
T20 World Cup: యుజువేంద్ర చాహల్ జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నా: హర్భజన్ సింగ్
(Photo: Yuzvendra Chahal Twitter)
ఇంటర్నెట్ డెస్క్:టీమ్ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్.. టీ20 ప్రపంచ జట్టులోకి వస్తాడని ఇప్పటికీ ఆశిస్తున్నానని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే చాలా దేశాలు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా టీమ్ఇండియా జట్టును ప్రకటించింది. మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, అక్టోబర్ 10 వరకు తుదిజట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని ఐసీసీ పేర్కొంది. దీంతో భారత జట్టులో ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తారా అనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాహల్ జట్టుకు ఎంపికవుతాడని ఆశిస్తున్నట్లు హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.
‘నీవు ఎప్పటిలాగే అత్యుత్తమంగా ఉన్నావు. దానిని కొనసాగించు. సరైన వేగంతో బౌలింగ్ చేస్తున్నానని నిర్ధారించుకో. చాలా నెమ్మదిగా బౌలింగ్ చేయకు. టీ 20 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియాలో నిన్ను చూడాలని ఆశిస్తున్నా. ఛాంపియన్ బౌలర్" అని హర్భజన్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్లో యుజువేంద్ర చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్నాడు. ‘ఆర్సీబీ విజయాల కోసం నేను వంద శాతం కృషి చేస్తా’ అని ఇటీవల ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా హర్భజన్ ఈ ట్వీట్ చేశాడు.