Mayank-Dravid: ద్రవిడ్‌తో మాట్లాడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి: మయాంక్‌

భారత్‌ ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకత్వంలో పని చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు టీమ్‌ఇండియా బ్యాటర్‌ మయాంక్‌...

Published : 16 Nov 2021 18:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకత్వంలో పని చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు టీమ్‌ఇండియా బ్యాటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ చెప్పాడు. హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో క్రికెట్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. అంతకుముందు రాహుల్‌ భారత్‌ ‘ఏ’ జట్టుకు కోచ్‌గానూ, జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ క్రమంలో రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా రావడంపై మయాంక్‌ అగర్వాల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. భారత్‌ ‘ఏ’ జట్టుకు కోచ్‌ ఉన్న సమయంలో ద్రవిడ్‌ నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకున్నట్లు మయాంక్‌ తెలిపాడు. ‘‘అందరికీ అందుబాటులో ఉండే రాహుల్‌తో మాట్లాడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడే కాదు గతంలోనూ (భారత్‌ ‘ఏ’ జట్టుకు కోచ్‌గా ఉన్నప్పుడు) ఎలాంటి విషయమైనా ఆయనతో పంచుకునేవాళ్లం. ఆ విధంగా ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ద్రవిడ్’’ అని మయాంక్‌ వివరించాడు. 

పద్నాలుగు టెస్టుల్లో 1,052 పరుగులు సాధించిన మయాంక్‌ అగర్వాల్‌ స్వదేశంలో కివీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు.  ‘‘న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక కావడం  ఆనందంగా ఉంది. దీని కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడం సంతృప్తినిచ్చింది. జట్టు యాజమాన్యం నా నుంచి ఏం కోరుకుంటుందో దానిని అందించడానికి కృషి చేశా. కేఎల్‌ రాహుల్, నేను మంచి స్నేహితులం. కేఎల్ రాహుల్‌ గాయపడటంతో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం బాగుంది. కేఎల్‌ రాహుల్‌ ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. నేను క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పుడు.. అప్పటికే కేఎల్ రాహుల్ టీమ్‌ఇండియా జట్టులో ఉన్నాడు. మేమిద్దరం ఓపెనర్లుగా వచ్చినప్పుడు ఆటను ఎంతో ఆస్వాదించేవాళ్లం’’ అని మయాంక్‌ చెప్పుకొచ్చాడు. మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా మయాంక్‌ టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. దానిని జీవితాంతం మరువలేని సంఘటనగా అభివర్ణించాడు. ఓపెనర్‌గా వేర్వేరు దేశాల్లో విభిన్న పరిస్థితుల్లో ఆటడం ఎంతో ఉపకరిస్తుందని చెప్పాడు. ‘‘ఆసీస్‌లో బౌన్సీ పిచ్‌లు, కివీస్‌లో స్వింగ్‌, సీమ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవాలి. మన దేశంలో అయితే స్పిన్‌ను ఆడటం సవాల్‌. అలాంటి మైదానాల్లోనూ రాణించి విజయాలను సాధించాం. స్వదేశంతోపాటు విదేశాల్లోనూ చాలా విజయాలను నమోదు చేశాం’’ అని మయాంక్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని