IND vs ZIM: 102కు కూలిన జట్టే 100 తేడాతో..

ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. యువ భారత్‌ బలంగా పుంజుకుంది. జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన శుభ్‌మన్‌ బృందం.. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది.

Updated : 08 Jul 2024 06:45 IST

రెండో టీ20లో జింబాబ్వేపై భారత్‌ ఘనవిజయం
అభిషేక్‌ మెరుపు శతకం
హరారె

ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. యువ భారత్‌ బలంగా పుంజుకుంది. జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన శుభ్‌మన్‌ బృందం.. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. తన తొలి అంతర్జాతీయ టీ20లో డకౌటైన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ.. విధ్వంసక బ్యాటింగ్‌తో 46 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. ఆరంభ మ్యాచ్‌లో 102కే కుప్పకూలిన భారత్‌.. ఈసారి 100 పరుగుల తేడాతో గెలవడం విశేషం.

జింబాబ్వే పర్యటనలో తొలి మ్యాచ్‌లో భంగపడ్డ టీమ్‌ఇండియా రెండో టీ20లో కసిగా చెలరేగిపోయింది. అభిషేక్‌ శర్మ (100; 47 బంతుల్లో 7×4, 8×6) మెరుపు శతకం బాదడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను మట్టికరిపించింది.  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌తో పాటు రుతురాజ్‌ (77 నాటౌట్‌; 47 బంతుల్లో 11×4, 1×6), రింకు సింగ్‌ (48 నాటౌట్‌; 22 బంతుల్లో 2×4, 5×6) రెచ్చిపోవడంతో మొదట భారత్‌ 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. టీ20ల్లో జింబాబ్వేపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. అవేష్‌ ఖాన్‌ (3/15), ముకేశ్‌ కుమార్‌ (3/37), రవి బిష్ణోయ్‌ (2/11) ధాటికి ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. వెస్లీ మధెవెర్‌ (43; 39 బంతుల్లో 3×4, 1×6), జాంగ్వి (33) రాణించారు. ఈ విజయంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. మూడో టీ20 బుధవారం జరుగుతుంది.

దంచేశాడు..: తొలి మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో కుప్పకూలిన టీమ్‌ఇండియా ఈసారి అదరగొట్టింది. జింబాబ్వే బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ పరుగుల వరద పారించింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆటే హైలైట్‌. ఈ ఏడాది ఐపీఎల్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ ఆకర్షించిన అతడు.. ఇప్పుడు జింబాబ్వేపైనా అదే ఆటను పునరావృతం చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌ (జింబాబ్వేతో తొలి టీ20)లో డకౌట్‌తో నిరాశకు గురైన అభిషేక్, ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 33 బంతుల్లో అర్ధశతకం, 46 బంతుల్లో సెంచరీ దంచేశాడు. నిజానికి భారత్‌ ఆరంభం గొప్పగా ఏమీ లేదు. ఏడు ఓవర్లు ముగిసే సరికి స్కోరు 40/1. గిల్‌ రెండో ఓవర్లోనే ఔట్‌ కాగా.. అభిషేక్‌ ఎదుర్కొన్న 21 బంతుల్లో 25 పరుగులు చేశాడు. రుతురాజ్‌ ధాటిగా ఆడలేకపోయాడు. అయితే ఎనిమిదో ఓవర్లో, రజా బౌలింగ్‌లో వరుసగా 4, 6 దంచిన అభిషేక్‌.. అక్కడి నుంచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఫోర్లు, సిక్స్‌లతో అదరగొట్టాడు. 11వ ఓవర్లో (రజా) అతడు వరుసగా 4, 6, 4, 6, 4 దంచాడు. ముఖ్యంగా ఎక్స్‌ట్రా కవర్లో అభిషేక్‌ సిక్స్‌ కొట్టి అర్ధశతకం పూర్తి చేసిన తీరును చూసి తీరాల్సిందే. జోరును కొనసాగించిన అతడు.. మసకద్జ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. 14వ ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 147. అభిషేక్‌తో రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించిన రుతురాజ్‌ ఆ తర్వాత రింకుతో కలిసి మరో చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దూకుడు పెంచి చక్కని షాట్లతో అలరించాడు. చటార ఓవర్లో రుతురాజ్‌ వరుసగా 4, 6, 4, 4 దంచేశాడు. మరోవైపు రింకు కూడా తనదైన శైలిలో రెచ్చిపోవడంతో ఆఖరి 5 ఓవర్లలో భారత్‌ 82 పరుగులు రాబట్టింది. ముజరబాని, జాంగ్వి ఓవర్లలో రింకు రెండేసి సిక్స్‌లు కొట్టాడు. ఆఖరి 10 ఓవర్లలో భారత్‌ 160 చేయడం విశేషం.

తేలిపోయిన జింబాబ్వే: భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే తేలిపోయింది. భారత పేసర్ల ధాటికి బెంబేలెత్తిన ఆ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. ముకేశ్, అవేష్‌ జింబాబ్వే వెన్ను విరిచారు. ముకేశ్‌ తొలి ఓవర్లోనే ఇన్నోసెంట్‌ కైయా (4)ను ఔట్‌ చేసిన పతనాన్ని ఆరంభించగా.. కాసేపు చెలరేగి ఆడిన   బెనెట్‌ (26; 9 బంతుల్లో 1×4, 3×6)ను బిష్ణోయ్‌ వెనక్కి పంపాడు. ఆ తర్వాత మైయర్స్‌ (0), రజా (4)లను అవేష్‌ ఎక్కువసేపు నిలునివ్వలేదు. జింబాబ్వే 46కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు పోరాడుతున్న మధెవెర్‌కు సహకారం అందలేదు. క్యాంప్‌బెల్‌ (10) నిలిచినా అది కాసేపే. ఓ దశలో 72/4తో ఉన్న జింబాబ్వే చకచకా మూడు వికెట్లు కోల్పోయింది. క్యాంప్‌బెల్‌ను సుందర్, మడాండే (0)ను బిష్ణోయ్‌ ఔట్‌ చేయగా.. మసకద్జ (1) రనౌటయ్యాడు. 76/7తో జింబాబ్వే ఓటమి ఖాయమైపోయింది. ఆ తర్వాత జింబాబ్వే ఆట ఓటమి అంతరాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే.

స్కోరు వివరాలు: భారత్‌ ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (సి) బెనెట్‌ (బి) ముజరబాని 2; అభిషేక్‌ శర్మ (సి) మైయర్స్‌ (బి) మసకద్జ 100; రుతురాజ్‌ గైక్వాడ్‌ నాటౌట్‌ 77; రింకు సింగ్‌ నాటౌట్‌ 48; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 234; వికెట్ల పతనం: 1-10, 2-147; బౌలింగ్‌: బ్రయాన్‌ బెనెట్‌ 2-0-22-0; ముజరబాని 4-1-30-1; చటార 4-0-38-0; సికందర్‌ రజా 3-0-34-0; ల్యూక్‌ జాంగ్వి 4-0-53-0; మైయర్స్‌ 1-0-28-0; మసకద్జ 2-0-29-1

జింబాబ్వే ఇన్నింగ్స్‌: ఇన్నోసెంట్‌ కైయా (బి) ముకేశ్‌ 4; వెస్లీ మధెవెర్‌ (బి) బిష్ణోయ్‌ 43; బెనెట్‌ (బి) ముకేశ్‌ 26; మైయర్స్‌ (సి) రింకు (బి) అవేష్‌ ఖాన్‌ 0; సికందర్‌ రజా (సి) జురెల్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 4; క్యాంప్‌బెల్‌ (సి) బిష్ణోయ్‌ (బి) సుందర్‌ 10; క్లైవ్‌ మడాండే ఎల్బీ (బి) బిష్ణోయ్‌ 0; మసకద్జ రనౌట్‌ 1; ల్యూక్‌ జాంగ్వి (సి) రుతురాజ్‌ (బి) ముకేశ్‌ 33; ముజరబాని (సి) సుందర్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 2; చటార నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (18.4 ఓవర్లలో ఆలౌట్‌) 134; వికెట్ల పతనం: 1-4, 2-40, 3-41, 4-46, 5-72, 6-73, 7-76, 8-117, 9-123; బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 3.4-0-37-3; అభిషేక్‌ శర్మ 3-0-36-0; అవేష్‌ ఖాన్‌ 3-0-15-3; రవి బిష్ణోయ్‌ 4-0-11-2; వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-28-1; రియాన్‌ పరాగ్‌ 1-0-5-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని