taniya bhatia: ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?.. హోటల్‌ యాజమాన్యంపై తానియా అసహనం

టీమ్‌ఇండియా మహిళా జట్టు సభ్యురాలు తానియా భాటియా తనకు ఎదురైన చేదు అనుభవంపై మరోసారి ఘాటుగా స్పందించింది.

Updated : 22 Nov 2022 14:02 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మహిళా జట్టు సభ్యురాలు తానియా భాటియా తనకు ఎదురైన చేదు అనుభవంపై మరోసారి ఘాటుగా స్పందించింది. ఇంగ్లాండ్‌తో వన్డే మ్యాచ్‌ సందర్భంగా లండన్‌ వెళ్లిన భారత జట్టు ఒక హోటల్‌లో బస చేసింది. అక్కడ తన బ్యాగు చోరీకి గురైందని ఇటీవల ఆమె వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై హోటల్‌ యాజమాన్యం స్పందించలేదు. ఆ బ్యాగులో ఉన్న వస్తువులు తనకు ఎంతో విలువైనవని దీనిపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది. 

‘‘నా ఫిర్యాదుపై ఇప్పటివరకు యాజమాన్యం స్పందించలేదు. ఇది నిజంగా బాధ కలిగిస్తోంది. చోరీకి గురైన వస్తువులు నాకెంతో విలువైనవి, ముఖ్యమైనవి. ఇప్పటివరకు దీనిపై చర్యలేమైనా తీసుకున్నారా? నాకు తెలియజేస్తే బాగుంటుంది’’ అంటూ తానియా ట్విటర్‌ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. లండన్‌ పర్యటన అనంతరం తానియా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ‘‘మాకు కేటాయించిన హోటల్‌ సురక్షితం కాదు. నా వ్యక్తిగత గదిలోకి ఎవరో వచ్చారు. విలువైన ఆభరణాలు, కార్డులు, నగదు ఉన్న నా బ్యాగును దొంగిలించారు. క్రికెటర్లకు భద్రత కల్పించడంలో ఈసీబీకి భాగస్వామి అయిన ఈ హోటల్‌ ఇంత వైఫల్యం చెందడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వెంటనే దీనిపై విచారణ జరిపి పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నా’’ అని పోస్ట్‌ చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో చార్లీ డీన్‌ను దీప్తి శర్మ రనౌట్‌ (మన్కడింగ్‌) చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని