IND vs AUS: వీర కొట్టుడు.. భారత బ్యాటర్ల విధ్వంసం

ఆందోళన  తొలగిపోయింది. అనుమానాలను, భయాలను పోగొడుతూ శ్రేయస్‌ అయ్యర్‌ చెలరేగిపోయాడు. ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటూ శతక్కొట్టేశాడు.

Updated : 25 Sep 2023 06:47 IST

 శ్రేయస్‌, గిల్‌ శతకాలు
 సూర్యకుమార్‌ విధ్వంసం
 రెండో వన్డేలో ఆసీస్‌ చిత్తు
భారత్‌దే సిరీస్‌

ఆందోళన  తొలగిపోయింది. అనుమానాలను, భయాలను పోగొడుతూ శ్రేయస్‌ అయ్యర్‌ చెలరేగిపోయాడు. ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటూ శతక్కొట్టేశాడు. సమస్య పరిష్కారమైంది సూర్య ఫామ్‌ను అందుకున్నాడు. ప్రతిభ ఉన్నా టీ20 ప్రదర్శనను వన్డేల్లో పునరావృతం చేయలేకపోతున్న అతడు.. ప్రపంచకప్‌లో ఉపయోగపడతాడా అన్న సందేహాలను నివృత్తి చేస్తూ కంగారూలను ఉతికేశాడు. ధీమా పెరిగింది సూపర్‌ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ తనపై అంచనాలను, జట్టు ధీమాను పెంచుతూ అలవోకగా సెంచరీ బాదేశాడు. ఇవన్నీ ఇందౌర్‌లోనే! బ్యాటర్లు దంచికొట్టడంతో పరుగుల వరద పారించిన టీమ్‌ఇండియా రెండో వన్డేలో కంగారూలను చిత్తుగా ఓడించింది. స్పిన్నర్లూ మాయ చేయడంతో ప్రపంచకప్‌ ముందు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంటూ.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకుంది.

ఇందౌర్‌: టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. బ్యాటుతో, బంతితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆతిథ్య జట్టు ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్‌ గిల్‌ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (72 నాటౌట్‌; 37 బంతుల్లో 6×4, 6×6) చెలరేగడంతో మొదట భారత్‌ 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాహుల్‌ (52; 38 బంతుల్లో 3×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (31; 18 బంతుల్లో 2×4, 2×6) కూడా రాణించారు. వర్షం కారణంగా ఆసీస్‌ లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులకు సవరించగా.. అశ్విన్‌ (3/41), జడేజా (3/42), ప్రసిద్ధ్‌ కృష్ణ (2/56) ధాటికి ఆ జట్టు 28.2 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. అబాట్‌ (54; 36 బంతుల్లో 4×4, 5×6) టాప్‌స్కోరర్‌. వార్నర్‌ (53) కూడా రాణించాడు. ఈ విజయంతో సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యం సంపాదించింది. మూడో వన్డే బుధవారం జరుగుతుంది.
అశ్విన్‌ మ్యాజిక్‌: భారీ ఛేదన ఆరంభంలోనే ఆసీస్‌కు ప్రసిద్ధ్‌ షాకిచ్చాడు. రెండో ఓవర్లోనే వరుస బంతుల్లో షార్ట్‌ (9), స్మిత్‌ (0)లను ఔట్‌ చేయడం ద్వారా భారత్‌కు అదిరే ఆరంభాన్నిచ్చాడు. వర్షంతో ఆటకు ఆటంకం ఏర్పడి, లక్ష్యాన్ని సవరించాక అశ్విన్‌ మాయ చేశాడు.  12 పరుగుల వ్యవధిలో కీలకమైన లబుషేన్‌ (27), వార్నర్‌, ఇంగ్లిస్‌ (6)ను ఔట్‌ చేయడం ద్వారా ఆసీస్‌ వెన్నువిరిచాడు. 13వ ఓవర్లో లబుషేన్‌ను బౌల్డ్‌ చేసిన అతడు.. తన తర్వాతి ఓవర్లో వార్నర్‌, ఇంగ్లిస్‌లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అతడి ధాటికి ఆసీస్‌ 89/2 నుంచి 101/5కు చేరుకుంది. 128 వద్ద కేరీ (14)ని జడేజా బౌల్డ్‌ చేయడం, 135 వద్ద గ్రీన్‌ (19) రనౌట్‌ కావడంతో ఆసీస్‌ ఓటమి ఖాయమైపోయింది. అబాట్‌ మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించాయంతే.
దంచేశారు: అంతకుముందు టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌లో అంతా దంచుడే దంచుడు. దాదాపు ప్రతి బ్యాటరూ అదరగొట్టాడు. గిల్‌, శ్రేయస్‌ మెరుపు శతకాలతో బలమైన పునాది వేస్తే.. ఆ తర్వాత రాహుల్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగేలా చేశాడు. ఆఖర్లో సూర్య తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. త్వరగానే రుతురాజ్‌ (8) వికెట్‌ను కోల్పోయినా పరుగుల వేటలో మాత్రం దూసుకుపోయింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన శ్రేయస్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఎదుర్కొన్న తొలి 17 బంతుల్లో శ్రేయస్‌ 32 చేస్తే.. తొలి 19 బంతుల్లో గిల్‌ 9 సాధించాడు. జోరు కొనసాగించిన శ్రేయస్‌.. చూడచక్కని షాట్లతో 41 బంతుల్లో అర్ధశతకం, 86 బంతుల్లో శతకంతో గిల్‌తో కలిసి జట్టును తిరుగులేని స్థితిలో నిలిపాడు. మరోవైపు గిల్‌ ఆరంభంలో మాత్రమే నెమ్మది. ఒక్కసారి కుదురుకున్నాక తనవైన షాట్లతో అభిమానులను మంత్రముగ్దుల్ని చేశాడు. తొమ్మిదో ఓవర్లో అతడి జోరు మొదలైంది. అబాట్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన అతడు.. గ్రీన్‌ వేసిన షార్ట్‌ బంతిని పుల్‌ షాట్‌తో స్టాండ్స్‌లో పడేశాడు. జంపాకు అదే శిక్ష. బ్యాక్‌ఫుట్‌పై లాంగాన్‌లో చూడముచ్చటైన సిక్స్‌ బాదాడు గిల్‌. ఆ తర్వాత అతడు ఎవరినీ వదల్లేదు. ముందు వెనుకబడ్డా.. శ్రేయస్‌ కన్నా త్వరగా 37 బంతుల్లో అర్ధశతకం సాధించిన గిల్‌, 92 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. 33వ ఓవర్లో అబాట్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో అతడు శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకన్నా కాసేపు ముందు శ్రేయస్‌ ఔట్‌ కావడంతో 200 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 243 వద్ద (35వ ఓవర్లో) గిల్‌ కూడా ఔటైనా కెప్టెన్‌ రాహుల్‌ ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇషాన్‌ ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. ఆఖర్లో సూర్య తనదైన శైలిలో, టీ20 తరహాలో విధ్వంసం సృష్టించడంతో పరుగుల వరద పారింది. అతను గ్రీన్‌ వేసిన 44వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. అతడి ధాటికి ఆఖరి 9వ ఓవర్లలో భారత్‌ ఏకంగా 93 పరుగులు రాబట్టింది.


భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) కేరీ (బి) హేజిల్‌వుడ్‌ 8; గిల్‌ (సి) కేరీ (బి) గ్రీన్‌ 104; శ్రేయస్‌ (సి) షార్ట్‌ (బి) అబాట్‌ 105; రాహుల్‌ (బి) గ్రీన్‌ 52; ఇషాన్‌ (సి) కేరీ (బి) జంపా 31; సూర్య నాటౌట్‌ 72; జడేజా నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 399; వికెట్ల పతనం: 1-16, 2-216, 3-243, 4-302, 5-355; బౌలింగ్‌: జాన్సన్‌ 8-0-61-0; హేజిల్‌వుడ్‌ 10-0-62-1; అబాట్‌ 10-0-91-1; గ్రీన్‌ 10-0-103-2; జంపా 10-0-67-1; షార్ట్‌ 2-0-15-0


ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: షార్ట్‌ (సి) అశ్విన్‌ (బి) ప్రసిద్ధ్‌ 9; వార్నర్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 53; స్మిత్‌ (సి) గిల్‌ (బి) ప్రసిద్ధ్‌ 0; లబుషేన్‌ (బి) అశ్విన్‌ 27; ఇంగ్లిస్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 6; కేరీ (బి) జడేజా 14; గ్రీన్‌ రనౌట్‌ 19; అబాట్‌ (బి) జడేజా 54; జంపా (బి) జడేజా 5; హేజిల్‌వుడ్‌ (బి) షమి 23; స్పెన్సర్‌ జాన్సన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (28.2 ఓవర్లలో ఆలౌట్‌) 217; వికెట్ల పతనం: 1-9, 2-9, 3-89, 4-100, 5-101, 6-128, 7-135, 8-140, 9-217; బౌలింగ్‌: షమి 6-0-39-1; ప్రసిద్ధ్‌  6-0-56-2; అశ్విన్‌ 7-0-41-3; శార్దూల్‌ 4-0-35-0; జడేజా 5.2-0-42-3

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు