T20 World Cup:టీ20 ప్రపంచకప్‌లో డీఆర్‌ఎస్‌.. ఐసీసీ కీలక నిర్ణయం

యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి పురుషుల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికే చాలా జట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఈ మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలవడానికి ఆయా జట్లు వ్యూహాలను రచిస్తున్నాయి. ఇదిలా ఉండగా, డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌

Published : 10 Oct 2021 20:17 IST

(Photo: ICC Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి పురుషుల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఇప్పటికే చాలా జట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఈ మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలవడానికి ఆయా జట్లు వ్యూహాలను రచిస్తున్నాయి. ఇదిలా ఉండగా, డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ (డీఆర్‌ఎస్‌) విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్‌లో డీఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. పురుషుల టీ20 ప్రపంచకప్‌లో డీఆర్‌ఎస్‌ ఉయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 2018 మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొదటిసారి డీఆర్‌ఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. పురుషుల క్రికెట్‌లో ఐసీసీ నిర్వహించే మేజర్‌ టోర్నీల్లో చూసుకుంటే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్‌, తొలి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో డీఆర్‌ఎస్‌ను అమలుపరిచారు. సాధారణంగా టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లకు ప్రతీ ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా టోర్నీలో తక్కువ అనుభవం ఉన్న అంపైర్లు పనిచేసే అవకాశం ఉన్నందున.. ఇరు జట్లకు  అదనంగా మరో రివ్యూను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఇరు జట్లకు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ  రెండు రివ్యూలు కోరే అవకాశం ఉంటుంది.

డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల్లోనూ ఐసీసీ కీలక మార్పులు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో ఏవైనా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఫలితాన్ని నిర్ణయించాలంటే ఇకపై ప్రతీ జట్టు కనీసం ఐదు ఓవర్లు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. సెమీ ఫైనల్స్‌.. ఫైనల్స్‌లో మాత్రం 10 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తేనే ఈ పద్ధతి ద్వారా ఫలితం తేల్చేందుకు అవకాశం ఉంటుంది. 2018 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈ విధానాన్ని అమలుపరిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని