T20 World Cup: టీమిండియా అందుకే భారీ స్కోర్లు చేయట్లేదు: సునీల్ గావస్కర్‌

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. చివరి మూడు మ్యాచ్‌ల్లో విజయాలను సాధించిన సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో టీమిండియా

Published : 10 Nov 2021 01:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. చివరి మూడు మ్యాచ్‌ల్లో విజయాలను సాధించినా సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ పలు సలహాలు, సూచనలు చేశారు. పవర్‌ ప్లే ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్‌ విధానం మారాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘జట్టులో చాలా మార్పులు చేయడం సరికాదు. ఎందుకంటే భారత్ తన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోలేదు. రెండు మ్యాచ్‌లలో బ్యాటర్లు ఆశించిన రీతిలో ఆడలేకపోయారు. టీమిండియా ప్రస్తుతం ఇలా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించటానికి కారణం ఇదే. ఈ విధానంలో మార్పు రావాలి’ అని గావస్కర్‌ పేర్కొన్నారు.

‘పవర్‌ ప్లేలో 30 యార్డ్‌ సర్కిల్ వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. గత కొన్ని ఐసీసీ టోర్నమెంట్‌లలో భారతదేశం దాని ప్రయోజనాన్ని పొందట్లేదు. అందుకే మంచి బౌలర్లు ఉన్న బలమైన జట్టుతో తలపడిన ప్రతిసారీ భారత్‌ భారీ స్కోర్లు చేయట్లేదు. కాబట్టి ఆ విధానం మారాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫీల్డింగ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉండాలి. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసిన విధానం, పరుగులు ఆదా చేయడం, క్యాచ్‌లు పట్టిన తీరు ప్రత్యేకంగా నిలిచాయి. బౌలింగ్‌ అటాక్‌ సాధారణంగా ఉన్నప్పటికీ మంచి ఫీల్డింగ్ ఉంటే ఫలితం మరోలా ఉంటుంది. భారత జట్టును పరిశీలిస్తే ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు మాత్రమే అత్యుత్తమ రీతిలో ఫీల్డింగ్‌ చేస్తున్నారు’ అని సన్నీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని