Updated : 03 Nov 2021 12:45 IST

T20 World Cup: అఫ్గాన్‌తో తస్మాత్‌ జాగ్రత్త.. ఏమరుపాటు వహిస్తే షాక్‌ తప్పదు

ఇంటర్నెట్‌ డెస్క్: వరుసగా రెండు ఓటములు.. భారత జట్టుకు  కష్టాలను తెచ్చిపెట్టాయి. టీ20 ప్రపంచకప్‌ కొట్టాలనే అభిమానుల ఆకాంక్షను పక్కన పెడితే.. నాకౌట్‌ దశకైనా చేరాలనే ఆశలూ సంక్లిష్టంగా మారాయి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్ల చేతిలో టీమిండియా ఓటమిపాలైన విషయం విదితమే. గ్రూప్‌ దశలో ఇక మిగిలింది మూడే మ్యాచులు.. అఫ్గాన్‌ (నవంబర్ 3), స్కాట్లాండ్ (నవంబర్ 5), నమీబియా (నవంబర్ 8)తో తలపడనుంది. మూడింట్లోనూ టీమ్‌ఇండియా విజయం సాధించినా.. ఇతర జట్ల ఫలితాలపైనే మన నాకౌట్‌ భవితవ్యం ఆధారపడి ఉండటం శోచనీయం.

టీ20 ప్రపంచకప్‌లో మిగిలిన మూడు మ్యాచుల్లో మనకు కాస్త కఠినమైన ప్రత్యర్థిగా అఫ్గానిస్థాన్‌ను చెప్పుకోవచ్చు. సమష్టిగా రాణిస్తోన్న అఫ్గాన్‌ కుర్రాళ్లు స్కాట్లాండ్‌పై భారీ విజయాన్ని (130 పరుగుల తేడా) నమోదు చేశారు. తర్వాత పాకిస్థాన్‌పైనా గెలిచినంత పనిచేశారు. ఆఖర్లో ఒత్తిడికి గురైన బౌలర్లు మ్యాచ్‌ను పాక్‌కు అప్పగించేశారు. మళ్లీ పుంజుకుని నమీబియాపై (62 పరుగుల తేడా) విజయం సాధించారు. ఈ క్రమంలో బుధవారం అఫ్గాన్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. అయితే పాకిస్థాన్‌కే షాక్‌ ఇచ్చేందుకు యత్నించిన అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం భారత్‌ ఖేల్ ఇక్కడే ముగిసిపోతుంది. ఈ క్రమంలో ఒకసారి 2019 వన్డే వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియా, అఫ్గాన్‌ మ్యాచ్‌ను గుర్తుకు తెచ్చుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ మ్యాచ్‌లో భారత్‌కు అఫ్గాన్‌ ఝలక్‌ ఇచ్చేంత పని చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ను ఎనిమిది వికెట్ల నష్టానికి 224 పరుగులకే కట్టడి చేసింది. విరాట్‌ కోహ్లీ (67), కేదార్‌ జాదవ్‌ (52), విజయ్‌ శంకర్‌ (29), ఎంఎస్ ధోనీ (28) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. అఫ్గాన్‌ బౌలర్లలో నబీ (2/33), నైబ్ (2/51) రాణించారు. ముజీబ్, అఫ్తాబ్‌ ఆలం, రషీద్‌ ఖాన్, రహమ్మత్‌ షా తలో వికెట్ తీశారు. అనంతరం అఫ్గానిస్థాన్‌ 213 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో 45.4 ఓవర్లలో 190/7తో నిలిచింది. 26 బంతుల్లో 34 పరుగుల చేస్తే గెలిచే అవకాశం అఫ్గాన్‌కు ఉంది. అప్పటికే నబీ (52) మంచి ఊపు మీద ఉండటంతో భారత్‌కు భంగపాటు తప్పదేమోనని అంతా భావించారు. అయితే షమీ హ్యాట్రిక్‌ (నబీ, ఆలం, రహ్మాన్‌) వికెట్లను తీసి టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో షమీ 4/40, బుమ్రా 2/39, చాహల్ 2/36, హార్దిక్‌ పాండ్య 2/51 రాణించారు.

అఫ్గాన్‌లో వీళ్లు కీలకం.. 

అఫ్గానిస్థాన్‌ జట్టులో ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌, మహమ్మద్‌ షాహ్‌జాద్‌, గుర్బాజ్‌, జాద్రన్‌, నబీ, నవీన్‌ ఉల్ హక్, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ కీలకం. జజాయ్, షాహ్‌జాద్‌ క్రీజ్‌లో నిలదొక్కుకుంటే భారీ షాట్లు ఆడేస్తారు. వీరిద్దరూ విఫలమైనప్పటికీ గుర్బాజ్‌, నజీబుల్లా, నబీ రూపంలో మిడిలార్డర్‌లో ఆదుకోగల ఆటగాళ్లు ఉన్నారు. లోయర్‌ ఆర్డర్‌లో రషీద్ ఖాన్‌, గుల్బాదిన్‌ ధాటిగా ఆడి పరుగులు రాబడతారు. దాదాపు ఎనిమిది వికెట్ల వరకు లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ అఫ్గాన్‌ సొంతం. ఇక బౌలింగ్‌లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ స్పిన్‌ త్రయం ఉంది. స్పిన్‌ను బాగా ఆడగలుగుతారనుకునే టీమ్‌ఇండియా బ్యాటర్లు గత రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం కలవరపెడుతోంది.  

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌.. అఫ్గాన్‌ స్పిన్‌

రోహిత్‌, కేఎల్‌ రాహుల్, విరాట్ కోహ్లీ, ఇషాన్‌ కిషన్, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య వంటి కీలక బ్యాటర్లు ఉంటే ఎలాంటి ప్రత్యర్థి జట్టైనా హడలెత్తిపోవాల్సిందే. అయితే గత రెండు మ్యాచుల్లోనూ బ్యాటర్లు విఫలం కావడం గమనార్హం. పాకిస్థాన్‌తో కాస్త ఫర్వాలేదనిపించినా.. న్యూజిలాండ్‌తో మాత్రం తేలిపోయారు. క్రీజ్‌లో నిలబడి పరుగులు రాబడదామనే కనీస ఓపిక లేకుండా పోయింది. స్పిన్‌ బౌలింగ్‌లోనూ తడబాటుకు గురికావడం నిరాశపరుస్తోంది. అయితే క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. దీనికి కావాల్సింది స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచడమే. అఫ్గాన్‌ స్పిన్‌ త్రయం నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఎంతో ప్రమాదకరమైన బౌలర్లు. వీరిని తట్టుకుని పరుగులు సాధిస్తే సగం విజయం సిద్ధించినట్లే. కాబట్టి భారత బ్యాటర్లు ఈ ముగ్గురిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వికెట్లను కూల్చేస్తారు. మరీ ముఖ్యంగా కీలకమైన సమయాల్లో బ్రేక్‌త్రూ బౌలర్‌గా పేరొందిన రషీద్‌ ఖాన్‌కు యూఏఈ పిచ్‌ల పరిస్థితిపై పూర్తి అంచనా ఉంది. 

ఇరు జట్లకూ కీలకమే..

సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమ్‌ఇండియా తప్పకగెలవాల్సిందే. అదే సమయంలో నాకౌట్‌పై కన్నేసిన అఫ్గాన్‌కూ ఈ మ్యాచ్‌ కీలకమే. ఇప్పటి వరకు భారత్‌ రెండు మ్యాచ్‌లను ఆడగా.. రెండింటిలోనూ ఓటమిపాలైంది. పాయింట్ల ఖాతానూ తెరవలేదు. మరోవైపు అఫ్గానిస్థాన్‌ మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో ఉంది. పాయింట్ల పట్టికలో (4 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌ నాలుగు విజయాలతో (8 పాయింట్లు) టాప్‌ స్థానంతో సెమీస్‌కు చేరుకున్నట్లే. కివీస్‌ ఒక విజయం, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో (2 పాయింట్లు) మూడో స్థానంలో కొనసాగుతోంది. కివీస్‌కు కూడా అఫ్గాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌తోనే పోరు ఉండటం భారత్‌కు ప్రతికూలాంశం. అన్ని మ్యాచుల్లో గెలిచి మంచి రన్‌రేట్‌ సాధించడంతోపాటు ఇతర జట్ల ఫలితాల మీదే భారత్‌ సెమీస్‌కు వెళ్లడం ఆధారపడి ఉంది. గతంలో అఫ్గాన్‌ మీద టీమ్‌ఇండియా ఆధిపత్యం కలిసొచ్చే అంశం. భారత్‌, అఫ్గానిస్థాన్‌ రెండుసార్లు ముఖాముఖీగా తలపడగా.. రెండింటిలోనూ టీమ్‌ఇండియానే గెలిచింది. 2010 టీ20 ప్రపంచకప్‌లో ఏడు వికెట్లు తేడాతో, 2012 టీ20 ప్రపంచకప్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని