంచి ఇప్పటికే పాకిస్థాన్‌ నాలుగు విజయాలతో సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన స్థానం కోసం భారత్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ పోటీపడుతున్నాయి. గతరాత్రి టీమ్‌ఇండియా స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించడంతో కోహ్లీసేన సైతం ఇప్పుడు పోటీలోకి వచ్చింది. అయితే, ఆదివారం అఫ్గాన్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఎవరు సెమీస్‌కు చేరతారనే విషయంపై ఒక అంచనా ఏర్పడుతుంది. ఒకవేళ కివీస్‌ గెలిస్తే అది నేరుగా సెమీస్‌ చేరే అవకాశం ఉండగా.. అఫ్గాన్‌ గెలిస్తే ఆ జట్టుతో పాటు టీమ్‌ఇండియాకు అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్తర్‌ తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ఒకవేళ అఫ్గాన్‌ చేతిలో న్యూజిలాండ్‌ ఓడిపోతే సామాజిక మాధ్యమాల్లో అనేక ప్రశ్నలు వ్యక్తమవుతాయి. నేను ముందే ఈ విషయం గురించి చెప్పదల్చుకున్నా. అదే జరిగితే సోషల్‌ మీడియాలో మరో ట్రెండింగ్‌ న్యూస్‌ ప్రచారం అవుతుందని భావిస్తున్నా. ఇప్పుడు నేను ఎలాంటి వివాదాల్లో చిక్కుకోవాలని లేదు. ఈ విషయంపై మాట్లాడదల్చుకోలేదు. కానీ, న్యూజిలాండ్‌లో ఉండే పాకిస్థానీయుల సెంటిమెంట్లు అధికంగా ఉంటాయి’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. అలాగే అఫ్గాన్‌ కన్నా న్యూజిలాండ్‌ జట్టే బలమైందని, దురదృష్టం కొద్దీ వాళ్లు ఓడితే సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను ఆపడం ఎవరివల్లా కాదన్నాడు. ఇక టీమ్‌ఇండియా పుంజుకోవడంపై స్పందిస్తూ.. కోహ్లీసేన ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడంతో టోర్నీ ఆసక్తిగా మారిందని చెప్పాడు. 

ఒకవేళ టీమ్‌ఇండియా సెమీస్‌ చేరితే ఆపై ఫైనల్లో పాకిస్థాన్‌తో మరోసారి తలపడే అవకాశం ఉందన్నాడు. టీమ్‌ఇండియా బాగా ఆడిందని, కాకపోతే కాస్త ఆలస్యంగా రాణించిందని పాక్ మాజీ పేసర్‌ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా ఈ ప్రపంచకప్‌ టోర్నీలో తొలుత పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే, మూడో మ్యాచ్‌లో అఫ్గాన్‌పై 66 పరుగుల భారీ తేడాతో గెలవడంతో ఆ మ్యాచ్‌ను భారత్‌ ఫిక్స్‌ చేసిందని పాకిస్థాన్‌ అభిమానులు ట్విటర్‌లో విస్త్రుత ప్రచారం చేశారు. దీంతో ఆ రోజంతా అది ట్రెండింగ్‌లో నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌.. అఫ్గాన్‌ చేతిలో ఓడితే మళ్లీ అలాంటి పోస్టులే వైరల్‌ అవుతాయని అక్తర్‌ తన సందేహం వెలిబుచ్చాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని