IND vs AUS: ఆసీస్ భరతం పట్టిన జడ్డూ.. టీమ్‌ఇండియాదే రెండో టెస్టు

ఆసీస్‌పై రెండో టెస్టులోనూ (IND vs AUS) భారత్‌ విజయం సాధించింది. బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) టీమ్‌ఇండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో భారత్‌ సిరీస్‌ను కోల్పోవడం మాత్రం జరగదు. మూడో టెస్టు మ్యాచ్‌ మార్చి 1 నుంచి ఇందౌర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇందులోనూ గెలిస్తే టెస్టుల్లో టాప్‌ ర్యాంక్‌తోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లడం ఖాయం.

Updated : 19 Feb 2023 15:13 IST

ఇంటర్నెట్ డెస్క్: నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (Team India) అనూహ్య రీతిలో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు వెనుకబడిన భారత్‌.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసి మరీ గెలవడం విశేషం. మూడో రోజు తొలి సెషన్‌లో జరిగిన నాటకీయ పరిణామాలే టీమ్‌ఇండియా విజయానికి సోపానాలుగా మారాయి. 

దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs AUS)భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయగా.. భారత్‌ 262 పరుగులు చేసింది. దీంతో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఆసీస్‌ 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రవీంద్ర జడేజా (7/42), రవిచంద్రన్ అశ్విన్ (3/59) ఆసీస్ భరతం పట్టారు. ఈ మ్యాచ్‌లో జడేజా 110 పరుగులకు పది వికెట్లు పడగొట్టాడు. ఇవే టెస్టుల్లో అతడి అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. 

ఒకే ఒక్క సెషన్‌.. జడ్డూ మాయ

తొలి రెండు రోజుల ఆటలో భారత్‌, ఆసీస్‌ సరిసమాన ప్రదర్శనతో అలరించాయి. అయితే మూడో రోజు తొలి సెషన్‌ మాత్రం టీమ్‌ఇండియాదే. మరీ ముఖ్యంగా భారత టాప్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ముందుండి నడిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ 61/1 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు భారత స్పిన్‌ ద్వయం అశ్విన్‌, జడేజా అడ్డుగా నిలిచారు. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యం 200 పరుగులు దాటితే కష్టమేననే అంచనాల నేపథ్యంలో ఆసీస్‌ను 113 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కాస్త దూకుడుగా ఆడిన ట్రావిస్‌ హెడ్ (43)ను ఔట్‌ చేసి అశ్విన్‌ ఇవాళ వికెట్ల వేటను ప్రారంభించగా.. మిగతా పనిని జడేజా పూర్తి చేశాడు. హెడ్‌తోపాటు లబుషేన్ (35) మినహా ఎవరూ రెండంకెల స్కోరును చేయలేదంటే భారత స్పిన్నర్ల బౌలింగ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోసారి స్టీవ్‌ స్మిత్ (9)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. చివరి ఐదు వికెట్లను రవీంద్ర జడేజానే పడగొట్టాడు. అందులోనూ నలుగురు ఆసీస్ బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేయడం గమనార్హం. ఖవాజా 6, రెన్‌షా 2, హ్యాండ్స్‌కాంబ్ డకౌట్, అలెక్స్ క్యారీ 7, కమిన్స్ డకౌట్, లయన్ 8, మర్ఫీ 3* పరుగులు సాధించారు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం  పది వికెట్లూ భారత స్పిన్నర్లే తీశారు. 

పుజారాకు విన్నింగ్‌ షాట్‌..

ఆసీస్‌ నిర్దేశించిన 115 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. అద్భుతంగా బౌలింగ్‌ వేస్తున్న లయన్‌ బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమైన టీమ్ఇండియా వైస్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్ (1) కీపర్ అలెక్స్‌ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమైన రాహుల్‌పై విమర్శల దాడి పెరగడం ఖాయం. అయితే, కెప్టెన్‌ రోహిత్ శర్మ (31: 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ఛెతేశ్వర్‌ పుజారా (31*)తో జరిగిన సమన్వయలోపంతో రనౌట్‌ రూపంలో రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. అయితే తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (20)తో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే మర్ఫీ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన కోహ్లీ స్టంపౌట్‌ అయిపోయాడు. ఇలా విరాట్ తన టెస్టు కెరీర్‌లో (180 ఇన్నింగ్స్‌ల్లో) తొలిసారి స్టంపౌట్‌ కావడం గమనార్హం. ఇదే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 25వేల పరుగులను పూర్తి చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ (12) వేగంగా ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. శ్రీకర్‌ భరత్‌ (23*)తో కలిసి మరో వికెట్‌ పడనీయకుండా పుజారా జట్టును విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్‌ షాట్‌ కూడా పుజారాదే కావడం విశేషం. వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న పుజారాకు ఇదొక విన్నింగ్‌ గిఫ్ట్‌. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన బాధలో ఉన్న పుజారాకు మ్యాచ్‌ విజయం ఊరటనిచ్చింది. ఆసీస్ బౌలర్లు లయన్ 2, మర్ఫీ ఒక వికెట్ తీశారు.

తొలి హీరో అక్షర్‌ పటేల్.. 

భారత్‌ విజయానికి పునాది వేసింది మాత్రం అక్షర్‌ పటేల్ ఇన్నింగ్సే.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 263 పరుగులకు దగ్గరగా భారత్‌ వచ్చిందంటే దానికి కారణం అక్షర్. 139 పరుగులకే ఏడు వికెట్లు పడిన వేళ.. అశ్విన్‌ (37)తో కలిసి అక్షర్ పటేల్ (74) హాఫ్ సెంచరీ సాధించి జట్టును గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాడు. లేకపోతే టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఆలౌటై ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. విరాట్ కోహ్లీ (44), రోహిత్ శర్మ (32) కూడా కీలకమైన పరుగులు రాబట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్‌ లయన్‌ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు